
అక్కపై అలిగి సెల్ టవర్ ఎక్కాడు....
ఖమ్మం : అవసరానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదంటూ అక్క మీద అలిగిన ఓ తమ్ముడు సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. అయితే పోలీసులు నచ్చచెప్పటంతో ఎట్టకేలకు దిగి వచ్చాడు. ఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం ఖమ్మం జిల్లా టేకులపల్లి సమీపంలోని బీ-కాలనీకి చెందిన తేజావత్ జంపన్న ముత్యాలంపాడు పంచాయతీ తావుర్య తండాలో ఉంటున్న తన సోదరి బుల్లి వద్దకు వచ్చాడు. తనకు ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించటంతో మరుసటి రోజు కూడా మరోసారి అడిగాడు.
అయితే బుల్లి ససేమిరా అనటంతో అలిగిన జంపన్య ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి గట్టిగా అరవసాగాడు. పై నుంచి కిందకు దూకుతానంటూ బెదిరించాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దాంతో ఎస్ఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని, జంపన్స సోదరిని పిలిపించారు. ఆ తరువతా పోలీసులు, సోదరి నచ్చచెప్పటంతో అతగాడు కిందకు దిగి వచ్చాడు.