kolimigundla
-
28న కొలిమిగుండ్లలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, కొలిమిగుండ్ల (నంద్యాల జిల్లా): కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తికావడంతో ఈ నెల 28న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో హెలిప్యాడ్‌ను కంపెనీ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. అక్కడి నుంచి సీఎం నేరుగా ఫ్యాక్టరీలోకి చేరుకొని స్విచ్ ఆన్‌చేసి పరిశ్రమను ప్రారంభిస్తారు. సీఎం వైఎస్ జగన్ కొలిమిగుండ్ల మండలంలో తొలిసారిగా అడుగుపెట్టనుండడం గమనార్హం. పరిశ్రమ నుంచి ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేయనున్నారు. చదవండి: (ఆ విషయంపై కేటీఆర్, మహారాష్ట్ర సీఎం కేంద్రాన్ని ప్రశ్నించారు: సీఎం జగన్) -
మాల్‌ప్రాక్టీస్ వ్యవహారం.. 22 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్
సాక్షి, నంద్యాల జిల్లా: కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో తెలుగు పరీక్ష రోజే మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన 22 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. వీరిలో చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, కస్టోడియన్, తొమ్మిది మంది ఇన్విజిలేటర్లతో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఉన్నారు. ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేయడంతో ఇద్దరు సీఆర్పీలు, పది మంది ఉపాధ్యాయులు, తొమ్మిది మంది ఇన్విజిలేటర్లు మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరంతా సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల ప్రకారం 48 గంటల పాటు రిమాండ్‌లో ఉంటే సస్పెండ్‌కు గురవుతారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ అయిన వారిలో చీఫ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన సుధాకర్ గుప్త(పెట్నికోట), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, కస్టోడియన్ రాఘవయ్య (తిమ్మనాయినపేట), ఉపాధ్యాయులు నీలకంఠేశ్వరరెడ్డి (గొర్విమానుపల్లె), నాగరాజు (అబ్దులాపురం), మధుసూదన్‌రావు (చింతలాయిపల్లె), వెంకటేశ్వర్లు (అంకిరెడ్డిపల్లె), చిన్నదస్తగిరి (అంకిరెడ్డిపల్లె), వనజాక్షి (కనకాద్రిపల్లె), లక్ష్మీదుర్గ(రామకృష్ణ స్కూల్ తుమ్మలపెంట), ఆర్యభట్ట (అబ్దుల్లాపురం), పోతులూరు (గొర్విమానుపల్లె), రంగనాయకులు (క్రాఫ్ట్ టీచర్ అంకిరెడ్డిపల్లె), ఇన్విజిలేటర్లు హరినారాయణ (తుమ్మలపెంట), శివప్రసాద్ (అంకిరెడ్డిపల్లె), వీరేష్(తుమ్మలపెంట), శ్రీనివాసరెడ్డి (మదనంతపురం), మదన్మోహన్(తుమ్మలపెంట), విమల్‌తేజ (అంకిరెడ్డిపల్లె), రవీంద్రగుప్త (అంకిరెడ్డిపల్లె యుటీసీఎల్), రాజశేఖరరెడ్డి (అంకిరెడ్డిపల్లె), వెంకటసుబ్బారెడ్డి (తుమ్మలపెంట యుటీసీఎల్) ఉన్నారు. ఇద్దరు సీఆర్పీలు (ఔట్సోర్సింగ్) రాజేష్, మద్దిలేటిల సర్వీస్ రెన్యువల్ చేయక పోవడంతో వారిద్దరినీ విధుల నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: డ్రోన్ట్ వర్రీ!... మునిగిపోతున్నవారిని క్షణాల్లో కాపాడే డ్రోన్ -
Software Engineer: మధ్యాహ్నం భోజనానికి ఇంటికొస్తానమ్మా అని చెప్పి..
సాక్షి, కర్నూలు(కొలిమిగుండ్ల): యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాపరాతి గని గుంతలో నీట మునిగి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం కొలిమిగుండ్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాలి మల్లిఖార్జునరెడ్డి, నాగలక్ష్మి దంపతులకు కుమారుడు మహేంద్రరెడ్డి(23), కూతురు కల్పన సంతానం. బీటెక్ పూర్తి చేసిన మహేంద్రకు కొద్ది రోజుల క్రితం చెన్నైలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వర్క్‌ఫ్రం హోంలో భాగంగా ఇంటి వద్దే విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రికి బైక్ యాక్సిడెంట్ కావడంతో ఉద్యోగ బాధ్యతలతో పాటు నాపరాతి గని పనులు, ట్రాక్టర్ల నిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మీర్జాపురం సమీపంలోని గనుల వద్దకు వెళ్లాడు. గనిలో వర్షపు నీళ్లు కొద్ది రోజుల నుంచి నిల్వ ఉండటంతో వాటిని బయటకు తోడేందుకు కూలీల సాయంతో విద్యుత్ మోటర్‌ను సిద్ధం చేశాడు. తర్వాత దూరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజులు వేసేందుకు ట్రాక్టర్లో వెళ్లారు. తిరిగి విద్యుత్ మోటర్ వద్దకు వచ్చేటప్పుడు అదే ట్రాక్టర్లో రాకుండా నీటిలో ఈదుకుంటూ వస్తానని కూలీలకు చెప్పి గనిలో దిగాడు. చదవండి: (మూడు ముళ్లకు వేళాయె!.. నేటి నుంచి జూన్ 23 వరకు శుభ దినాలే) సుమారు 40 మీటర్ల మేర గనిలో నీళ్లు ఫుల్‌గా ఉన్నాయి. అందులో ఈదుకుంటు వచ్చే సమయంలో నీటిలోనే మునిగిపోయాడు. గమనించిన కార్మికులు నీళ్లలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మూడు గంటల తర్వాత చెర్లోపల్లె, ఇటిక్యాల, కొలిమిగుండ్లకు చెందిన ముగ్గురు యువకులు అతి కష్టం మీద మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడి మృతదేహం చూసిన తల్లి నాగలక్ష్మి మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికొస్తానమ్మా అని చెప్పి తిరిగిరానిలోకాలకు వెళ్లావా నాయనా అంటూ బోరున విలపించారు. -
ఒకే ఊరు..ఒకే రోజు.. అయిదుగురు మృతి
సాక్షి, కర్నూలు: విధి ఒక్కొక్కసారి వింత నాటకం ఆడుతుంది. అమితమైన సంతోషాలను, అంతులేని విషాదాలను మోసుకొస్తుంటుంది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో ఆదివారం అంతులేని విషాదమే నెలకొంది. ఈ ఊళ్లో ఒకే రోజు అయిదుగురు మృతి చెందడమే ఇందుకు కారణం. అందరూ అనారోగ్యంతోనే చనిపోయారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. గ్రామంలోని ప్రధాన రహదారికి సమీపంలో ఉండే మాబు(28), ఆంజనేయస్వామి ఆలయ సమీప వీధికి చెందిన రామాంజనమ్మ(29), ఇతర కాలనీలకు చెందిన బొందలదిన్నె దస్తగిరి(70), కాకర్ల మహబూబ్‌బాష(26), అలాగే ఓ వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయారు. ఇందులో ముగ్గురు చిన్న వయస్సులోనే మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. -
చదువుకుంటానంటే..పెళ్లి చేస్తున్నారని..
సాక్షి, కొలిమిగుండ్ల(కర్నూలు) : బాగా చదువుకొని ప్రయోజకురాలు కావాలని కలలు కంటున్న తరుణంలో కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేయడంతో ఇష్టం లేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బొంతల నరసింహరెడ్డి,అంకాళమ్మ దంపతుల కుమార్తె లక్ష్మి(18) అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కూతురు చదువుకుంటానని పదేపదే చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోకుండా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం నామనాయకపల్లెకు చెందిన 39 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఈ నెలాఖరున వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా బంగారం, ఇతర సరుకులు తెచ్చుకునే పనిలో ఉన్నారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని లక్ష్మి బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. చీకటి పడినా కూతురు ఇంటికి చేరక పోవడంతో తల్లిదండ్రులు తెలిసిన చోట్ల వాకబు చేసినా ఫలితం లేకపోయింది. అయితే గురువారం ఉదయం గీతాశ్రమం సమీపంలోని నీటికుంటకు దుస్తులు ఉతికేందుకు వెళ్లిన రజకులకు లక్ష్మి మృతదేశమ కనిపించింది. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న హెడ్‌కానిస్టేబుళ్లు లక్ష్మినారాయణ,తిరుపాల్‌నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
