ఇదేం జన్మభూమిరా.. బాబు? | Janmabhoomi new requests tdp ledares | Sakshi
Sakshi News home page

ఇదేం జన్మభూమిరా.. బాబు?

Published Fri, Jan 8 2016 12:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Janmabhoomi new requests tdp ledares

  కొత్త వినతులు ఎందుకు?
  సభల్లో జనం నిలదీత
  రాంపురం సర్పంచ్‌పై ఎమ్మెల్య్యే శివాజీ వీరంగం
  చంద్రన్న సరకులతో సభలో రగడ
  కమిటీల తీరుపై  విమర్శలు

 
 శ్రీకాకుళం టౌన్ : జన్మభూమి అంటూ చేపట్టిన గ్రామసభలతో ఇటు అధికారులు, అటు అధికార పార్టీ నేతలు ఎందుకొచ్చిన కర్మభూమిరా! అంటూ తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన సభల్లో కూడా అధికారులకు, పాలకులకు జనం నుంచి నిలదీతలు తప్పలేదు. పింఛన్లు, రేషన్ సరుకులపై రగడ తప్పలేదు. దీంతో ఎందుకొచ్చిన జన్మభూమి అంటూ అధికారులు, అధికార పార్టీ నేతలు బయటకు చెప్పలేక లోలోపన మదనపడుతున్నా రు. ముఖ్యంగా జన్మభూమి కమిటీల పెత్తనం నేపథ్యంలో అధికారులకు, పాలకులు తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. ఎక్కడికక్కడే సభల్లో ప్రజలే నిలదీస్తున్నారు.
 
  సంతకవిటి మండలం కాకరాపల్లి గ్రామంలో రేషన్ కార్డుల కోసం జనం ఆందోళన చేశారు. గ్రామసభకు అధికారులు హాజరు కాగానే రేషన్‌కార్డుల జాబితా ఇవ్వాలని కోరారు. అందుకు అధికారులు నిరాకరించడంతో గ్రామసభను బహిష్కరించారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కూడా ఈ సభకు హాజరై పింఛన్ల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని నిలదీశారు. దీంతో జన్మభూమి కమిటీ సభ్యు లు అడ్డుతగలడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పాతవి పరిష్కరించకుండా  కొత్తగా వినతులు ఎందుకు తీసుకుంటున్నార ంటూ ప్రశ్నించారు. అధికారులు అందుకు సమాధానం చెప్పకుండా ఉండడంతో జన్మభూమిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఏకపక్షంగా గ్రామసభను నిర్వహించుకున్నారు.
 
  పాతపట్నం నియోజకవర్గంలో గ్రామసభల్లో ఎప్పటిలాగే ఘర్షణ వాతావరణం కొనసాగింది. గ్రామసభలు నిర్వహించిన 20 చోట్ల ఇదే పరిస్థితి ఎదురైంది. మంత్రి అచ్చెన్న వర్గీయులకు, మాజీమంత్రి శత్రచర్ల వర్గాల మధ్య సమన్వయం కొరవడడంతో గ్రామసభల్లో వాగ్వివాదం చోటు చేసుకుంది. అనేక చోట్ల పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు వారికి సర్దిచెప్పి సభలను నిర్వహించారు. ఎల్‌ఎన్‌పేట మండలం తుమ్మవలస గ్రామంలో సర్పంచి రెడ్డి లక్ష్మణరావు గ్రామసభను బహిష్కరించారు.
 
  మందస మండలం రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే గౌతుశివాజీ గ్రామ సర్పంచిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరైన మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్  సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జుత్తు జగన్నాయకులు మరదలు, గ్రామ సర్పంచి విజయలక్ష్మి ప్రభుత్వ పథకాలు ప్రజలందరికి చెందాలని కోరడంతో ఎమ్మెల్యే శివాజీ ఆగ్రహం చెందారు. పథకాలను అమ్ముకుంటున్నారన్న సర్పంచి వాదనను ఆయన తప్పుపట్టారు. దీంతో అక్కడే ఉన్న సర్పంచి ప్రతినిది కూర్మారావుతో టీడీపీ వర్గీయులు వాగ్వానికి దిగారు. మందస మండలం నారాయణపురంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు గత జన్మభూమి వినతులపై పరిష్కారం చూపాలంటూ నిలదీయడంతో ఎంపీడీఓ వారికి నచ్చజెప్పి గ్రామసభ నిర్వహించారు.
 
 మహిళలంటే ప్రభుత్వానికి చిన్న చూపు
 టెక్కలి : మహిళల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలను హీనంగా చూస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. అక్కవరం గ్రామంలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమం లో పాల్గొని ప్రజల తరఫున ఆమె మాట్లాడారు. అధికారంలోకి వస్తే మహిళలకు, రైతులకు రుణమాఫీ చేస్తామంటూ హామీలిచ్చిన చంద్రబాబు తరువాత మోసం చేస్తూ అసమర్ధ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్పాలన్నారు.
 
 అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉండేవారని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దీనంగా మారిందన్నారు. సంక్రాంతి పండగ వేళ రైతుల ధాన్యం కళ్లాల్లో దైన్యంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఆర్.అప్పలరాజు, సర్పంచ్ పి.భూలక్ష్మి, వైఎస్‌ఆర్ సీపీ రాష్ర్ట మహి ళా విభాగం ప్రధాన కార్యదర్శి దువ్వాడ వాణి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజుగణపతి, అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాష్  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement