పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కక్ష పెంచుకున్న టీడీపీ కార్యకర్తలు వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
పర్చూరు : పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కక్ష పెంచుకున్న టీడీపీ కార్యకర్తలు వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన పర్చూరు మండలం ఇనగల్లులో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు తన్నీరు తిరుపతిరావు, కొప్పాకు వెంకటేష్, చిట్టినేని రామకృష్ణపై పథకం ప్రకారం దాడిచేసి గాయపరిచారు.
తన్నీరు తిరుపతిరావుపై గ్రామంలోని బొడ్డురాయి సెంటర్‌లో, కొప్పాకు వెంకటేష్‌పై ట్రాక్టర్‌లో పొలం వెళ్లి వస్తుండగా, చిట్టినేని రామకృష్ణపై పొలంలో పత్తి విత్తనాలు నాటి వస్తుండగా దాడిచేశారు. పోపూరి శ్రీను, రాములు మరికొంతమందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్డులతో వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తిరుపతిరావు, వెంకటేష్, రామకృష్ణలు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుండటంతో తెలుగుదేశం నాయకులు కక్ష కట్టారు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా దాడికి ప్రయత్నించారు.
అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ వర్గీయులు అదునుచూసి దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్‌ఆర్ సీపీ వర్గీయులు ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కె.మాధవరావు గ్రామానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన ముగ్గురినీ చికిత్స నిమిత్తం 108లో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని ఇంకొల్లు సీఐ సత్యకైలాష్‌నాథ్ తెలి పారు. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని చెప్పారు.