
‘టవర్ల’ టోకరా!
సామాన్యులు నివాస గృహానికి అనుమతి తీసుకోకున్నా.. ఆస్తిపన్ను చెల్లించకున్నా పెనాల్టీలతో కలిపి ముక్కుపిండి వసూలు చేసే జీహెచ్‌ఎసీ యంత్రాంగం..
- జీహెచ్‌ఎంసీ నెత్తిన ‘సెల్’ టోపీ
- అనుమతుల్లేకుండానే టవర్ల ఏర్పాటు
- ఆ తర్వాత ఫీజులు, ఆస్తిపన్ను కట్టని వైనం
- రూ.50 కోట్ల మేర జీహెచ్‌ఎంసీకి నష్టం
సాక్షి, హైదరాబాద్: సామాన్యులు నివాస గృహానికి అనుమతి తీసుకోకున్నా.. ఆస్తిపన్ను చెల్లించకున్నా పెనాల్టీలతో కలిపి ముక్కుపిండి వసూలు చేసే జీహెచ్‌ఎసీ యంత్రాంగం.. సెల్ టవర్ల నిర్వాహకులు విషయంలో చూసిచూడనట్టు వదిలేస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సెల్ టవర్ నిర్వాహకులు అనుమతులే తీసుకోకున్నా, ఆస్తి పన్ను చెల్లించకున్నా పట్టించుకోవడం లేదు. దీంతో జీహెచ్‌ఎంసీ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది.
ఫీజులు ఎగ్గొడుతున్న కంపెనీలు..
నగరంలో సెల్ టవర్ ఏర్పాటు చేసిన కంపెనీ జీహెచ్‌ఎంసీకి వన్‌టైమ్ ఫీజు కింద రూ.లక్ష చెల్లించాలి. సెల్ టవర్‌ను ఏర్పాటు చేసిన స్థల విస్తీర్ణాన్ని బట్టి ఏటా ఆస్తిపన్ను చెల్లించాలి. అనుమతులే లేకుండా టవర్లను ఏర్పాటు చేస్తున్న కంపెనీల నిర్వాహకులు, ఏర్పాటు తర్వాత ఫీజులు కూడా చెల్లించడం లేదు. గ్రేటర్‌లో అనధికారికంగా 3,303 సెల్ టవర్లను గుర్తించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో వెల్లడించారు. ఈ లెక్కన జీహెచ్‌ంఎసీకి రూ.33 కోట్లకుపైగా రావాలి.
ఇది టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ఫీజు మాత్రమే. ఆస్తిపన్ను రూపేణా ఒక్కో టవర్ నుంచి సగటున రూ.20 వేల వరకు రావాలి. అనుమతి పొందిన, అనుమతి లేని అన్ని టవర్ల నుంచి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఆస్తిపన్ను రావాల్సి ఉంటుందని అంచనా. అనుమతి తీసుకున్న సంస్థలు సైతం సెల్ టవర్లకు సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించడం లేవు. ఇలా జీహెచ్‌ఎంసీకి రావాల్సిన దాదాపు రూ.50 కోట్లు రాకుండా పోయాయి.
పుట్టగొడుగుల్లా సెల్ టవర్లు..
ప్రస్తుతం భాగ్యనగరంలో పుట్టగొడుగుల్లా సెల్ టవర్లు పుట్టుకొస్తున్నాయి. అక్రమంగా అనధికారి కంగా ఏర్పాటు చేస్తున్న ఈ టవర్లతో రేడి యేషన్ ప్రభావం ఉంటుందని, ప్రజలు ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని హైదరా బాదీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని, ఒకవేళ రేడి యేషన్ తీవ్రతపై ఫిర్యాదులు అందితే వాటిని డాట్ టర్మ్ సెల్‌కు తగిన చర్యల నిమిత్తం తెలియజేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెపుతున్నారు. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్‌ను అది నియంత్రిస్తుందని తెలిపారు. అయితే జీహెచ్‌ఎంసీ తన పరిధి లోని అక్రమ టవర్ల ఏర్పాటును చూసీ చూడనట్లు వదిలేయడం విమర్శలకు తావి స్తోంది. టవర్ల నిర్వాహకులతో అధికారుల లాలూచీయే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
► 2013లో వెలువడిన జీవో మేరకు స్కూళ్లు, ప్రార్థనా మందిరాలు, ఆస్ప త్రుల వంటి ప్రదేశాలకు వంద మీటర్ల లోపు సెల్ టవర్ల ఏర్పాటు నిషిద్ధం. ఆ మేరకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొంది సెల్ టవర్‌ను ఏర్పాటు చేయాలి.
► 2015లో వెలువరించిన జీవో మేరకు సెల్ టవర్‌ను ఏర్పాటు చేశాక సమాచారం ఇవ్వవచ్చు. దీన్ని ఆసరా చేసుకునే సమాచారమే ఇవ్వకుండా సెల్‌టవర్లు ఏర్పాటు చేసేస్తున్నారు.