సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. కారంచేడు మండల టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గురువారం నిర్వహించిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం దీనికి వేదికైంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఓ వర్గానికి కొమ్ముకాయడంతో రెండో వర్గం నేతలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంతో గురువారం రోడ్డెక్కారు.
ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకున్నారు. స్థానిక నేత అక్క య్య చౌదరికి మద్దతుగా నిలిచిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేశా రు. గంటకు పైగా కారంచేడులో టీడీపీ నేతల వీరంగం కొనసాగింది. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ అనూరాధతోపాటు పలువురు టీడీపీ ముఖ్యనేతల సమక్షంలోనే విభేదాలు రచ్చకెక్కడం గమనార్హం.
నేపథ్యమిదీ
భవిష్యత్‌కు గ్యారెంటీ పేరిట టీడీపీ చేపట్టిన కార్యక్రమం గురువారం కారంచేడు చేరింది. తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ అక్కయ్యచౌదరి టీడీపీ కార్యాలయంలోకి వచ్చి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి పార్టీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కోరారు. ఎమ్మెల్యే అందుకు అంగీకరించకపోవడంతో రావాల్సిందేనని అక్కయ్యచౌదరి పట్టుబట్టాడు.
బస్సులోంచి దిగిన ఎమ్మెల్యే కార్యాలయం బయటే నిలబడి కార్యకర్త ఇచ్చిన జెండా నిలబెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన అక్కయ్యచౌదరి వర్గం ఎమ్మెల్యే ఎగురవేసిన టీడీపీ జెండాను అక్కడికక్కడే పీకేశారు. పార్టీ కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను సైతం ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘పార్టీ వద్దు.. బొక్కా వద్దు’ అంటూ చిందులు తొక్కారు.
పార్టీ పదవికి రాజీనామా
ఈ ఉదంతంతో పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు అక్కయ్యచౌదరి ప్రకటించారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీని అనునిత్యం కాపాడుకుంటూ ఆర్థికంగా ఎంతో నష్టపోయానన్నారు. ఇంత కష్టపడినా ఎమ్మెల్యే వద్ద తనకు కనీస గౌరవం దక్కడం లేదన్నారు. తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తూ పార్టీని పాడు చేస్తున్నాడని వాపోయారు. ఈ విషయంపై అధిష్టానంతోనే తేల్చుకుంటానని తెగేసి చెప్పారు.
కారంచేడుకు చెందిన సీనియర్ నేత అక్కయ్యచౌదరి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండలంలో బలమైన నాయకుడైన ఆయన గతంలో కారంచేడు ఎంపీపీ, పర్చూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి పదవులు చేపట్టారు. ప్రస్తుతం కారంచేడు–2 ఎంపీటీసీగా ఉన్నారు.
కాగా, అక్కయ్యచౌదరికి వ్యతిరేకంగా ఇదే మండలానికి చెందిన పార్టీ మాజీ అధ్యక్షుడు జాగర్లమూడి ప్రహ్లాదరావు ప్రత్యేకంగా గ్రూపు కట్టా రు. అక్కయ్య చౌదరి వ్యతిరేక వర్గీయులను చేరదీశారు. దీంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదా లు తారస్థాయికి చేరగా.. తాజాగా రోడ్డునపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment