బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం ఇవ్వాలని డిమాండ్
ప్రభుత్వం తెప్పదాట దోరణి అవలంభిస్తోందంటూ ధ్వజం
అనంతపురం క్రైం : బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న సెల్‌టవర్‌ను ఎక్కడం కలకలం రేపింది. సుమారు రెండు గంటల పాటు టవర్ నుంచి దిగకుండా పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. వివరాల్లోకి వెళ్తే...బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పిస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడేమో తెప్పదాట దోరణి అవలంభిస్తోందంటూ బీఈడీ అభ్యర్థులు ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, బీఈడీ అభ్యర్థి నరసింహులు ఉదయం 11 గంటల సమయంలో సెల్ టవర్ ఎక్కారు. సమాచారం అందుకున్న డీఎస్పీ మల్లికార్జున వర్మ, టూటౌన్ సీఐ శుభకుమార్, పలువురు ఎస్‌ఐలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టవర్‌పైకి ఎక్కిన వారిని కిందకు దింపే ప్రయత్నం చేశారు. లాభం లేకపోయింది. టూటౌన్ ఎస్‌ఐ హమీద్‌ఖాన్ సెల్‌టవర్ ఎక్కాడు. ఆందోళనకారుల వద్దకు వాటర్ బాటిల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పైకి వస్తే కిందకు దూకేస్తామంటూ నరసింహులు హెచ్చరించడంతో ఎస్‌ఐ వెనక్కు తగ్గారు.
టవర్ కింద రోడ్డుపై ఏఐఎస్‌ఎఫ్ నాయకులు బీఈడీ అభ్యర్థుల సమాఖ్య నాయకులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్‌కు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు డీఎస్సీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కనీసం కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు.
తామంతా ఓట్లు వేసింటేనే గద్దెనెక్కారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. డీఎస్పీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత ఆందోళనకారులను మంత్రితో మాట్లాడించారు. కాసేపటికి విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి ఇద్దరూ సెల్ కాన్ఫరెన్స్‌లో ఉంటూ అభ్యర్థులతో మాట్లాడారు.
డీఎస్సీ నోటిఫకేషన్ రద్దు చేయడం వీలుకాదని, తర్వాత డీఎస్సీలో బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం సెల్‌టవర్ నుంచి యువకులు కిందకు దిగారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మనోహర్, కుళ్లాయప్ప, అలి, కుళ్లాయిస్వామిగౌడ్, బీఈడీ అభ్యర్థుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు హనుమన్న, హనుమంతు, ప్రసాద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
సెల్‌టవరెక్కిన బీఈడీ అభ్యర్థులు
Published Thu, May 7 2015 2:23 AM | Last Updated on Fri, May 25 2018 5:49 PM
Advertisement
Advertisement