ఓ వ్యక్తి అనుమతులకు మించి భవనం నిర్మించడమే కాకుండా దానిపై సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు యత్నించగా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు.
దూలపల్లి (రంగారెడ్డి): ఓ వ్యక్తి అనుమతులకు మించి భవనం నిర్మించడమే కాకుండా దానిపై సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు యత్నించగా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. కుత్బుల్లాపూర్ మండలం సుందర్‌నగర్‌లోని సెయింట్ ఆంథోనీ హైస్కూల్ కు ఎదురుగా ఉన్న వీధిలో ఓ వ్యక్తికి చెందిన బహుళ అంతస్తుల ఇంటిపై సెల్ టవర్ నిర్మిస్తుండగా ఈ నెల 3న స్థానికులు అడ్డుకున్నారు.
అయితే, సోమవారం మరోసారి సెల్ టవర్ ఏర్పాటు చేస్తుండగా విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని యజమానితో వాగ్వివాదానికి దిగారు. పరిమితికి మించి అంతస్తులు నిర్మించడమే కాకుండా సెల్ టవర్ ఏర్పాటుతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నావని నిలదీశారు. సెల్ టవర్ ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని, కేసు పెడతామని స్థానికులు హెచ్చరించారు. దీంతో టవర్ ఏర్పాటు కోసం వచ్చిన వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.