అక్రమ రవాణాకు రైట్‌.. రైట్‌ | Granite Smuggling In Kurnool | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాకు రైట్‌.. రైట్‌

Published Thu, Oct 4 2018 2:35 PM | Last Updated on Thu, Oct 4 2018 2:35 PM

Granite Smuggling In Kurnool - Sakshi

నాపరాళ్లు రవాణా చేస్తున్న లారీకి టార్పాలిన్‌ కప్పిన దృశ్యం

అది జిల్లా సరిహద్దులోని చెక్‌ పోస్ట్‌.. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే కేంద్రాల్లో దానిదే మొదటి స్థానం. అలాంటి కేంద్రంలో సిబ్బంది అక్రమార్జనకు అలవాటుపడ్డారు. వాహనాల యజమానులు, మధ్యవర్తులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేయి తడుపుకొని రైట్‌ చెబుతున్నారు. ఫలితంగా ఏడాదికి రావాల్సిన దాదాపు రూ.15 కోట్ల ఆదాయంలో రూ.మూడు కోట్ల వరకు పక్కదారి పడుతోంది.  

కర్నూలు, కొలిమిగుండ్ల: భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో బందార్లపల్లె క్రాస్‌ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన రాయల్టీ తనిఖీ కేంద్రం అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన తనిఖీ కేంద్రం సిబ్బందే అందినకాడికి తీసుకుని రైట్‌ చెప్పేస్తున్నారనే విమర్శలున్నాయి. నాపరాతి గనుల నుంచి ట్రాక్టర్లు, లారీల ద్వారా నాపరాళ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి
చేస్తుంటారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో రాయల్టీని ప్రింట్‌ తీసుకొని చెక్‌పోస్ట్‌ వద్ద
అధికారులతో తనిఖీ చేయించాకే రవాణా చేయాల్సి ఉంటుంది. చాలా మంది యజమానులు అధికారులు, మధ్యవర్తులతో సన్నిహిత సంబం«ధాలు ఏర్పాటు చేసుకొని వాహనానికో రేటు చొప్పున విధించి హద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

ఆన్‌లైన్‌ రాయల్టీ..  
1996లో మొదట అంకిరెడ్డిపల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. బందార్లపల్లె, తుమ్మలపెంట, గొర్విమానుపల్లె గ్రామాల నుంచి వాహనాలు తనిఖీ కేంద్రానికి సంబంధం లేకుండా వెళ్లిపోతుండటంతో బందార్లపల్లె క్రాస్‌ రోడ్డులోని జిల్లా సరిహద్దుకు మార్పు చేశారు. మొదట్లో రాయల్టీలు బుక్‌ రూపంలో ఉండటంతో పాటు తక్కువ ధర ఉండేది. క్రమేపీ ధరలు పెరుగుతూ వచ్చాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆన్‌లైన్‌ రాయల్టీని అమలు చేసింది. రాయల్టీల ధర కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం ఏటా ప్రభుత్వానికి కేవలం రాయల్టీల రూపంలోనే దాదాపు రూ.15 కోట్లకు పైగా ఆదాయం రావాల్సి ఉన్నా అధికారుల అక్రమార్జన వల్ల రూ.3కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది.  

సాగుతోంది ఇలా..
నాపరాళ్లను రవాణా చేయాలంటే ట్రాక్టర్‌కు రూ.500, ముప్పై టన్నుల లారీకి రూ.3వేల చొప్పున ఆన్‌లైన్‌ రాయల్టీ పొందాల్సి ఉంది. రోజుకు 500కు పైగానే ట్రాక్టర్లు, 80 వరకు లారీలు రవాణా సాగిస్తుంటాయి. లారీలకు రాయల్టీ లేకుండా సిబ్బంది వెయ్యి రూపాయలు మామూళ్లు పుచ్చుకొని పంపిస్తున్నారు. ట్రాక్టర్లకు సైతం రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్‌ యజమానులతో నెల మామూళ్లు ఏర్పాటు చేసుకున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఇక రాయల్టీలు లేకుండా రోజూ 40 లారీలకు పైగానే సాగిపోతున్నట్లు సమాచారం. చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి లారీల రూపంలోనే రూ.40 వేల అక్రమార్జన వస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ప్రకాశం, తదితర జిల్లాల నుంచి గ్రానైట్‌ రాయిని అనంతపురం జిల్లాలోని ఫ్యాక్టరీలకు తరలించాలంటే ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్లాల్సిందే. గ్రానైట్‌ లారీలకు రూ.3వేల వరకు బహిరంగంగానే వసూలు చేస్తున్నారు. తాడిపత్రి సమీపంలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీల నుంచి ఇళ్లకు తీసుకెళ్లే గ్రానైట్‌ రాళ్ల నుంచి రూ.2వేలు రాబడుతున్నారు.  

సీసీ కెమెరాలు ఉన్నా..
రాయల్టీ చెక్‌పోస్ట్‌లో పేరుకు మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అక్రమంగా రవాణా చేసే వాహనాలను పట్టుకునేందుకు వీలు లేకుండా సీసీ కెమెరాలను ఆఫ్‌ చేస్తున్నట్లు సమాచారం. లారీల్లో ఇతర రాష్ట్రాలకు నాప, పాలీష్‌ రాళ్లను తరలించే వ్యక్తులు రాళ్లు కనిపించకుండా టార్పాలిన్లను కప్పుకొని వెళ్తున్నారు. అయినా సిబ్బంది అంతోఇంతో పుచ్చుకొని లారీలను తనిఖీ చేయడంలేదనే విమర్శలున్నాయి. మరికొంతమంది లారీల యజమానులు ముందుగానే సిబ్బందికి మామూళ్లు ఇస్తుండటంతో వారికి సంబంధించిన లారీలవైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. తనిఖీ కేంద్రం వద్దనే గేటు ఏర్పాటు చేసినా ఏనాడూ వాటిని ఉపయోగించిందిలేదు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారుల తనిఖీలు జరిగిన దాఖలాలు మచ్చుకైనా కనిపించవు.  

అలాంటిదేమీ లేదు  
రాయల్టీ చెక్‌పోస్టులో డబ్బులు తీసుకొని లారీలు, ట్రాక్టర్లను పంపడమనేది లేదు. అలాంటిదేమైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. నాపరాళ్లను తరలించే లారీలకు టార్పాలిన్లు కట్టుకొని వెళ్తున్న విషయంపై దృష్టి సారిస్తాం.  – వెంకటరెడ్డి, మైనింగ్‌ ఏడీ,బనగానపల్లె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement