గుంటూరు, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోవడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. పోటీగా.. రెండు స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ పొత్తు ధర్మంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అభ్యర్తుల ప్రకటనతో చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని జనసేనాని అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలి. కానీ, టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు.
.. ఇప్పుడు ఏకపక్షంగా వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేం రెండు సీట్లు ప్రకటిస్తాం. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తోంది. చంద్రబాబుకు ఉన్నట్లే.. నాకూ మా పార్టీలో ఒత్తిడి ఉంది. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లోనే మేమూ రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాం. అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా’’ అని పవన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బ్రో.. బాబెప్పుడూ ఇంతే!
.. ‘‘కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ.. తీసుకునే వాళ్లం కాలేకపోతున్నాం. ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తున్నాం. టీడీపీ-జనసేన పొత్తులకు ఇబ్బందులు కలిగేలా కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నన్ను వీధి కుక్క అని తిట్టినా భరించా. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా మౌనంగా ఉన్నా. టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం పొత్తు ధర్మం ఎంతమాత్రం కాదు. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగింది. దీనిపై నన్ను అడిగిన మా పార్టీ నేతలకు నా క్షమాపణలు.
.. గత ఐదేళ్లలో జనసేన సమర్థవంతంగానే పని చేసింది. ఈ ఐదేళ్ల పోరాటం 2024లో రాజకీయ బలం కావాలి. పోటీ కోసం 50-70 స్థానాలు తీసుకోవాలని నాకు తెలియనిది కావు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయిగానీ అధికారంలోకి వస్తామోరామో తెలియదు. పవన్ జనంలో తిరగడు.. వాస్తవాలు తెలియని కొందరు అంటున్నారు. తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను?. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం.. విడదీయడం తేలిక. అందుకే నాకు నిర్మించడం ఇష్టం. ఆటుపోట్లు ఎదురవుతాయి. కొన్నిసార్లు తప్పవు. పొత్తులో భాగంగా మనం మూడో వంతు సీట్లు తీసుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికలతో నేను ఆగిపోవడం లేదు. భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుంది’’.. అంటూ వ్యాఖ్యానించారాయన.
జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు. అలాగే అరకు అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. మరికొన్ని చోట్ల కూడా అభ్యర్థుల ప్రకటనకు ఆయన సిద్ధమయ్యారు. ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్నే పవన్ ఇప్పడు వ్యతిరేకించారు. రేపు రేపు.. ఇది ఎటు దారి తీస్తుందో అనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైందిప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment