
సాక్షి, విజయవాడ: ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన కొత్త దోవ పట్టింది. గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు గుణదల ప్రాంతంలో సెల్ టవర్ ఎక్కారు. ఐదుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కారు. తమకు ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తాననే హామీ ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సెల్ టవర్ దిగేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.
సెల్ టవర్ ఎక్కిన వారికి నచ్చజెప్పి కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ లక్ష్మీకాంతం చర్చలు జరుపుతున్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున, విద్యార్థి విభాగం నేత అంజిరెడ్డి, పలువురు ప్రజా సంఘాల నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.