అక్రమాల ‘గనులు’
♦ అడ్డూ అదుపూ లేకుండా గ్రానైట్ అక్రమ ఎగుమతులు
♦ {పభుత్వ ఆదాయానికి భారీగా గండి
♦ కనీస చర్యలు తీసుకోని యంత్రాంగం
♦ అక్రమార్కులకు అధికారపార్టీ నేతల సహకారం
పన్నులు కట్టకుండా తరలిస్తున్నా... పట్టించుకునే నాథుడే ఉండరు. ఎగుమతుల పేరుతో వందల కోట్ల రూపాయల రాయల్టీని ఎగవేస్తున్నా.. {పభుత్వాలు చర్యలు తీసుకోవు. ఇంకా మాట్లాడితే తమ అక్రమాలకు అధికారులు, అధికారపార్టీ నాయకుల వాహనాలను, చిరునామాలనూ ఉపయోగించగలరు. శ్రుతిమించిన గ్రానైట్ అక్రమ వ్యాపారం అనంతపురం జిల్లాలో ఏకంగా రైలును ఢీకొట్టి ఓ ఎమ్మెల్యేతో పాటు నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రానైట్ వ్యాపారుల ఆగడాలపై కథనం..
సాక్షి, చిత్తూరు : గ్రానైట్ గనులు.. జిల్లాలోని వ్యాపారులకు మణి, మాణిక్యాలుగా మారాయి. దీంతో జిల్లాలో వీరి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యంతోపాటు... అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతోంది. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్‌ను నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలోని మంగళూరు ఫోర్ట్‌ల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా నుంచి అరబ్ దేశాలతో పాటు యూరోపియన్ యానియన్ ,చైనా, జపాన్ దేశాలకు గ్రానైట్ ఎక్కువగా తరలిపోతోంది.
మైనింగ్ అధికారులతో పాటు వాణిజ్య పన్నులు, రవాణా, పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్ తదితర విభాగాలు అందిన కాడికి దండుకుని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో అధికారపార్టీ నేతల మితిమీరిన జోక్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పైగా చాలా మంది నాయకులకు ఈ వ్యాపారంతో ప్రతక్ష్య, పరోక్ష సంబంధాలు ఉండడం కూడా అక్రమార్కులకు వరంగా మారింది.
జిల్లా వ్యాప్తంగా 330 పైగా వర్కింగ్ గ్రానైట్ గనులు ఉన్నాయి. జీ-20, ఇంగ్లీష్ టీక్, మేప్లవర్, మదనపల్లివైట్, పుంగనూరువైట్, గ్రీన్, పీకార్‌గ్రీన్, వైట్‌రోజ్, చిత్తూరు ఫ్యారడైజ్ తదితర గ్రానైట్ రకాలు ఉన్నాయి. వీటిలో దాదాపు చాలా రకాల గ్రానైట్‌కు ఇతర దేశాలలో డిమాండ్ ఉంది. దీంతో గ్రానైట్ యజమానులు లారీల ద్వారా కృష్ణపట్నం, చెన్నై, మంగుళూరు పోర్టులకు తరలించి అక్కడి నుండి విదేశాలకు చేరవేస్తున్నారు. ప్రతి రోజూ వెయ్యి క్యూబిక్ మీటర్ల బ్లాకులకు తగ్గకుండా గ్రానెట్ రాయి ఎగుమతి అవుతోంది.
ఎగుమతి బ్లాకులలో 75 శాతం పైగా అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 400 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉండగా వాటి పరిధిలో రెండు వేల కటింగ్ మిషన్లు ఉన్నాయి. ఒక్కో కటింగ్ మిషన్ పరిధిలో రోజుకు ఒక్క క్యూబిక్‌మీటర్ రాయి చొప్పున మొత్తం రెండు వేల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం. ఇక వెయ్యి క్యూబిక్‌మీటర్లకు పైగా రాయి ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. మొత్తం కలిపితే రోజుకు మూడువేల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం. ఈ లెక్కన జిల్లాలోని 330 గనుల పరిధిలో రోజుకు 10 క్యూబిక్ మీటర్ల రాయిని తీయాల్సి ఉంది. ఒక్కో క్యూబిక్ మీటరు రాయికి రూ. రెండు వేలు రాయల్టీ చెల్లించాల్సివుంది.
ఈ మూడువేల క్యూబిక్ మీటర్లకు ఏడాదికి రూ.220 కోట్ల రాయల్టీ రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఏడాదికి కేవలం 84 కోట్లకు మించి రాయల్టీ రావడం లేదు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడుతో గ్రానైట్ తరలుతోంది. పర్మిట్లు ఉండవు, వాణిజ్య పన్నులశాఖకు పన్నులు చెల్లించరు. గతంలో అక్రమ రవాణా రాత్రిళ్లు జరిగేది. టీడీపీ అధికారంలోకి రావడంతో అక్రమ రవాణా పగటిపూట సాగుతోంది. గ్రానైట్ రాయిని 400 లారీలు నిత్యం ఎగుమతి చేస్తుండగా వాటిల్లో 350 లారీలు అధికార పార్టీ ముఖ్యనేతలవే కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ఓ అధికారి సాక్షితో చెప్పడం పరిస్థితిని తెలియజేస్తోంది.