సాక్షి, కొలిమిగుండ్ల(కర్నూలు) : వ్యసనాలకు బానిసైన భర్త కట్టుకున్న భార్యనే పట్టపగలు హతమార్చిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని కోర్నపల్లెలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కోర్నపల్లెకు చెందిన తలారి పుల్లన్న, పుల్లమ్మ కుమార్తె పార్వతి(35)కి అనంతపురం జిల్లా పెద్ద పప్పూరు మండలం సుంకేసులపల్లెకు చెందిన నారాయణతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. తాగుడుకు బానిసైన నారాయణ భార్యపై అనుమానం పెంచుకొని చిత్ర హింసులకు గురిచేస్తుండేవాడు. దీంతో తల్లితండ్రులు తొమ్మిది నెలల క్రితం కూతురు, అల్లుడిని కోర్నపల్లెకు తీసుకొచ్చి ఇంటి పక్కన ఉన్న మరో ఇంటిటో నివాసం ఉంచారు. భార్యభర్తలిద్దరూ సున్నంబట్టిలో కూలీ పనికి వెళ్లేవారు. ఇటీవల నారాయణ పనికి వెళ్లడం మానేసి, మద్యం తాగుతూ జులాయిగా తిరిగే వాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి ముందు కూర్చొని కాఫీ తాగుతున్న భార్యపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అదే సమయంలో ఇంటి ఆవరణలో మహిళ తండ్రి, మరొకరు ఉన్నా అడ్డుకోలేకపోయారు. క్షణాల్లో హత్య చేసి, కొడవలిని అక్కడే వదిలేసి పారిపోయాడు. కూతురు రక్తపు మడుగులో పడిపోవడంతో తండ్రి బోరున విలపించాడు. తల్లి రెండు రోజుల క్రితం విహార యాత్రలో భాగంగా మధురై వెళ్లింది. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు గ్రామానికి చేరుకొని పార్వతి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరుతెన్నులను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. పారిపోయిన నిందితుడిని ఎస్ చెన్నంపల్లె–తిమ్మనాయినపేట చెరువు మధ్య గ్రామస్తుల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. -
సొంత నిధులతో అంబులెన్స్ సేవలు
ప్రకటించిన ఎర్రబోతుల వెంకటరెడ్డి కొలిమిగుండ్ల: సొంత నిధులతో అంబులెన్స్ సేవలను అందించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకుడు ఎర్రబోతుల వెంకటరెడ్డి ప్రకటించారు. కొలిమిగుండ్ల మండలానికి చెందిన 108 అవుకుకు తరలిపోయింది. ఏదైనా సంఘనట జరిగితే అక్కడి నుంచి ప్రమాద స్థలికి చేరుకునే లోగా క్షతగాత్రులు మృత్యవాత పడుతున్నారు. వీటినన్నిటిని దృష్టిలో ఉంచుకొని రూ.7లక్షల స్వంత నిధులతో ఆంబులెన్స్‌ను మానవతా స్వచ్చంధ సంస్థకు త్వరలో అందించనున్నట్లు ఎర్రబోతుల వెంకటరెడ్డి సోమవారం ప్రకటించారు. దసరా పర్వదినం నుంచి ఈ సేవలు అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. -
వ్యక్తి దారుణ హత్య
పాతకక్షలే కారణం కొలిమిగుండ్ల (కర్నూలు): పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని బి.ఉప్పులూరుకు చెందిన కిట్టయ్య (30) పొలం నుంచి ఇంటికి తన సోదరుడు రాజుతో కలిసి వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో కిట్టయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దుండగులు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాక్టర్‌పై పేకాటరాయుళ్లు ఊరేగింపు
కర్నూలు: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని పేకాట క్లబ్‌పై మంగళవారం పోలీసులు ముకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా 50 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాటరాయుళ్ల వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లుతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పేకాటరాయుళ్లను ట్రాక్టర్‌పై ఊరేగిస్తూ... పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొలిమిగుండ్లలో పేకాటరాయుళ్లు నిత్యం పేకాట క్లబ్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. దాంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు ముకుమ్మడి దాడులు నిర్వహించారు. -
‘వంట’ ఏజెన్సీలపై తమ్ముళ్ల కన్ను!
కొలిమిగుండ్ల: మధ్యాహ్న భోజన పథకంపై అధికారపార్టీ నాయకుల కన్ను పడింది. ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలల్లో వంట ఏజెన్సీలుగా తమ వాళ్లే ఉండాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే..