Nova
-
దొంగ ఓట్లు.. ‘పచ్చ’ నోట్లు
సాక్షి, అమరావతి: ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లతో మోసాలకు పాల్పడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని మరోసారి రుజువైంది! నల్లధనాన్ని వెదజల్లి ఎన్నికల్లో అక్రమ మార్గాల్లో నెగ్గేందుకు టీడీపీ ఏకంగా ప్రత్యేక కార్యాలయాలనే ఏర్పాటు చేసుకున్నట్లు ఆధారాలతో సహా బట్టబయలైంది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా) పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ పాల్పడిన అక్రమాలు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) తనిఖీల్లో తాజాగా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయం కేంద్రంగా ఎన్నికల అక్రమాలకు తెగబడినట్లు డీఆర్ఐ కీలక ఆధారాలను గుర్తించింది. ఆ వెంటనే ఆ కంపెనీకి చెందిన కీలక వ్యక్తులు పరారు కావడం గమనార్హం. ఆదాయపన్ను (ఐటీ) చట్టం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డట్టు తేలింది. డీఆర్ఐ నివేదిక మేరకు న్యాయస్థానం అనుమతితో టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు, నోవా అగ్రిటెక్ కంపెనీలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం ఇదిగో ఇలా సాగింది.. నోవా అగ్రిటెక్ కేంద్రంగా... పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. గుంటూరు శ్రీలక్ష్మీ నగర్‌లోని ఆ కంపెనీ కార్యాలయంలో ఈ నెల 24న చేపట్టిన సోదాల్లో ప్రధానంగా డీఆర్ఐ అధికారులు స్వా«దీనం చేసుకున్న ఓ డైరీ టీడీపీ ఎన్నికల అక్రమాల గుట్టును విప్పింది. స్వతంత్ర సాక్షులు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగుల సమక్షంలో ఆ డైరీని డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. కీలక అధికారి పరార్ నోవా అగ్రిటెక్‌కు చెందిన ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు ఆ డైరీని ఉపయోగించారని కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. ప్రస్తుతం రిటైరైన పుల్లెల అజయ్ బాబును కార్యాలయానికి రావాలని డీఆర్ఐ అధికారులు సూచించిన వెంటనే ఆయన పరారు కావడం గమనార్హం. తన సెల్‌ఫోన్‌ను సైతం స్విచ్ఛాఫ్ చేసేసి అందుబాటులో లేకుండా పోయారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాలతోనే ఆయన పరారైనట్లు స్పష్టమవుతోంది. 13 పేజీల్లో నమోదు.. ఆ డైరీని పరిశీలించగా పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ ఎలా ఎన్నికల అక్రమాలకు పాల్పడిందో వెలుగు చూసింది. పోలింగ్‌కు ముందు రోజు అంటే 2019 ఏప్రిల్ 11న అక్రమ నిధులను ఎలా తెచ్చారు? ఓటర్లకు ఎలా పంపిణీ చేశారనే వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలను ఏకంగా 13 పేజీల్లో నమోదు చేయడం గమనార్హం. అంతా నల్లధనమే... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీగా నల్లధనాన్ని తరలించినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. అందుకోసం షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులను చేరవేశారు. ఆ డబ్బుల వివరాలేవీ నోవా అగ్రిటెక్ కంపెనీ రికార్డులతో సరిపోలకపోవడంతో అదంతా నల్లధనమేనని రుజువవుతోంది. కంపెనీ బ్యాంకు ఖాతాల్లో ఆ నిధుల జమ, విత్‌డ్రాలకు సంబంధించిన వివరాలేవీ లేవు. అంటే ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో అక్రమాలుకు పాల్పడేందుకు వెచ్చిం చినదంతా నల్లధనమేనని నిర్థారణ అయింది. ఎన్నికల కమిషన్‌కూ బురిడీ... డైరీలో పేర్కొన్న నిధుల వ్యయానికి సంబంధించిన వివరాలను టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఎన్నికల వ్యయంలో చూపలేదు. కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పించాల్సిన వ్యయంలో డైరీలో పేర్కొన్న నిధుల వివరాలు లేవు. అంటే టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్‌కు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ఐటీ, ఈడీ, సెబీలకు నివేదిక.. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అక్రమంగా నిధులు తరలించినట్లు ఆధారాలతో వెల్లడి కావడంతో డీఆర్ఐ అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. తమ తనిఖీల్లో వెలుగు చూసిన అంశాలను ఆదాయపన్ను శాఖ, ఈడీ, సెబీ దృష్టికి తెచ్చారు. నోవా అగ్రిటెక్ కంపెనీ తమ రికార్డుల్లో చూపని నిధులను వెచ్చించడంతోపాటు పన్ను చెల్లించకుండా ఎగవేసింది. అక్రమ నిధుల తరలింపు ద్వారా కేంద్ర మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించింది. అక్రమ నిధులను తరలించేందుకు కంపెనీని కేంద్ర బిందువుగా చేసుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధం. నోవా అగ్రిటెక్ అక్రమాలపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదాయపన్ను, ఈడీ, సెబీలకు డీఆర్ఐ అధికారులు నివేదిక సమర్పించారు. త్వరలోనే ఆ మూడు సంస్థలు రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదుకు సన్నద్ధం అక్రమ నిధుల ద్వారా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ నోవా అగ్రిటెక్ కంపెనీ, కంపెనీ చైర్మన్‌గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై పోలీసు శాఖ కేసు నమోదు చేయనుంది. ఈ అక్రమ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు బాపట్ల జిల్లా పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు స్పష్టమవుతోంది. డైరీలో నల్లధనం ♦ పవులూరు అనే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. మొత్తం రూ.2.39 లక్షలు పంపిణీ చేసినట్టు ఆ డైరీలో ఉంది. ♦ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా రూ.3.60 లక్షలు ఓటర్లకు పంపిణీ చేసినట్లు డైరీలో ఉంది. ♦ నోవా అగ్రిటెక్ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా ఓటర్లకు ఆ డబ్బులను పంపిణీ చేశారు. ♦ ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేశ్ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు రూ.15 లక్షలు పంపిణీ చేశారు. ♦ పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేశారో డైరీలో వివరంగా ఉంది. ♦ ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చేసిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొనడం గమనార్హం. -
కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు
కెనడా హాలిఫాక్స్‌లో అత్యద్భుతంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు జరిగాయి. తెలుగు భాష అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడాలో చాటి చెబుతున్నారు మన భారతీయులు. ముఖ్యంగా మన తెలుగు వారు విశాల్ భరద్వాజ్ వారి టీం భ్యారి, టీనా, సెలెస్ట్ గారి ఆధ్వర్యంలో కెనడా ఎన్ఎస్ లీడర్ పార్టీ లీడర్, యార్మౌత్ ఎమ్మెల్యే జాక్ చర్చిల్, ఎన్డీపీ లీడర్ క్లాజుడై చందర్, క్లేటొన్ పార్క్ ఎమ్మెల్యే రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. 8 వేల మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీహరి చల్లా గారు మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు. శ్రీహరి గారి బృందం, ఫణి వంక గారు, శివ మారెళ్ళ గారు , చంద్రా తాడేపల్లి గారు, వెంకట్ వేలూరి గారు, శ్రీనివాస చిన్ని గారు, పృద్వి కాకూరు, క్రిష్ట్న వేణి గారు, రత్నం గారు, జయ గారు, ప్రియాంక గారు, లావణ్య గారు, శ్రీలేఖ, జనని కృష్ణ, జ్యోత్స్నా శ్రీజ , దీపీకా కర్ణం, జయశ్రీ కర్ణం, సియ శివకుమార్, రిషిన్త్ శివకుమార్, శిబి నాన్తం ఆట్రియం, రోహిత్ సాయి చల్లా పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించారు. కెనడాలో హాలిఫాక్స్ నగరంలో జరిగిన "నోవా మల్టీఫెస్ట్" సంబరాలలో మన తెలుగు వారు, ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు (ఉగాది,- తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్(అట్ల తదియ), రాఖీ -రక్షాబంధన్, తెలుగు పండుగ సంక్రాంతి(ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యం); దీపావళి( దీపాల వరుస, ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు) వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకి వివరించి కన్నుల విందు చేశారు. వాతావరణం అనుకూలించక మా నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్క రోజు మాత్రమే జరిగింది, ఐనా 8000 మంది వేడుకలలో పాల్గొనడం విశేషం. వివిధ భాషలు, వివిధ సంస్కృతులకు నివాసమైన కెనడా వాసులు మన పండుగలు విశేషాలను బాగా అర్థం చేసుకొని, అభినందించారు. రెండు రోజులు హోరున వర్షాలు ఈదురు గాలులు, మూడవ రోజు వాతావరణం అనుకూలించడం వలన వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడా వాసులలో మన ఇండియా పండుగల ప్రాముఖ్యత గుర్తించి ఎనిమిది వేలకు పైగా పాల్గొని ఘన విజయం సాధించింది. కెనడా హెలి ఫ్యాక్స్ సుప్రజ గారు మాట్లాడుతూ "ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని" అంటూ.. మన ప్రాచీన కళలైనటు వంటి భరతనాట్యం (జనని కృష్ణ ), కూచిపూడి (జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము(శిబి నాన్తం ఆట్రియం ) జానపద నృత్యాలతో (దీపీకా కర్ణం జయశ్రీ కర్ణం) కెనడా ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది. అలాగే మన సాంప్రదాయ వస్త్రాలతో కెనడా వాసులని అలంకరించింది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ రకరకాల దేశాల వారి విందు భోజనాలు అందరూ ఆరగించారు. (చదవండి: డాలస్ నాటా కన్వెన్షన్‌లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్) -
ఐపీవోకు నోవా అగ్రిటెక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ నోవా అగ్రిటెక్ ఐపీవోకు రానుంది. ఐపీవోలో భాగంగా రూ.140 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్ నూతలపాటి వెంకట సుబ్బారావు 77.58 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నారు. అయితే ఓఎఫ్ఎస్ ద్వారా ఒక్కో షేరును ఎంతకు ఆఫర్ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. కంపెనీలో ఆయనకున్న మొత్తం వాటా 11.9 శాతం విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ కంపెనీ నోవా అగ్రి సైన్సెస్ ద్వారా కొత్త ఫార్ములేషన్ ప్లాంటు ఏర్పాటుకు వెచ్చిస్తారు. అలాగే ఇప్పటికే ఉన్న ప్లాంటు విస్తరణకు సైతం ఖర్చు చేస్తారు. కంపెనీ షేర్లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ చేయనుంది. -
మావోకు దీటుగా నోవా!
నమో నాస్తికా చైనాకు నాస్తికదేశం అని పేరు. అంటే అక్కడ ఆస్తికులు ఉండరని కాదు. ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ‘బహుశా చైనా నాస్తిక దేశమేమో’ అనే అనుమానం కలిగించేలా ఉంటాయి. తాజాగా ఆ దేశం హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రోవ్ నటించిన ‘నోవా’ చిత్రాన్ని నిషేధించడంతో ఇలాంటి అనుమానమే కలుగుతోంది. ‘నోవా’ అనేది బైబిల్ కథ ఆధారంగా తీసిన సినిమా. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో, మరికొన్ని దేశాల్లో విడుదలయింది. బ్లాక్బస్టర్లా ఆడుతోంది. చైనాలో కూడా ఆడింది కానీ, కొద్దిరోజుల్లోనే చైనా ప్రభుత్వం ‘నోవా’ను నిషేధించింది. కారణమేమిటో అక్కడి సెన్సార్ అధికారులు చెప్పకున్నా, ముస్లిం దేశాలు ఈ చిత్రాన్ని నిషేధించాయి కనుక వారికి సంఘీభావంగా చైనా కూడా నిషేధించినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, చైనా విప్లవనేత మావో జెడాంగ్ కొటేషన్ల కన్నా కూడా బైబిల్ వాక్యాలు ఎక్కువ ఆదరణ పొందుతుండడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోందని విశ్లేషకులు అంటున్నారు. ‘నోవా’ చిత్రాన్ని తీసిన ‘పారామౌంట్ పిక్చర్స్’ సంస్థ... ‘అబ్బే ఇది మతసంబంధమైన చిత్రం కాదు, ఇందులో పర్యావరణ సందేశాన్ని ఇచ్చాం. కనుక నిషేధం ఎత్తివేయండి’’ అని అడుగుతున్నప్పటికీ చైనా ససేమిరా అంటోంది. ‘నోవా’ విడుదలైన తొలినాళ్లలో ఆ చిత్రాన్ని 3డి లో, ఐమాక్స్ 3డి లో చూసి తన ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురికావడం చైనాకు మింగుడుపడలేదనీ, ఆ చిత్రం చైనా నాస్తిక వారసత్వ వైభవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందనీ భావించి వెంటనే నిషేధించిందని హాలీవుడ్ సినిమా పత్రికలు కొన్ని రాశాయి. ‘‘పాపభూయిష్టమైన ఈ లోకాన్ని ప్రళయంలో ముంచేయబోతున్నాను కనుక, ఒక పెద్ద ఓడను నిర్మించుకుని అందులో నువ్వు, నీ కుటుంబ సభ్యులు, ఇంకా జంతుజాలం ఒక్కో జత (ఒక ఆడ, ఒక మగ) చొప్పున ఉండండి. ప్రళయానంతరం ఓడలోని జీవరాశులతో మళ్లీ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తాను’’ అని దేవుడు ‘నోవా’ అనే ప్రవక్తకు చెప్పిన బైబిల్ కథే... ఇప్పుడు చైనా నిషేధించిన ‘నోవా’ చిత్ర కథాంశం.