మావోకు దీటుగా నోవా!
నమో నాస్తికా
చైనాకు నాస్తికదేశం అని పేరు. అంటే అక్కడ ఆస్తికులు ఉండరని కాదు. ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ‘బహుశా చైనా నాస్తిక దేశమేమో’ అనే అనుమానం కలిగించేలా ఉంటాయి. తాజాగా ఆ దేశం హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రోవ్ నటించిన ‘నోవా’ చిత్రాన్ని నిషేధించడంతో ఇలాంటి అనుమానమే కలుగుతోంది. ‘నోవా’ అనేది బైబిల్ కథ ఆధారంగా తీసిన సినిమా.
ఈ ఏడాది మార్చిలో అమెరికాలో, మరికొన్ని దేశాల్లో విడుదలయింది. బ్లాక్‌బస్టర్‌లా ఆడుతోంది. చైనాలో కూడా ఆడింది కానీ, కొద్దిరోజుల్లోనే చైనా ప్రభుత్వం ‘నోవా’ను నిషేధించింది. కారణమేమిటో అక్కడి సెన్సార్ అధికారులు చెప్పకున్నా, ముస్లిం దేశాలు ఈ చిత్రాన్ని నిషేధించాయి కనుక వారికి సంఘీభావంగా చైనా కూడా నిషేధించినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, చైనా విప్లవనేత మావో జెడాంగ్ కొటేషన్ల కన్నా కూడా బైబిల్ వాక్యాలు ఎక్కువ ఆదరణ పొందుతుండడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోందని విశ్లేషకులు అంటున్నారు.
‘నోవా’ చిత్రాన్ని తీసిన ‘పారామౌంట్ పిక్చర్స్’ సంస్థ... ‘అబ్బే ఇది మతసంబంధమైన చిత్రం కాదు, ఇందులో పర్యావరణ సందేశాన్ని ఇచ్చాం. కనుక నిషేధం ఎత్తివేయండి’’ అని అడుగుతున్నప్పటికీ చైనా ససేమిరా అంటోంది. ‘నోవా’ విడుదలైన తొలినాళ్లలో ఆ చిత్రాన్ని 3డి లో, ఐమాక్స్ 3డి లో చూసి తన ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురికావడం చైనాకు మింగుడుపడలేదనీ, ఆ చిత్రం చైనా నాస్తిక వారసత్వ వైభవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందనీ భావించి వెంటనే నిషేధించిందని హాలీవుడ్ సినిమా పత్రికలు కొన్ని రాశాయి.
‘‘పాపభూయిష్టమైన ఈ లోకాన్ని ప్రళయంలో ముంచేయబోతున్నాను కనుక, ఒక పెద్ద ఓడను నిర్మించుకుని అందులో నువ్వు, నీ కుటుంబ సభ్యులు, ఇంకా జంతుజాలం ఒక్కో జత (ఒక ఆడ, ఒక మగ) చొప్పున ఉండండి. ప్రళయానంతరం ఓడలోని జీవరాశులతో మళ్లీ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తాను’’ అని దేవుడు ‘నోవా’ అనే ప్రవక్తకు చెప్పిన బైబిల్ కథే... ఇప్పుడు చైనా నిషేధించిన ‘నోవా’ చిత్ర కథాంశం.