మంత్రి రాంప్రసాద్‌రెడ్డిపై రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి సుగవాసి బాలసుబ్రమ్మణ్యం ఫైర్
రాజంపేట: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు గుప్పుమన్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జినైన తనకు మంత్రి అస్సలు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బాలసుబ్రమణ్యం సోమవారం విరుచుకుపడ్డారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తన వైఖరితో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.
ఇసుక, మట్టి దోపిడీలో.. ఎర్రచందనం అక్రమ రవాణాలో, బదిలీలకు సిఫారసు లేఖలను అమ్ముకుంటూ మంత్రి పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం గుండ్లపల్లెలో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం ఏమన్నారంటే..
ఇసుక అక్రమ రవాణాలో మంత్రికి వాటాలు..
కేవీ పల్లెలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తుంటే సుండుపల్లెలో పోలీసులకు అడ్డుకునే హక్కులేనప్పుడు, రాయచోటి మండలంలో అనుంపల్లె మట్టి ఎత్తితే, దానిని అక్రమంగా సుండుపల్లె మండలంలో దించుకోవచ్చా? రాజంపేట మండలంలోని ఆర్.బుడుగుంటపల్లె ఇసుక రీచ్ ప్రారంభోత్సవానికి రాజంపేట ఇన్‌చార్జిగా ఉన్న నన్ను పిలవలేదు. మంత్రికి ఇసుకలో వాటా ఉందని కలెక్టరేట్‌లో చర్చించుకుంటున్నారు. అలాగే, అధికారుల బదిలీలకు సంబంధించి మంత్రి తన సిఫార్సు లేఖలను బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు. మంచి పోస్టుకు రూ.5 లక్షలు, గ్రామస్థాయి పోస్టుకైతే రూ.30వేలు వసూలుచేస్తున్నారు.
మట్టి అక్రమ రవాణాపై కలెక్టర్ ప్రేక్షకపాత్ర..
అలాగే, సుండుపల్లె మండలం తిమ్మసముద్రంలో అక్రమంగా మట్టి తరలిస్తుంటే నేను, మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్ కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఆయన తెలియనట్లు వ్యవహరించారు. తహసీల్దారును కలెక్టరు మొక్కుబడిగా మందలించారుగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అనుంపల్లె నుంచి మట్టి తోలుతుంటే తనకు సంబంధంలేదని తహసీల్దారు చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్న వారిని అడ్డుకుంటాం.
నా సభలకు అధికారులను అడ్డుకుంటున్నారు..
మరోవైపు.. నేను పాల్గొంటున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ సభలకు అధికారులను రానివ్వకుండా సమన్వయకర్తగా నియమితులైన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లె గ్రామ పెద్దలకు ఫోన్‌చేసి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరగకూడదని చెప్పాడు. కానీ, గ్రామస్తులు జిల్లా అధ్యక్షుడి మాట లెక్కచేయకుండా ఈ సభ నిర్వహించారు. వాస్తవానికి.. రాంగోపాల్‌రెడ్డి సీఎం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు నియమించిన వ్యక్తి కాదు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా.
సభ్యత సంస్కారం లేనివారిని పదవుల్లో పెట్టుకోవడంవల్లే పార్టీకి నష్టం జరుగుతోంది. ఇక మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలోని తన బంధువులకు వత్తాసు పలుకుతూ వారికి పనులు చేసిపెడుతున్నాడు. రాయచోటిలో టీడీపీ సీనియర్లందరూ కలిసి పనిచేస్తేనే రాంప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారన్న విషయం ఆయన మర్చిపోయారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఆశయాలకు మంత్రి తూట్లు పొడుస్తున్నారు. రవాణాశాఖలో ఆయన లీలలు, బాగోతాలు పత్రికల్లో వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment