మెదక్ : మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ నిర్మాణం కోసం తన భూమి పోతుందని ఓ రైతు ఓ సెల్‌టవర్ ఎక్కి ఆందోళన తెలిపాడు. పాతూరు పక్కనే గల శమ్నాపూర్‌కు చెందిన రైతు వెంకట్రామిరెడ్డికి రెండెకరాల పొలం ఉంది. మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ ఇతని పొలం మధ్యలోంచే వెళుతోంది. అయితే, ప్రభుత్వం ఇచ్చే పరిహారం తనకు చాలదని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో 500 అడుగులు తవ్వితే గానీ నీరు పడదని, కానీ తన పొలంలోని బావిలో ఎప్పుడూ నీరు ఉంటుందని అదే తనకు ఆధారమంటున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదని, రైల్వేలో చిన్న ఉద్యోగం ఇప్పించాలనే డిమాండ్‌తో శనివారం ఉదయం సెల్‌టవర్ ఎక్కాడు. దీంతో తహశీల్దార్ నవీన్, ఎస్‌ఐ వినాయక్‌రెడ్డి సిబ్బందితో కలసి పాతూరు చేరుకుని రైతు వెంకట్రామిరెడ్డికి నచ్చజెప్పారు. రైల్వే అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వెంకట్రామిరెడ్డి కిందకు దిగి వచ్చాడు.