సాక్షి, తిరువళ్లూరు: ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు సెల్‌ఫోన్ టవరెక్కి ఆత్మహత్యా బెదిరింపులకు దిగాడు. మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడని ఆ అమ్మాయిని పోలీసులు తల్లిదండ్రులతో పంపారు. దీంతో ఆ యువకుడు మనస్తాపం చెంది బుధవారం సెల్‌ఫోన్ టవరెక్కాడు. భార్యను తనతో పంపేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని టవరెక్కి బెదిరించడంతో ఉద్రిక్తతకు నెలకొంది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌లోని కొప్పూర్ గ్రామానికి చెందిన మారియప్పన్ కుమారుడు గజేంద్రన్ (21).
ఇతను అదే ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థినిని వారం రోజుల కిందట తిరుమలలో వివాహం చేసుకున్నాడు. ఇలాఉండగా బాలిక అదృశ్యంపై ఫిర్యాదు మేరకు మనవాలనగర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక తిరుమలలో ఉన్నట్టు గుర్తించి మూడు రోజుల క్రితం వారిని తిరువళ్లూరు తీసుకొచ్చారు. అనంతరం బాలిక మైనర్ అని తెలియడంతో కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
టవరెక్కి బెదిరింపులు:
మైనర్ కావడంతో రహస్యంగా చేసుకున్న పెళ్లి చెల్లదని పోలీసులు చెప్పి ఇద్దరినీ వారి తల్లిదండ్రుల వద్దకు పంపారు. గజేంద్రన్ సెల్‌ఫోన్‌లో ఉన్న పెళ్లి ఫొటోలను తొలగించారు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ బలవంతంగా విడదీశారని యువకుడు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టవరెక్కి ఆత్మహత్యా బెదిరింపులకు దిగాడు. తిరువళ్లూరు అదనపు ఎస్పీ తిలైనటరాజన్, 20 మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చారు. యువకుడితో కింద నుంచే చర్చలు జరిపారు. తన భార్య వచ్చే వరకు కిందకు దిగనని, ఎవరైనా టవర్‌పైకి రావాలని ప్రయత్నిస్తే దూకేస్తానని యువకుడు బెదిరించాడు.
మీడియా ముసుగులో వెళ్లిన పోలీసు:
మీడియాతో సమస్యను చెప్పుకోవడానికి ఆ యువకుడు అంగీకరించాడు. ఓ కానిస్టేబుల్‌ను మీడియా ప్రతినిధిగా టవర్‌పైకి పంపారు. మళ్లీ అతను మనసు మార్చుకుని భార్యను చూపిస్తే తప్ప దిగనని భీష్మించుకున్నాడు. అప్పటికే టవర్ పైకి వెళ్లిన కానిస్టేబుల్ గజేంద్రన్‌తో లైవ్‌లో మాట్లాడిస్తానని చెప్పి నమ్మించి దగ్గరికి వెళ్లి పట్టుకున్నాడు. మరికొంత మంది పోలీసులు పైకి వెళ్లి రాత్రి 9 గంటలకు యువకుడిని కిందకు దించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన ఈ హైడ్రామా సుఖాంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment