కొలిమిగుండ్ల: మధ్యాహ్న భోజన పథకంపై అధికారపార్టీ నాయకుల కన్ను పడింది. ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలల్లో వంట ఏజెన్సీలుగా తమ వాళ్లే ఉండాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే..స్థానిక జెడ్పీ ఉన్నత, మోడల్ స్కూల్‌తో పాటు ప్రాథమిక మెయిన్, బీసీ, ఎస్సీ ప్రాథమిక పాఠశాలల్లో గత కొన్నేళ్లుగా గ్రామైక్య సంఘాల మహిళలు మధ్నాహ్న భోజనం తయారు చేసి వడ్డిస్తున్నారు.
పార్టీలకు సంబంధం లేకుండా వీరు పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక ఆ పార్టీనాయకులు, కార్యకర్తల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్న వంట ఏజెన్సీలను తొలగించి తమవారికి అవకాశం కల్పించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరికొందరు రెండు రోజులుగా గ్రామాల్లో కలియ తిరుగుతూ ఇతరులు వంట చేస్తున్నారని, నిర్వహణ సరిగా లేదని విద్యార్థులతో గుట్టుచ ప్పుడు కాకుండా సంతకాలు సేకరిస్తున్నారు. తర్వాత ఈసంతకాలు, ఫిర్యాదులతో ఎంఈవోను కలిసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇటీవల ఇటిక్యాల డిపెప్ ప్రాథమిక పాఠశాలలో టీడీపీ వర్గీయులకు చెందిన ఓ మహిళ ఏకంగా ఇంటి వద్దనే వంట చేసి తీసుకెళ్లి పాఠశాలలో విద్యార్థులకు వడ్డించింది. ఈమెకు ఎవరూ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించలేదు. ఇదే విషయాన్ని అదే పాఠశాలలో ఐదేళ్లుగా వంట తయారు చేస్తున్న నిర్వాహకురాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తనకు తెలియజేయకుండా మరొకరికి ఏజెన్సీ ఎప్పుడు అప్పగించారని ప్రశ్నించింది. ఖంగుతున్న అధికారులు విచారించి ఐదేళ్లుగా కొనసాగుతున్న నిర్వాహకురాలికే బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం వివిధ గ్రామాలకు చెందిన వంట ఏజెన్సీలు ఇన్‌చార్జి తహశీల్దార్‌తో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులను కలిశారు. కారణం లేకుండా తమను తొలగించరాదని, మధ్యాహ్నభోజన పథకంలో రాజకీయ జోక్యం తగ్గించాలని వారు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే.
‘వంట’ ఏజెన్సీలపై తమ్ముళ్ల కన్ను!
Published Mon, Jul 21 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM
Advertisement
Advertisement