స్వయంభువుడు.. సిద్ధరామేశ్వరుడు
కొలిమిగుండ్ల,
బెలుం గ్రామంలో వెలసిన స్వయంభువుడు సిద్దరామేశ్వరుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా మారాడు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో నిర్మించిన ఆలయంలో చామిరాజు వంశానికి చెందిన వారే వంశపారంపర్యరంగా ఆలయంలో పూజలు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రసాదరావు (ప్రసాదయ్య) సిద్దరామేశ్వరుడికి ప్రతిఏటా కార్తీక, మాఘమాసంలో నిత్యపూజలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన శివమాలధారులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రతిరోజు రాత్రివేళ స్వామి సన్నిధిలో భక్తులు భజన చేస్తారు.
ఆలయ చరిత్ర
క్రీస్తుశకం16వ శతాబద్ధంలో బెలుం గ్రామంలో రాయల కొలిమిగుండ్ల, నరసరాజు ఆధీనంలో బ్రాహ్మణులకు వందల ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడని, ఈ అగ్రహారంలో కేవలం బ్రాహ్మణులు, నల్లబోతుల గోత్రం గల బోయదొరలు మాత్రమే ఉండేవారు. ఓరోజు ఆలయంలోని శివలింగం పెకిలించి ఉన్న దృశ్యాన్ని అర్చకుడు గమనించి దగ్గరికి వెళ్లి చూడగా లింగం కింద స్పటికంలాగా తెల్లటి లింగాకారాన్ని గమనించాడు.
అప్పటి నుంచి ఆప్రదేశంలో ఎలాంటి శివలింగాన్ని ప్రతిష్ట కుండా స్వయం భూలింగంగా తలచి నిత్య పూజలు జరుపుతున్నారు. ఈశివలింగం పెరుగుతుండటం విశేషం. వర్షాకాలం బిళంలోని నీరు ఆలయంలోకి చేరి, స్పటికంలాగా ఉన్న శివలింగాన్ని తాకడం భక్తుల మహత్యంగా భావిస్తుంటారు. పెకిలించిన శివలింగాన్ని ప్రస్తుతం ప్రసాదరావు ఆధ్వర్యంలో నవధాన్యాల మధ్యలో ప్రతిష్టించి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. 17ఏళ్ల నుంచి శివమాలధారులు శ్రీశైలం దర్శనం సమయంలో తప్పనిసరిగా బావిలో స్నానం చేసి వెళతారు.
నాటి బిళమే.. నేడు బెలుం
అగ్రహారంలో ప్రజలు, పశువులకు నీటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రజలు నీటికోసం తూర్పున ఉన్న బెలుంశింగవరం గ్రామానికి వెళ్లి నీరు తెచ్చుకునేవారు. ఇలాంటి సమయంలో అగ్రహారానికి అరకిలోమీటర్ దూరంలోని చెట్ల నడుమ నుంచి కుక్క పూర్తిగా తడిచి వచ్చిన దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.
వెంటనే కంపచెట్లను తొలగించి కనిపించిన బిళంను తవ్వితే పెద్దగుహలాగా ఏర్పడి నీరు ప్రవహించడం కన్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పటినుంచి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని నివసించారు. అప్పటినుంచి ఆ ప్రాంతానికి బిళం అని పేరు వచ్చింది. 1947 వరకు కూడ దస్తావేజుల్లో గ్రామం పేరును బిళంగానే పిలిచారు.
కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ప్రస్తుతం బెలుం గ్రామంగా పిలుస్తున్నారు. ఇప్పటికీ ఈ గుహ ను బావిగా ఏర్పాటు చేసుకుని తాగేందుకు ఉపయోగిస్తున్నారు. ఆసియా ఖండంలోనే పేరుగాంచిన బెలుం గుహలకు ఈ బావికి అనుసంధానం ఉందని పూజారి ప్రసాదయ్య తెలిపారు. ఈ బిళం పక్కన నిర్మించిందే సిద్దరామేశ్వరస్వామి ఆలయం.