స్థానిక జెడ్పీ ఉన్నత, మోడల్ స్కూల్‌తో పాటు ప్రాథమిక మెయిన్, బీసీ, ఎస్సీ ప్రాథమిక పాఠశాలల్లో గత కొన్నేళ్లుగా గ్రామైక్య సంఘాల మహిళలు మధ్నాహ్న భోజనం తయారు చేసి వడ్డిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా వీరు పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక ఆ పార్టీనాయకులు, కార్యకర్తల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్న వంట ఏజెన్సీలను తొలగించి తమవారికి అవకాశం కల్పించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరికొందరు రెండు రోజులుగా గ్రామాల్లో కలియ తిరుగుతూ ఇతరులు వంట చేస్తున్నారని, నిర్వహణ సరిగా లేదని విద్యార్థులతో గుట్టుచ ప్పుడు కాకుండా సంతకాలు సేకరిస్తున్నారు. తర్వాత ఈసంతకాలు, ఫిర్యాదులతో ఎంఈవోను కలిసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఇటిక్యాల డిపెప్ ప్రాథమిక పాఠశాలలో టీడీపీ వర్గీయులకు చెందిన ఓ మహిళ ఏకంగా ఇంటి వద్దనే వంట చేసి తీసుకెళ్లి పాఠశాలలో విద్యార్థులకు వడ్డించింది. ఈమెకు ఎవరూ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించలేదు. ఇదే విషయాన్ని అదే పాఠశాలలో ఐదేళ్లుగా వంట తయారు చేస్తున్న నిర్వాహకురాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తనకు తెలియజేయకుండా మరొకరికి ఏజెన్సీ ఎప్పుడు అప్పగించారని ప్రశ్నించింది. ఖంగుతున్న అధికారులు విచారించి ఐదేళ్లుగా కొనసాగుతున్న నిర్వాహకురాలికే బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం వివిధ గ్రామాలకు చెందిన వంట ఏజెన్సీలు ఇన్చార్జి తహశీల్దార్‌తో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులను కలిశారు. కారణం లేకుండా తమను తొలగించరాదని, మధ్యాహ్నభోజన పథకంలో రాజకీయ జోక్యం తగ్గించాలని వారు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. -
స్వయంభువుడు.. సిద్ధరామేశ్వరుడు
కొలిమిగుండ్ల, బెలుం గ్రామంలో వెలసిన స్వయంభువుడు సిద్దరామేశ్వరుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా మారాడు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో నిర్మించిన ఆలయంలో చామిరాజు వంశానికి చెందిన వారే వంశపారంపర్యరంగా ఆలయంలో పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రసాదరావు (ప్రసాదయ్య) సిద్దరామేశ్వరుడికి ప్రతిఏటా కార్తీక, మాఘమాసంలో నిత్యపూజలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన శివమాలధారులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రతిరోజు రాత్రివేళ స్వామి సన్నిధిలో భక్తులు భజన చేస్తారు. ఆలయ చరిత్ర క్రీస్తుశకం16వ శతాబద్ధంలో బెలుం గ్రామంలో రాయల కొలిమిగుండ్ల, నరసరాజు ఆధీనంలో బ్రాహ్మణులకు వందల ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడని, ఈ అగ్రహారంలో కేవలం బ్రాహ్మణులు, నల్లబోతుల గోత్రం గల బోయదొరలు మాత్రమే ఉండేవారు. ఓరోజు ఆలయంలోని శివలింగం పెకిలించి ఉన్న దృశ్యాన్ని అర్చకుడు గమనించి దగ్గరికి వెళ్లి చూడగా లింగం కింద స్పటికంలాగా తెల్లటి లింగాకారాన్ని గమనించాడు. అప్పటి నుంచి ఆప్రదేశంలో ఎలాంటి శివలింగాన్ని ప్రతిష్ట కుండా స్వయం భూలింగంగా తలచి నిత్య పూజలు జరుపుతున్నారు. ఈశివలింగం పెరుగుతుండటం విశేషం. వర్షాకాలం బిళంలోని నీరు ఆలయంలోకి చేరి, స్పటికంలాగా ఉన్న శివలింగాన్ని తాకడం భక్తుల మహత్యంగా భావిస్తుంటారు. పెకిలించిన శివలింగాన్ని ప్రస్తుతం ప్రసాదరావు ఆధ్వర్యంలో నవధాన్యాల మధ్యలో ప్రతిష్టించి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. 17ఏళ్ల నుంచి శివమాలధారులు శ్రీశైలం దర్శనం సమయంలో తప్పనిసరిగా బావిలో స్నానం చేసి వెళతారు. నాటి బిళమే.. నేడు బెలుం అగ్రహారంలో ప్రజలు, పశువులకు నీటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రజలు నీటికోసం తూర్పున ఉన్న బెలుంశింగవరం గ్రామానికి వెళ్లి నీరు తెచ్చుకునేవారు. ఇలాంటి సమయంలో అగ్రహారానికి అరకిలోమీటర్ దూరంలోని చెట్ల నడుమ నుంచి కుక్క పూర్తిగా తడిచి వచ్చిన దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వెంటనే కంపచెట్లను తొలగించి కనిపించిన బిళంను తవ్వితే పెద్దగుహలాగా ఏర్పడి నీరు ప్రవహించడం కన్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పటినుంచి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని నివసించారు. అప్పటినుంచి ఆ ప్రాంతానికి బిళం అని పేరు వచ్చింది. 1947 వరకు కూడ దస్తావేజుల్లో గ్రామం పేరును బిళంగానే పిలిచారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ప్రస్తుతం బెలుం గ్రామంగా పిలుస్తున్నారు. ఇప్పటికీ ఈ గుహ ను బావిగా ఏర్పాటు చేసుకుని తాగేందుకు ఉపయోగిస్తున్నారు. ఆసియా ఖండంలోనే పేరుగాంచిన బెలుం గుహలకు ఈ బావికి అనుసంధానం ఉందని పూజారి ప్రసాదయ్య తెలిపారు. ఈ బిళం పక్కన నిర్మించిందే సిద్దరామేశ్వరస్వామి ఆలయం.