జనసేనలో భయం.. భయం
గుంటూరు, సాక్షి: చంద్రబాబు విషకౌగిలిలో చిక్కుకుంటే ఇక తప్పించుకోవడం కష్టం.. పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడిప్పుడే ఆ తత్త్వం మెల్లగా బోధపడుతోంది. జనసేనకు సీట్ల కేటాయింపును ఆఖరి నిమిషం దాకా నాన్చి... చివర్లో అతి కొద్ది సీట్లతో పవన్‌ను కట్టడి చేసేలా చంద్రబాబు పెద్ద ప్రణాళికతో ఉన్నారని ఇప్పటికే జనసేన నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండగా.. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇప్పటికీ ఆ పార్టీ నేతల్లో స్పష్టత లేదు.
దీంతో జనసేన కార్యకర్తలు సందిగ్ధంలో పడిపోయారు. పార్టీ అధినేత పవన్ రెండు మూడు వారాలుగా మౌనంగా ఉండడంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో.. ఈ పొత్తు ఎటు పోయి ఎటు వస్తుందోనని జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. యుద్ధానికి సన్నద్ధమవ్వాల్సిన సమయంలో పార్టీ అధినేత మొదలు.. పార్టీలో ఏ ఒక్క నాయకుడు తాము ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది.
ఇలాగైతే అసలుకే మోసం
తమకు ఇన్ని స్థానాలు కావాలని.. ఈ స్థానాలు కేటాయించాల్సిందేనని పవన్ కళ్యాణ్ ఇప్పటి దాకా టీడీపీని స్పష్టంగా కోరలేదు. జనసేనలోను కొందరు కీలక నేతలకు కూడా ఎలాంటి స్పష్టత లేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది గత ఎన్నికల్లోనూ చివరి వరకూ తేల్చలేదు. దీంతో అసలుకే మోసం వచ్చింది. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి పోటీ అనేది ఆఖరి నిమిషం వరకూ గోప్యంగా ఉంచడం ఈ ఎన్నికల్లో ఒక ఎత్తుగడగా భావిస్తున్నారు.
వాడుకుని వదిలేస్తారేమో?
రెండేళ్లుగా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ రాష్ట్ర పర్యటనకు వచ్చి మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయా? అన్నంత హడావుడి చేసేవారు. సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం ఆయన మౌనంగా ఉండిపోవడం వెనుక చంద్రబాబు జిమ్మిక్కులు ఉన్నాయని జనసైనికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మూడున్నర నెలలుగా వారాహి యాత్రను సైతం పక్కనపెట్టేశారు. ప్రతి పొత్తు సమయంలోనూ చంద్రబాబు తమతో పొత్తు పెట్టుకున్న పార్టీని రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత
ఆ పార్టీని అణగదొక్కే నైజం అందరికీ తెలిసిందే. ఆ వ్యూహాన్ని ఇప్పుడు జనసేనపైనా మొదలుపెట్టి ఉండొచ్చని పార్టీలో చర్చ సాగుతోంది.
పవన్‌కు అవమానం : జనసైనికుల ఆవేదన
మొదటి నుంచి చంద్రబాబు వెంట పవన్ కళ్యాణ్ వెంపర్లాడడంతో దాన్ని అలుసుగా తీసుకుని తమ అధినేతను కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేసే ఎత్తుగడలో బాబు ఉన్నాడని ఇప్పటికే జనసేన నేతలు మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. తెలుగుదేశం–జనసేనలు కచ్చితంగా కలిసి పోటీ చేస్తాయని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరాఖండీగా ఆ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. నచ్చేవారు ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి అని కేడర్‌ను అయోమయంలో పడేశారు. తమ అధినేత ఇంత చేస్తే పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయించేదీ చంద్రబాబు తేల్చకపోవడంపై ఆ పార్టీలో పెద్ద ఎత్తున మేధోమథనం సాగుతోంది. తమను చంద్రబాబు చివరిలో ముంచేస్తే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు.
నెలాఖరు నుంచి పర్యటనలు: నాదెండ్ల
నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. అన్ని అసెంబ్లీ స్థానాలు కవర్ చేసేలా, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలతోపాటు బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.
పొత్తులు కాదు కత్తులే
పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కోరుకుంటున్న గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం మొదలు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న నియోజకవర్గాలన్నింటిలోనూ స్థానిక టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా గత వారం పది రోజులుగా అక్కడి జనసేన నాయకులకు వ్యతిరేకంగా పోటీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. జనసేనలో కీలక నేతగా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ ఆశిస్తున్న గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా టికెట్ ఆశిస్తున్నారు.
నియోజకవర్గంలో జనసేనకు పోటీగా పాదయాత్ర చేస్తుండగా... రాజా అనుచరులు నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాలు పెట్టి నాదెండ్ల మనోహర్‌పై బహిరంగంగానే విమర్శలకు దిగారు. పొత్తులో సీట్ల కేటాయింపు కొలిక్కి రాకమునుపే చంద్రబాబు మాత్రం తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల గురించి బహిరంగ సభలో ప్రకటిస్తున్నారని జనసేన నాయకులు భగ్గుమంటున్నారు. మండపేట నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ఆ స్థానంలో టీడీపీ పోటీ చేసే అంశాన్ని పేర్కొనడం స్థానికంగా రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది.
అక్కడ జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలోని జనసేన కీలక నాయకుడు మనస్తాపం చెంది.. సీట్ల కేటాయింపు తేలేవరకు మండపేట నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన నాయకులకు సందేశాలు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇదే తరహా వాతావరణం ఉండగా, ఉమ్మడి ఉభయగోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.
ఫొటోలోనే పవన్.. పక్కన అక్కర్లేదా: జనసైనికులు
జనసేనలో టికెట్లపై గందరగోళం నెలకొనగా... చంద్రబాబు మాత్రం పవన్ ఫొటోలు పెట్టుకుని వరుసగా తమ పార్టీ రాజకీయ కార్యక్రమాలకు వాడేసుకుంటున్నారు. వెళ్లిన ప్రతిచోట తమ అభ్యర్థులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేసుకుంటున్నారు. మరోవైపు జనసేనలో మాత్రం సీట్ల కేటాయింపు తేలక ఎన్నికల హడావుడి లేకుండా పార్టీ పూర్తి స్తబ్ధుగా తయారైంది. చంద్రబాబు తన ఫొటో పక్కనే పవన్ కళ్యాణ్ ఫొటోలు పెట్టుకొని జనసేనకు ఏమాత్రం సంబంధం లేకుండానే రోజుకు రెండు బహిరంగ సభలు నిర్వహించడం జనసైనికులకు మింగుడుపడడం లేదు.