ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కొండబాబు వర్గీయుల నిరసన
కాకినాడలో మరోసారి రోడ్డెక్కిన టీడీపీ, జనసేన విభేదాలు
పనిలో పనిగా ‘ద్వారంపూడి’పైనా అక్కసు
కాకినాడ: కాకినాడలో కూటమి పార్టీలైన టీడీపీ–జనసేన మధ్య ‘దీపావళి’ చిచ్చు రేపింది. బాణసంచా దుకాణాల కేటాయింపులో అధికారుల తీరును తప్పుపడుతూ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) వర్గీయులు రోడ్డుపై పడుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సును అడ్డగించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
ఓ వైపు కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌పై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతూ పనిలో పనిగా ఇక్కడి అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఇప్పటికే పర్లోపేట వద్ద వైన్‌షాపు కేటాయింపు విషయంలో ఇరుపార్టీల మధ్య వివాదం నెలకొంది. ఇప్పుడు బాణసంచా దుకాణాల కేటాయింపులో కూడా రోడ్డెక్కడంతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య నెలకొన్న అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. వివరాలివీ..
టీడీపీ నగరాధ్యక్షుడు మల్లిపూడి వీరు మద్దతుతో కాకినాడ మెయిన్‌రోడ్డు అపోలో ఆస్పత్రి పక్క ఓ బాణసంచా దుకాణం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు, వస్త్ర దుకాణాలు, ఆస్పత్రులున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. బాణసంచా దుకాణం కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక అధికారులు అభ్యంతరం చెప్పడాన్ని టీడీపీ నగరాధ్యక్షుడు వీరు జీర్ణించుకోలేకపోయారు.
వాస్తవానికి.. జనావాసాల మధ్య దుకాణం ఏర్పాటుపై వివాదం రేగడంతో కలెక్టర్ షణ్మోహన్ పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్ అధికారులతో వేసిన కమిటీ కూడా అక్కడ దుకాణం ఏర్పాటుచేయడంపై అభ్యంతరం తెలిపింది. భానుగుడి జంక్షన్ సమీపంలో జనసేన మద్దతుతో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణానికి లేని అభ్యంతరం తమ విషయంలోనే ఎందుకంటూ అధికారులపై మండిపడ్డారు. ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్ ఒత్తిడితోనే టీడీపీ వారి దుకాణానికి చెక్ పెట్టారని వీరు బలంగా అనుమానిస్తున్నారు. దీంతో ఎంపీపై అక్కసు వెళ్లగక్కేందుకు వీరుతోపాటు టీడీపీ శ్రేణులంతా ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దుకాణాల కేటాయింపు తీరుపై విమర్శలు..
మరోవైపు.. గతంలో ఎన్నడూలేని విధంగా కాకినాడలో బాణసంచా దుకాణాల కేటాయింపు ప్రక్రియను టీడీపీ ఓ ప్రైవేటు లాడ్జిలో నిర్వహించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే కేటాయింపు ప్రక్రియను హైజాక్ చేసి కొత్త సంస్కృతికి తెరలేపడం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే..
ఇక ప్రభుత్వం మారినా అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట విని, పనిచేస్తున్నారంటూ కొండబాబు వర్గీయులు ఆరోపణలకు దిగారు. దీంతో.. బాణాసంచా దుకాణాల కేటాయింపులో వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ద్వారంపూడిపై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జేసీఎస్ (జగనన్న కన్వీనర్లు, సారథుల) కన్వీనర్ సుంకర విద్యాసాగర్ మండిపడ్డారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు నిరసన చేసిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలా తరచూ ద్వారంపూడిని వివాదంలోకి లాగడం సర్వసాధారణమైందని విమర్శించారు. దుకాణాల కేటాయింపు అంశంపై ద్వారంపూడి కానీ, వైఎస్సార్‌సీపీ కానీ ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment