సాక్షి, మచిలీపట్నం/ న్యూస్‌లైన్, మచిలీపట్నం టౌన్ : ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. 420 జీవోతో సెల్ టవర్‌ల ఏర్పాటుకు మరింత వెసులుబాటు కల్పించింది. దీంతో సెల్‌టవర్లు ప్రజల పాలిట టైగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ టవర్‌ల నుంచి విడుదలయ్యే అత్యధిక రేడియేషన్ ప్రభావం ప్రజారోగ్యానికి చేటు తెస్తుంది. గతంలో నివాస ప్రాంతాల్లో సెల్ టవర్‌ను ఏర్పాటు చేయాలంటే ఆ భవన యజమానితో పాటు చుట్టుపక్కల నివాసితుల అంగీకారం తప్పనిసరి అనే నిబంధన ఉంది. ప్రస్తుత జీవో ప్రకారం టవర్ ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చే స్థల, భవన యజమాని అనుమతి ఉంటే చాలు. సెల్ కంపెనీల కాసులకు లొంగి.. ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసిందంటూ అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇక విచ్చలవిడిగా టవర్ల ఏర్పాటు...
ప్రభుత్వ జీవోతో ఇకపై విచ్చలవిడిగా సెల్ టవర్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశముంది. జిల్లాలో ప్రస్తుతం 318 సెల్‌వన్ (బీఎస్‌ఎన్‌ఎల్ సెల్) టవర్‌లు ఉన్నాయి. వాటిలో 105 విజయవాడ నగరంలోనివే. మిగిలిన ప్రైవేటు నెట్‌వర్క్‌లకు చెందిన సెల్ టవర్‌లు జిల్లాలో సుమారు 1200 వరకు ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్‌లు నిర్దేశించిన ఫ్రీక్వెన్సీతోనే ఉంటాయి కాబట్టి వాటి నుంచి ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగించేంతగా రేడియేషన్ ప్రభావం ఉండదు. ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం మారుమూల ప్రాంతాలకు సైతం తమ నెట్‌వర్క్ అందేలా సెల్ టవర్‌లను అత్యధిక ఫ్రీక్వెన్సీ ఉండేలా ఏర్పాటు చేస్తారు.
దీనివల్ల అత్యధిక రేడియేషన్ విడుదలై సమీపంలో నివసించే ప్రజలకు చర్మవ్యాధులు, ప్రమాదకర రోగాలు ప్రబలుతున్నట్టు అనేక సందర్భాల్లో నిర్ధారణ అయ్యింది. జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట మున్సిపాలిటీలతో పాటు తిరువూరు, నందిగామ, ఉయ్యూరు నగర పంచాయతీల్లోను సెల్ టవర్‌ల ఏర్పాటుపై అనేకసార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. పట్టణ, పల్లె ప్రాంతాల్లో సైతం సెల్ టవర్‌ల ఏర్పాటుతో తాము అనారోగ్యం పాలవుతున్నామంటూ ప్రజలు అధికారులకు అనేక ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. అయినా అధికారిక అనుమతితో సెల్ టవర్‌ల ఏర్పాటు మాత్రం యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది.
న్యాయస్థానాల సూచనలనూ తోసిరాజని...
సెల్ టవర్‌ల ఏర్పాటుకు భవన యజమాని అనుమతితోపాటు సమీప నివాసితుల అనుమతి తప్పనిసరని, పాఠశాలలు, ఆస్పత్రుల సమీపంలో సెల్ టవర్‌లను నిషేధించాలని గతంలో అనేక పర్యాయాలు న్యాయస్థానాలు సూచించాయి. అయినా ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా జీవో ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
ప్రజారోగ్యంపై ప్రభావం..
నివాసగృహాల మధ్య సెల్ టవర్‌ల ఏర్పాటు కారణంగా తాము అనారోగ్యం పాలవుతున్నామని, వ్యాధులబారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెల్‌టవర్‌ల నుంచి వచ్చే తరంగాల వల్ల దాదాపు 500 మీటర్ల పరిధిలో ఉండే నివాసితులు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ప్రధానంగా చర్మ, గుండె సంబంధ వ్యాధులు, నిద్రలేమి, వినికిడి లోపం, క్యాన్సర్, కణితులు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
గర్భిణులపై రేడియేషన్ ప్రభావం అధికంగా పడితే పుట్టే పిల్లలకు అంగవైకల్యం సంభవించే అవకాశముందని వివరిస్తున్నారు. మచిలీపట్నం 42వ వార్డు పరిధిలోని జెట్టివారి వీధిలో నాలుగేళ్ల క్రితం ఏర్పాటుచేసిన సెల్ టవర్ కారణంగా తాము రోగాలబారిన పడ్డామని ప్రాంత మహిళలు గతంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సెల్ టవర్‌ను తొలగించాలని వారు కోరారు. దీంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్ ఎస్.శివరామకృష్ణకు బాధితులు తమ ఆవేదన వివరించారు. గుండె, ఊపిరితిత్తులు, చర్మ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడిన వారు తమ హెల్త్ రిపోర్ట్‌లను కూడా చూపారు.
టవర్ తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా చేశారు. మచిలీపట్నం 16వ వార్డు మల్కాపట్నం వాసులు క్యాన్సర్, ఇతర వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతున్నామని వాపోతున్నారు. ఆ టవర్ వల్ల క్యాన్సర్ బారినపడి దాదాపు 12 మందికి మృతిచెందారని చెబుతున్నారు. గత మే నెలలో మృతి చెందిన వైఎస్సార్ సీపీ పట్టణ నాయకుడు శ్లీలరాజు కూడా ఈ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగానే క్యాన్సర్ బారిన పడి మృతి చెందాడని ఆయన కుటుంబీకులే ఆరోపించారు. సుల్తానగరంలో ప్రజలు గతేడాది పదిరోజుల పాటు రిలే దీక్షలు చేశారు. చివరకు సెల్‌కంపెనీ ప్రతినిధులు సెల్‌టవర్ నిర్మాణం నిలుపుదల చేస్తున్నట్టు చెప్పడంతో ఆందోళనలు విరమించారు. ఏదేమైనా ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తగదని ప్రజలు విమర్శిస్తున్నారు.
ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. 420 జీవోతో సెల్ టవర్‌ల ఏర్పాటుకు మరింత వెసులుబాటు కల్పించింది.