
దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-జనసేనలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొల్లేరు గ్రామాల్లో జనసేన నాయకులపై టీడీపీ నేతల వరస దాడులకు తెగబడుతున్నారు.
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-జనసేనలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొల్లేరు గ్రామాల్లో జనసేన నాయకులపై టీడీపీ నేతల వరస దాడులకు తెగబడుతున్నారు. పెన్షన్ల పంపిణీ అంశంలో టీడీపీ నేతలే పంచి పెట్టాలని ఎమ్మెల్యే చింతమనేని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన జనసేన నేతలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తన అనుచరులతో దాడి చేయించి కేసులు పెట్టించారు.
కొల్లేరులో టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు పట్టాలంటే ఎమ్మెల్యేకు ఎకరాకు లక్ష కట్టాలంటూ కొల్లేరు వాసులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రౌడీ మూకలతో జనసేన నాయకులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
నేడు జిల్లాలో పర్యటించనున్న పవన్‌కల్యాణ్‌ను కలిసి చింతమనేని తీరుపై నియోజకవర్గ ఇన్ చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఫిర్యాదు చేయనున్నారు. కొన్ని అరాచక శక్తులు జనసేనలో చేరాయంటూ చింతమనేని వ్యాఖ్యానించారు. కొత్తగా పార్టీలో చేరి పెత్తనం చలాయిస్తే ఊరుకోమని.. పెన్షన్ పంపిణీకి, అలాంటి వారికి ఏం సంబంధం అంటూ చింతమని హెచ్చరించారు.