అధికార భూమాయ
అధికార భూమాయ
Published Wed, Nov 23 2016 3:12 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
శ్రీకాళహస్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు నడుం బిగించిన తరుణంలో అధికార పార్టీ నాయకులు అప్పనంగా పరిహారం పొందేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ఆక్రమించుకునేశారు. రెవెన్యూ అధికారులతో కలసి తమ అనుభవంలోనే ఈ భూములు ఉన్నట్లు కనికట్టు చూపుతున్నారు.
శ్రీకాళహస్తి రూరల్: వెలంపాడు పంచాయతీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఏకమై ఈ ఏడాది జూలై నెలలో ఓ ప్రైవేటు సర్వేయర్ సాయంతో సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఓ రెవెన్యూ అధికారిని మచ్చిక చేసుకుని చెట్టుపుట్ట కొట్టి తీర్చుకుని 60 ఎకరాలు పంచుకుని దర్జాగా మినుము పంట సాగుచేసిన ఘటన మండలంలోని వెలంపాడులో తాజాగా వెలుగు చూసింది.
గతేడాది ఇవే భూములను ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా అప్పట్లో సాక్షి దినపత్రికలో భూ ఆక్రమణలపై కథనాలు రావడతో అప్పటి తహశీల్దార్ చంద్రమోహన్ అడ్డుకట్ట వేశారు. అరుుతే నాలుగు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ బదిలీపై వెళ్లడం, దీనికి తోడు భూ సేకరణకు సంబంధించి ప్రక్రియ మండలంలో జోరుగా జరుగుతున్న నేపథ్యంలో మరోసారి టీడీపీ తమ్ముళ్లు పరిహారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నారు.
రూ.6 కోట్లు పై మాటే
మన్నవరం భెల్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వెలంపాడు రెవెన్యూ పరిధిలో 178, 185 వ బ్లాక్‌లో 225 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 150 ఎకరాల భూమిని ప్రభుత్వం రెండేళ్ల కిందట ఏపీఐఐసీకి అప్పగించింది. అప్పట్లో ఏపీఐఐసీ మేనేజర్ ప్రతాప్, అప్పటి తహశీల్దార్ చంద్రమోహన్‌తో కలసి భూములను పరిశీలించి భూములకు సంబంధించి రికార్డులను సిద్దం చేసి, వారికి అందించారు. అరుుతే తాజా భూసేకరణ నేపథ్యంలో ఆక్రమణ చోటు చేసుకుంది. ఓ రెవెన్యూ అధికారి సహకారంతో ఇదే అదునుగా భావించి వెలంపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బ్లాక్ నంబర్ 178లో దామరాకులగుంట నుంచి మామిడిగుంటకు వెళ్లేదారిలో 30 ఎకరాలు, అదే బ్లాక్‌లో రేపల్లికండ్రిగ చెరువు వద్ద 30 ఎకరాలు దర్జాగా ఆక్రమించారు. అనంతరం జేసీబీ యంత్రాలు పెట్టి చెట్టు, పుట్ట కొట్టి ప్రభుత్వ భూములను తీర్చేశారు.
వారం రోజుల కిందట ఆ భూములను చదును చేసి మినుము పంట సాగుచేశారు. ఈ ఆక్రమిత భూములు విలువ రూ.6 కోట్లు పైమాటే. ఏపీఐఐసీకి అప్పగించారని తెలిసినా ఖాతరు చేయకుండా గత వారం రోజుల నుంచి ఇదే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. కొంత మంది స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీఐఐసీ పరిశ్రమలు తీసుకొచ్చేలోపు ఆ భూముల్లో పంటలు సాగుచేసి భూ సేకరణ బృందానికి తమ పేర్లను సూచించి అనుభవం డబ్బులు కాజేయాలని రచించిన పన్నాగం పూర్తరుుంది.
అనుభవంలోకి మార్చడానికి ప్రయత్నాలు
వెలంపాడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా 60 ఎకరాల్లో చెట్లను తొలగించి ఏదో ఒక పంట సాగు చేస్తే అనుభవం కింద మార్చివేస్తానని ఓ రెవెన్యూ అధికారి టీడీపీ తమ్ముళ్లకు భరోసా ఇచ్చారని సమాచారం. వచ్చిన పరిహారంలో రెవెన్యూ అధికారికి వాటా ఇచ్చేలా రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం .
మాకు సంబంధం లేదు
ఏపీఐఐసీకి భూములు అప్పగించాక వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదే. ఇప్పుడు ఆ భూములపై మాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటనా స్థలానికి రెవెన్యూ సిబ్బందిని పంపించి విచారిస్తాం. తర్వాత ఏపీఐఐసీ అధికారులకు సమాచారం అందిస్తాం.
- రమేష్‌బాబు, తహశీల్దార్, శ్రీకాళహస్తి
Advertisement
Advertisement