సాక్షి, విజయవాడ: కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన కొత్త మలుపు తిరిగింది. గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఫాతిమా మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్బకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలపై తమకు నమ్మకం పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు.
రేపు (సోమవారం) సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కలెక్టర్ లక్ష్మీకాంతం వారికి నచ్చజెప్పినా విద్యార్థులు వినడం లేదు. తక్షణం వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సెల్ టవర్ వద్దకు వచ్చి మీడియా సమక్షంలో తమ సమస్య పరిష్కారంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు గంటలుగా విద్యార్థులు సెల్‌టవర్‌పై ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించక పోవడం సిగ్గుచేటని అక్కడికి చేరుకున్న వైఎస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పటివరకూ నాలుగుసార్లు సీఎం చంద్రబాబును కలిసినా ప్రయోజనం లేకపోయిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే వైఎస్ జగన్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కు లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు సెల్ టవర్ ఎక్కారని తెలిపారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అసలు వివాదం ఏంటంటే..
'ఫాతిమా కాలేజీ 2015-16 బ్యాచ్ విద్యార్థుల అడ్మిషన్లను సరైన వసతులు లేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎమ్‌సీఐ) రద్దు చేసింది. తొలి రెండు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగులో విద్యార్థుల చేరికకు ఎమ్‌సీఐ అనుమతి ఇవ్వలేదు. కాలేజీ యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులతో మూడో దశ కౌన్సెలింగులో 100 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. అనంతరం ఈ విద్యార్థుల సీట్లను ఎమ్‌సీఐ రద్దు చేసింది. దీంతో ఆ విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోయింది. తమకున్న సీట్లలోని వంద సీట్లను ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి నిరాకరించడంతో ఇతర కాలేజీల్లో చేర్చాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment