లక్నో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లుగా కన్పిస్తోంది. సీట్ల పంపకంలో తేడా రావడంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి.. కాంగ్రెస్‌తో జతకట్టే విషయంలో యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా కాంగ్రెస్ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ పార్టీలు మాత్రమే కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. బీఎస్పీ, ఆరెల్డీలతో పొత్తుతో సంతోషంగా ఉన్నామన్న అఖిలేశ్.. సీట్ల పంపకం విషయమై చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ‘ప్రాంతీయ పార్టీలుగా మాకు పట్టు ఉంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ విషయం వేరు. ఇక సీట్ల విషయానికొస్తే సయోధ్య కుదిరితేనే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని గోరఖ్‌పూర్ ఉప ఎన్నిక సమయంలోనే స్పష్టం చేశాను. ఈ విషయంలో బీఎస్పీని పూర్తిగా నమ్ముతున్నాను. అయినప్పటికీ రాహుల్ గాంధీ ఎప్పటికీ మాకు మంచి మిత్రుడేనంటూ’ ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment