Jampanna
-
వరుస ఎన్ కౌంటర్లతో మావోయిజాన్ని ఆపలేరు
-
‘గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు’
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటు వార్తల్లో నిజం లేదని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న స్పష్టం చేశారు. పోలీసులకు గణపతి లొంగిపోతున్నాడని, ఆ క్రమంలోనే సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. ఈ మేరకు ‘సాక్షి’తో మాట్లాడిన జంపన్న.. ‘గణపతికి అనారోగ్యం సమస్యలుంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చూసుకుంటుంది. పోలీసుల స్టేట్మెంట్లో కూడా వాళ్లు వస్తే మేము సహకరిస్తామని మాత్రమే చెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవు. గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు.మావోయిస్ట్ పార్టీ ఎదుగుదలకు గణపతి ఎంతో కృషిచేశాడు. గణపతి లొంగుబాటు కేవలం ప్రచారం మాత్రమే. డీజీపీ ఏజన్సీ పర్యటనకు గణపతి లొంగుబాటుకు సంబంధం లేదు. తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ ఉనికి కారణంగానే డీజీపీ పర్యటన ఉండొచ్చు. గణపతికి విదేశాల్లో చికిత్స అవాస్తవం. గణపతి లొంగిపోతాడని నేను అనుకోవడం లేదు’ అని జంపన్న తెలిపారు. గణపతి ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా మాత్రమే ఇస్తున్నారు. -
జంపన్న మావోయిస్టు పార్టీ ద్రోహి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న అలియాస్ జినుగు నర్సింహారెడ్డి పోలీసులకు లొంగిపోయిన సందర్భంగా చేసిన ఆరోపణలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. జంపన్నను మావోయిస్టు పార్టీ ద్రోహిగా అభివర్ణించింది. పీపుల్స్ వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ)లో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన జంపన్న మూడు దశాబ్దాలపాటు పార్టీలో పనిచేశారని, అలాంటి వ్యక్తి పార్టీపై చేసిన ఆరోపణలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వ్యవహారంలా కనిపిస్తోందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం మీడియాకు లేఖ విడుదల చేశారు. పార్టీలో ఉంటూ క్యాడర్ మనోస్థైర్యం కోల్పోయేలా జంపన్న వ్యవహరించారని దుయ్యబట్టారు. పార్టీ సిద్ధాంతాల కోసం వేలాది మంది ప్రాణాలను అర్పించారని, అలాంటి పార్టీపై సైద్ధాంతిక విభేదాలతో బయటకు వచ్చానని చెప్పడం అభ్యంతరకరమన్నారు. ఒడిశా కమిటీ క్యాడర్‌తో జంపన్న వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని, పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు సూచించినా వినకుండా క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా జంపన్న ప్రవర్తించాడని ఆరోపించారు. అంతే కాకుండా కేంద్ర కమిటీ అప్పగించిన ఏ పని కూడా సరైన రీతిలో చేయకుండా విఫలమయ్యాడని, కొన్నేళ్ల నుంచి జంపన్న పనితీరుపై కేంద్ర కమిటీ అసంతృప్తిగా ఉందని అభయ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఏడాది క్రితమే కేంద్ర కమిటీ జంపన్నపై రెండేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసిందన్నారు. పార్టీ కమిటీలో చర్చించకుండా బహిరంగంగా మాట్లాడటం కూడా జంపన్న సస్పెన్షన్‌కు మరో కారణమన్నారు. శత్రువు ఎదుట మోకరిల్లాడు... పార్టీలో చేసిన అనేక తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించకుండా జంపన్న విలువలు కాలరాసి శత్రువు ఎదుట మోకరిల్లాడంటూ కేంద్ర కమిటీ మండిపడింది. వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ అలవాట్లకు తలొగ్గి జంపన్న లొంగిపోయినట్లు అభయ్ విమర్శించారు. ప్రస్తుతం దేశ పరిస్థితులకు తగ్గట్లుగానే మావోయిస్టు పార్టీలో మార్పు జరిగిందని, ఈ అంశంపై చర్చించేందుకు పార్టీలోని కేంద్ర కమిటీ సభ్యులకు స్వేచ్ఛ కూడా ఉందని అభయ్ తెలిపారు. అయితే కేంద్ర కమిటీ సమావేశాలకు రాకుండానే పార్టీలో మార్పులపై చర్చించే అవకాశం లేదంటూ జంపన్న పోలీసుల ఎదుట ఆరోపించడం సమంజసం కాదన్నారు. దేశ పరిస్థితులకు తగ్గట్లుగా మావోయిస్టు పార్టీలో మార్పు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్ మొత్తం కృషి చేస్తున్న సందర్భంలో పార్టీ నుంచి బయటకు వెళ్లి విమర్శించడం ఎలాంటి సిద్ధాంతమో జంపన్న ఆలోచించుకోవాలని అభయ్ వ్యాఖ్యానించారు. -
జంపన్న ద్రోహం చేశాడు
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న ద్రోహం చేశాడని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిథి అభయ్ లేఖ ద్వారా తెలిపాడు. లేఖ సారాంశం..జంపన్నను ఏడాది క్రితం సస్పెండ్ చేశామని చెప్పారు. సస్పెండ్ తర్వాతే మావోయిస్టు పార్టీతో విభేదిస్తున్నట్లు తమతో చెప్పాడని వెల్లడించారు. లొంగుబాటు గురించి తమతో చర్చించలేదన్నారు. జంపన్న శత్రువు ముందు మోకరిల్లాడని, మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల పట్టు కోల్పోయాడని విమర్శించారు. మావోయిస్టు పార్టీ పై ఆయన వ్యాఖ్యలు అర్ధరహితమని, ఎర్రజెండా నీడలో మావోయిస్టు పార్టీ బలంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సొంత లాభం , రాజకీయ స్వార్ధం కోసమే జంపన్న పార్టీని వీడాడని లేఖ ద్వారా విమర్శించారు. -
అమ్మను, ఊరిని చూస్తాననుకోలేదు
తొర్రూరు రూరల్(పాలకుర్తి): కన్నతల్లిని, పుట్టిన ఊరిని మళ్లీ చూస్తానని అనుకోలేదని మావోయిస్టు మాజీ నేత జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న అన్నారు. జంపన్న భార్య రజితతో కలసి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని తన స్వగ్రామమైన చెర్లపాలెంకు మంగళవారం వచ్చారు. గ్రామస్తులు, బంధువులు, స్నేహితులతో సాయంత్రం వరకు గడిపారు. జంపన్న విలేకరులతో మాట్లాడుతూ, రాజకీయాలపై విముఖత ఏమీ లేదని, అలాగని ఇష్టం కూడా లేదన్నారు. రాజకీయాల్లో చేరతారా అని అడుగుతున్నారని, దీనికి త్వరలో సమాధానమిస్తానన్నారు. ప్రజల కోసమే తన జీవితం అంకితమన్నారు. ప్రజల కోసమే అజ్ఞాతవాసం చేశానని, తల్లిని, తండ్రిని ఒక్కసారైనా చూసేందుకు నోచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జంపన్న దంపతులకు గ్రామంలో ఘనస్వాగతం లభించింది. 33 ఏళ్ల తర్వాత.. జంపన్న 33 ఏళ్ల తర్వాత తన చిన్ననాటి స్నేహితులను, బంధువులను కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 10వ తరగతి అనంతరం గ్రామాన్ని వీడిన జంపన్న సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడికి వచ్చారు. గ్రామ ఆడపడుచులు ఆ దంపతులకు బొట్టుపెట్టి గ్రామంలోకి ఆహ్వానించారు. గ్రామంలోకి రాగానే జంపన్న బాబాయ్ మోహన్‌రెడ్డి ఆప్యాయంగా కౌగిలించుకుని ఉద్విగ్నతకు లోనయ్యాడు. ఇన్ని రోజులు ఏమై పోయావు బిడ్డా అని కన్నీటిపర్యంతమయ్యాడు. జంపన్న పాఠశాలలో చదివిన రోజులను గుర్తుచేసుకుని సంబురపడ్డారు. బంధువులతో కలసి భోజనం చేశారు. తాను నివసించిన ఇల్లును పరిశీలించాడు. -
జంపన్న సహచరిణి సుల్తానాబాద్ హేమలతే!
పెద్దపల్లి: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సీనియర్ నేత జంపన్నకు ఉమ్మడి జిల్లాలోని పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీ కార్యకలాపాలతో విడదీయరాని అనుబంధం ఉంది. 1994లో సుల్తానాబాద్‌కు చెందిన హేమలత అనే ప్రైవేటు పాఠశాల టీచర్ పీపుల్స్‌వార్ పార్టీలో చేరారు. ఆ సమయంలో జంపన్న మహదేవపూర్, ఏటూరు నాగారం ప్రాంతాలకు జిల్లా కమిటీ సభ్యునిగా ఉన్నారు. ఆ సమయంలో పెద్దపల్లి, మంథని దళాలకు శిక్షణ ఇచ్చేందుకు జంపన్న ఈ ప్రాంతంలో పర్యటించేవారు. జంపన్నకు సహచరిణిగా పని చేసిన హేమలత ఆయననే పార్టీ వివాహం చేసుకొని భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి ప్రాంత దళ కమాండర్‌గా పని చేశారు. 2001లో జరిగిన ఎన్కౌంటర్లో సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో స్వర్ణక్కతోపాటు 8 మంది హతమయ్యారు. సహచరిణి కోల్పోయిన జంపన్న ఆ తర్వాత పార్టీలో రెండో వివాహం చేసుకున్నారు. ఆమెతో కలిసి ప్రస్తుతం ప్రభుత్వానికి జంపన్న లొంగిపోయారు. -
కొడుకా.. ఎట్ల బతుకుతవురా..
సాక్షి, కాజీపేట: పుట్టి పెరిగిన ఊర్లో ఇల్లు కూలిపోయే.. భూములు లేవయే ఏట్లా బతుకువుతారా కొడుకా అంటూ జంపన్న తల్లి యశోదమ్మ ఉద్వేగానికి లోనవుతూ ప్రశ్నించడం చూపరుల హృదయాలను కలచివేసింది. మావోయిస్టు అగ్రనేతగా పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిన జినుగు నర్సింహరెడ్డి అలియాస్ జంపన్న సోమవారం రాత్రి సహృదయ ఆశ్రమంలో ఉంటున్న తల్లి యశోదమ్మను భార్య రజితతో కలిసి వచ్చి పరామర్శించారు. మూడున్నర దశాబ్దాల కాలం తర్వాత కళ్ల ముందు కనిపించిన కుమారుడిని చూసిన యశోదమ్మ తల్లడిల్లిపోయింది. చివరి చూపునకు నోచుకుంటానో లేదోనని నిత్యం మదనపడ్తుండేదాన్నని ఇంత కాలానికైనా నా దగ్గరికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ప్రేమపూర్వకంగా కుమారుడిని దగ్గరకు తీసుకుని ముద్దాడింది. ప్రజల కోసమంటూ మళ్లీ ఎక్కడికి వెళ్లొద్దని, భార్యతో హాయిగా ఉండుమంటూ కన్నీళ్ల పర్యంతమవుతూ దీవించింది. ఆశ్రమంలోనే ఉంటా.. ఎక్కడికి రాను.. ఇక నుంచి నీతోనే ఉంటాను రమ్మని తల్లిని కోరగా నాలుగేండ్లుగా ఆశ్రయం కల్పించిన సహృదయను వదిలి ఎక్కడికీ రానని తనకు మొదటి నుంచి సీతక్క, అలీ సాయం చేస్తున్నట్లుగా చెప్పింది. తన ప్రాణం ఆశ్రమంలోనే పోవాలని ఇంత కాలానికి బయటకు వచ్చిన మీకు భారంగా మారడం ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పింది. తల్లీకుమారుడు ఒకరికొకరు గోరుముద్దలు తిన్పించుకుంటూ భోజనం చేస్తుండడం చూసి ఆశ్రమంలో ఉన్న వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. తల్లీకొడుకుల బంధుత్వం విలువ కట్టలేనిది.. అనంతరం జంపన్న విలేకరులతో మాట్లాడుతూ మా అమ్మకు ఆశ్రయం కల్పించి చక్కగా చూసుకుంటున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తల్లీబిడ్డల ప్రేమ, అప్యాయతకు విలువ కట్టలేనిదని, ఉద్యమంలో ఉన్నపుడు మా అమ్మ ఇచ్చే ప్రకటనలు చూసినప్పుడు బాధ అన్పించినా.. ఎంతో మంది తల్లులు పిల్లలకు దూరమై భారంగా బతుకుతున్నారని వారి ఆవేదన, ప్రజల కష్టాలను తీర్చడం కోసమే ఉద్యమబాట పట్టినట్లు చెప్పారు. తల్లిని చూసుకోవడానికి తరచు వచ్చిపోతుంటానని తెలిపారు. కొడుకును చూడటం ఆనందంగా ఉంది.. బతికి ఉండగా జంపన్నను చూస్తాననుకోలేదని, భగవంతుడు నా ప్రార్థనను ఆలకించడం సంతోషంగా ఉందని చెప్పింది. తల్లి కోరిక ప్రకారమే సోమవారం రాత్రి ఆగమేఘాల మీద జంపన్న సహృదయ ఆశ్రమాన్ని సందర్శించినట్లు బంధువులు ‘సాక్షి’కి తెలిపారు. సోమవారం మంచి రోజు కాబట్టి వెంటనే రావాలని లేకపోతే రెండు, మూడు రోజులు ఆగాలని చెప్పడంతో తల్లి కోరిక మేరకు వరంగల్‌కు వచ్చినట్లు వివరించారు. -
33 ఏళ్ల తర్వాత అమ్మ చెంతకు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముప్పై మూడేళ్ల కింద అడవి బాట పట్టిన కొడుకు జంపన్న.. ఎవరూ లేక వృద్ధాశ్రమంలో ఉన్న తల్లి యశోదమ్మ.. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నవారు తీవ్ర ఉద్వేగంలో మునిగిపోయారు. ఇన్నేళ్ల తర్వాత తన తల్లిని చూసిన జంపన్నకు మాటలు పెగలలేదు. తొంభై ఏళ్ల వయోభారంతో ఉన్న యశోదమ్మ కన్నీరుపెడుతూ ‘బాగున్నవా కొడుకా..’అంటుంటే.. ఆయన కూడా కన్నీరు ఆపుకోలేకపోయారు. అన్నం తినిపించిన జంపన్నసోమవారం హైదరాబాద్‌లో డీజీపీ సమక్షంలో లొంగిపోయిన జంపన్న, రజిత.. రాత్రి 8.30 గంటల సమయంలో కాజీపేటలో ఉన్న సహృదయ అనాథాశ్రమానికి వచ్చి యశోదమ్మను కలిశారు. జంపన్నను చూసిన ఆమె.. ‘నా కొడుకా జంపయ్య.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ నా కొడుకా.. ఈడనే ఉంటాన్న కొడుకా..’అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆగకుండా ఏడుస్తూనే కొడుకు, కోడలు యోగక్షేమాలు అడిగింది. ఇన్నాళ్లుగా తాను అనుభవించిన పరిస్థితులను చెప్పుకొంది. తల్లిని చూసి మాటలుపెగలక నాలుగైదు నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయిన జంపన్న కూడా తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ‘అమ్మా.. నేను మంచిగనే ఉన్నా. ఇదిగో నీ కోడలు..’అంటూ భార్య రజితను చూపించారు. ఇప్పుడైనా వారసుడిని కనివ్వాలని యశోదమ్మ వారిని కోరింది. అనంతరం జంపన్న తల్లికి అన్నం కలిపి తినిపించారు. మా అమ్మలాంటి వారు ఎందరో..: జంపన్న తల్లి యశోదమ్మను కలసిన అనంతరం జంపన్న మీడియాతో మాట్లాడారు. ‘‘సమాజంలో అందరిలానే మా అమ్మపై నాకు ప్రేమ ఎక్కువ. మా అమ్మలాంటివారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. వారికోసమే మావోయిస్టు పార్టీలో పనిచేశాను. వేలాది మంది కామ్రేడ్లు కుటుంబాలను త్యాగం చేసి పోరాటం చేస్తున్నారు. వారి కుటుంబాలు, తల్లిదండ్రులు కనీస సౌకర్యాలు లేని దుస్థితిలో ఉండిపోతున్నారు. వారితో పోల్చితే మా అమ్మకు ఈ ఆశ్రమంలో కనీస సౌకర్యాలైనా ఉన్నాయి. నేను కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి.. మా అమ్మకు సంబంధించి విషయాలు మీడియాలో వస్తున్నాయి, నాకు తెలుస్తున్నాయి. అమ్మ ఆశ్రమంలో ఉన్న విషయం నాకు నాలుగు నెలల క్రితం తెలిసింది. ఆమె పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను. మావోయిస్టు పార్టీ, ప్రజలే నా తల్లిగా భావించి ఒక లక్ష్యం కోసం పనిచేశాను..’’అని చెప్పారు. -
అజ్ఞాతంలో 135 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన 135 మంది, ఏపీకి చెందిన 80 మంది మావోయిస్టు పార్టీలో ఉన్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఇతర కేడర్‌లో పనిచేస్తున్న వారంతా జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. సోమవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న లొంగుబాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. జంపన్నపై దేశవ్యాప్తంగా 100కుపైగా కేసులున్నాయని, అందులో తెలంగాణలో 51 కేసులున్నాయని చెప్పారు. జంపన్న ఆధ్వర్యంలో 1991 ఫిబ్రవరి 22న వాజేడు పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి 14 ఆయుధాలు అపహరించిన ఘటనలో కొందరు పోలీస్ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. 1991 జూన్ 15న ఏటూరు నాగారం పరిధిలోని చెల్పాకాలో పోలీస్ జీపును పేల్చేశారని, ఆ ఘటనలో సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై కిషోర్‌కుమార్, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారని చెప్పారు. భద్రాద్రి కొత్త గూడెం పరిధిలోని కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 17 మంది పోలీసులను హతమార్చారని, ఆయుధాలను ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. ఇక మావోయిస్టు పార్టీలో 13 ఏళ్లుగా పనిచేస్తున్న అనిత అలియాస్ రజిత భర్త జంపన్నతో కలసి లొంగిపోయినట్టు డీజీపీ వెల్లడించారు. జంపన్నపై ఉన్న రూ.25 లక్షలు, రజితపై ఉన్న రూ.5 లక్షల రివార్డును ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామన్నారు. అజ్ఞాతంలోనే వివాహం.. జంపన్న భార్య హింగె అనిత అలియాస్ రజిత స్వస్థలం వరంగల్ జిల్లా దామెర. ఆమె హన్మకొండలోని ఆదర్శ కాలేజీలో ఇంటర్, వడ్డెపల్లిలోని డిగ్రీ కాలేజీలో బీఎస్సీ, ఉస్మానియా దూరవిద్యా కేంద్రం ద్వారా ఎమ్మెస్సీ చేశారు. 2004లో చిట్యాల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ కమాండర్ రమాకాంత్ పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. జంపన్న నేతృత్వంలో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలోని ప్రెస్ టీమ్‌లో పనిచేశారు. 2006లో సెంట్రల్ రీజియన్ బ్యూరో ప్రెస్ టీమ్‌కు.. 2007లో ఏరియా కమిటీ సభ్యురాలిగా నియమి తులయ్యారు. 2009లో పార్టీ అనుమతి పొంది జంపన్న, రజిత వివాహం చేసుకున్నారు. 2012లో రజితను ఒడిశా రాష్ట్ర కమిటీకి బదిలీ చేశారు. 2014లో డివిజనల్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు.. జంపన్న అలియాస్ జినుగు నర్సింహారెడ్డి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం. 1979–80లో హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో చదువుతుండగా పీపుల్స్‌వార్‌కు చెందిన శాఖమూరి అప్పారావు, పులి అంజయ్య అలియాస్ సాగర్ల స్ఫూర్తితో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1984లో పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా చేరి.. ఏడాదిలోనే ఏటూరు నాగారం దళానికి కమాండర్‌గా నియమితులయ్యారు. 1991లో ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజన్ (ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్)లో సభ్యుడిగా నియమించారు. ఏడాది తిరిగేలోగా అదే కమిటీకి కార్యదర్శిగా ఎదిగారు. పార్టీ కేంద్ర నాయకత్వం 2000 సంవత్సరంలో జంపన్నకు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. 2003లో ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో జరిగిన 9వ ప్లీనరీలో స్పెషల్ జోనల్ కమిటీ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. భారీ స్థాయిలో మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించిన నేపథ్యంలో. జంపన్నను కేంద్ర మిలటరీ కమిషన్ సభ్యుడిగా నియమించారు. 2004లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం సెంట్రల్ రీజియన్ బ్యూరో సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్చార్జిగా, ఛత్తీస్‌గఢ్–ఆంధ్రా కమిటీ లీడ్ మెంబర్‌గా కొనసాగారు. కేంద్ర కమిటీలో 18 మంది మావోయిస్టు పార్టీలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కేంద్ర కమిటీలో ఇప్పటివరకు 19 మంది సభ్యులుండగా.. జంపన్న లొంగుబాటుతో వారి సంఖ్య 18కి తగ్గింది. వయోభారం, అనారోగ్య కారణాలు, సైద్ధాంతిక విభేదాలు, వ్యక్తిగత కారణాలతో నేతలు లొంగిపోతుండటం.. కాలక్రమేణా మావోయిస్టు పార్టీని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యులుగా ప్రశాంత్ బోస్, నంబాల కేశవరావు, మిసర్ బెస్రా, మల్లోజుల వేణుగోపాల్‌రావు, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, దేవ్‌కుమార్‌సింగ్, అక్కిరాజు హరగోపాల్, కడారి సత్యనారాయణరెడ్డి, వివేచ్ చందర్‌యాదవ్, రంజిత్ బోస్, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాద్‌రావు, రావుల శ్రీనివాస్, ఒగ్గు బురల్సత్యాజీ, మిలింద్ తేల్ముండే ఉన్నారు. -
సైద్ధాంతిక విభేదాలతోనే బయటకొచ్చా
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీతో సైద్ధాంతికపరమైన విభేదాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత జంపన్న అలియాస్ జినుగు నర్సింహారెడ్డి తెలిపారు. 33 ఏళ్లుగా పార్టీలో నిబద్ధత, నిజాయితీతో పనిచేసిన తాను భార్య అనిత అలియాస్ రజితతో సహా స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సోమవారం డీజీపీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. చర్చించే అవకాశం లేదు.. దేశంలో గత పదిహేనేళ్లలో విపరీతమైన మార్పులు వచ్చాయని, గతంలో ఉన్న ట్లుగా భూస్వామ్య వ్యవస్థ ఇప్పుడు లేదని జంపన్న అభిప్రాయపడ్డారు. కానీ కార్మిక, ఉద్యోగ, యువత, ప్రజల సమస్యలపై మావోయిస్టు పార్టీ పోరాట పం థాలో మార్పు రాలేదని, దీనిపై తాను కేంద్ర కమిటీ సభ్యుడిగా చర్చించే అవ కాశం లేకుండాపోయిందని జంపన్న తెలిపారు. అయితే ఈ అంశంపై తనను పార్టీలోనే ఉండి పార్టీ పనితీరు, పద్ధతిలో మార్పు తెచ్చేలాగా పోరాడాలని సహ చరులు చెప్పినా తాను వినలేదని, తన వల్ల ఆ మార్పు సాధ్యం కాదన్న అభి ప్రాయంతో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని బయటకు వచ్చానని వెల్లడించారు. పార్టీకి ద్రోహం చేసినట్లు కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం బయటకు వచ్చానని చెబుతూనే మావోయిస్టు పార్టీపై ఆరోపణలు చేయడంపై ప్రశ్నించగా తాను పార్టీని దూషించడంలేదని జంపన్న పేర్కొన్నారు. ఎప్పుడో ఏళ్ల కింద ఉన్న సిద్ధాంతాలు, పనితీరు ప్రక్రియే నేటికీ కొనసాగుతోందని, అది పార్టీ పునర్నిర్మాణానికి ఉపయోగపడదని తాను చెప్పానన్నారు. దీంతో పార్టీ సభ్యులు తనకు మధ్య విభేదాలు ఏర్పడినట్లుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. అంతే కానీ తాను పార్టీకి ద్రోహం చేసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీలో మార్పులు జరిగితే మళ్లీ వెళ్తారా అనే ప్రశ్నపై జంపన్న స్పందిస్తూ తనకు ఇక అంత ఓపిక లేదన్నారు. ఇప్పుడే చెప్పలేను... పోలీసులకు లొంగిపోయే వ్యవహారంలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సాయం చేసినట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా అలాంటిదేమి లేదని, తానే స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు వచ్చానని జంపన్న తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తారా అని అడగ్గా ప్రస్తుతం అలాంటిదేమీ లేదని, ఆ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జంపన్న వెల్లడించారు. -
మాపై ఎటువంటి ఒత్తిడి లేదు
సాక్షి, హైదరాబాద్: తాము లొంగిపోవడానికి సైద్ధాంతిక విభేదాలే కారణమని మావోయిస్టు నేత జంపన్న తెలిపారు. తమ లొంగుబాటు వెనుక ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ఉద్యమంలో ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీ లైన్ ప్రకారం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశామని చెప్పారు. పీపుల్స్‌వార్, మావోయిస్టుల లైన్ ఆ పరిస్థితుల్లో సరైందేనని.. గత 15 ఏళ్లలో దేశంలో అనేక సామాజిక మార్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధ భూస్వామ్య పద్ధతి సరికాదని.. ఇప్పుడు భూస్వాములు లేరు, ఇప్పుడా భూస్వామ్య వ్యవస్థ కూడా లేదన్నారు. ప్రజలతో కలిసి పనిచేయడంలో మావోయిస్టు పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, కాలానికి అనుగుణంగా మారలేకపోయిందని అభిప్రాయపడ్డారు. తనకున్న అభిప్రాయాలపై కమిటీతో నిర్దిష్టంగా చర్చించలేకపోయానని, అందుకే కేంద్ర కమిటీకి లేఖ రాసి బయటకు వచ్చానని వెల్లడించారు. తన ఆలోచనకు అనుగుణంగా పార్టీని మార్చడం సాధ్యం కాదని తెలుసుకుని, సాధారణ జీవితం గడపటానికి బయటకు వచ్చానని చెప్పారు. జంపన్న భార్య రజిత వరంగల్ గ్రామీణం జిల్లా వాసి అని, 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. జంపన్నపై రూ. 25 లక్షలు, రజితపై రూ.5 లక్షలు రివార్డు ఉందని.. ఈ మొత్తాన్ని వీరిద్దరికీ ఇచ్చేస్తామన్నారు. జంపన్న, రజిత జనజీవన సవ్రంతిలో కలిసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. మాపై ఎటువంటి ఒత్తిడి లేదు -
సైద్ధాంతికంగా విభేదించి లొంగిపోయారు
-
మాపై ఎటువంటి ఒత్తిడి లేదు : జంపన్న
-
జంపన్న లొంగుబాటు!
తొర్రూరు/మహదేవపూర్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామానికి చెందిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. చెర్లపాలెంకు చెందిన జినుగు యశోదమ్మ, మల్లారెడ్డిల కుమారుడైన నర్సింహారెడ్డి 1977–78 వరకు చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్‌లోని మల్లెపల్లి వద్దనున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 1978–79లో టర్నర్ కోర్సు పూర్తి చేసి రెండేళ్లపాటు ప్రైవేటు కంపెనీలో అప్రెంటీస్ చేశాడు. 1984లో తన నాన్నమ్మ, స్నేహితుడు గోపాల్‌రెడ్డి మరణించినçప్పుడు పరామర్శ కోసం గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లిన నర్సింçహారెడ్డి 1985లో అప్పటి సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌లో చేరాడు. పార్టీలో జంపన్నగా దళసభ్యుడి స్థాయి నుంచి ఏరియా కమిటీ, జిల్లా, రాష్ట్ర కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతికి ముఖ్యఅనుచరుడిగా పేరున్న జంపన్న ఛత్తీస్‌గఢ్–ఒడిశా బార్డర్ కమిటీ కార్యదర్శిగా చాలా కాలం పనిచేశారు. అనేక ఎన్కౌంటర్లలో ప్రత్యక్షంగా పాల్గొని మృ త్యుంజయుడిగా బయటపడ్డాడు. 1999లో మహదేవపూర్ మండలంలోని అన్నారం అడవుల్లో మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యలో కీలకపాత్ర పోషించాడు. ఎంసీసీ– పీపుల్స్‌వార్ విలీనం సందర్భంగా జరిగిన చర్చల్లో కీలకపాత్ర పోషించిన జంపన్న.. ఆధిపత్య పోరులో అలసిపోయి వరంగల్ జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ నాయకుడి ద్వారా జంపన్న దంపతులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. జంపన్న తలపై రూ.24 లక్షల రివార్డు ఉండగా, వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన ఆయన భార్య హింగే రజితపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కొడుకును చూసి మరణించాలనే.. ఉద్వేగానికిలోనైన జంపన్న తల్లి యశోదమ్మ కాజీపేట: ఎన్నో ఏళ్లుగా కొడుకును చూసి మరణించాలనే తన ఆకాంక్షను భగవంతుడు ఇన్నాళ్లకు కరుణించడం ఆనందంగా ఉందంటూ మావోయిస్టు అగ్రనేత జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న తల్లి యశోదమ్మ ఉద్వేగానికి గురయ్యారు. ఆయన హైదరాబాద్‌లో పోలీసులకు లొంగిపోయినట్లు తెలియడంతో వరంగల్ నగరం కాజీపేటలోని సహృదయ వృద్ధాశ్రమంలో కొన్నేళ్లుగా ఆశ్రయం పొందుతున్న జంపన్న తల్లి యశోదమ్మను శనివారం ‘సాక్షి’పలకరించింది. జంపన్న లొంగుబాటు విషయాన్ని ప్రస్తావించడంతో ఆనందభాష్పాలు రాల్చారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి వస్తాడని ఆశిస్తే ఉద్యమబాట పట్టిన నర్సన్నను చూడాలని ఎంతోకాలంగా కంటిపై రెప్ప వేయకుండా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇంత కాలానికి అడవితల్లి కరుణించి నా కొడుకును చూసే భాగ్యం కల్పించిందంటూ కనిపించిన వారికందరికీ దండాలు పెడుతున్నారు. మావోయిస్ట్ అగ్రనేత జంపన్న లొంగుబాటు -
మావోయిస్ట్ అగ్రనేత జంపన్న లొంగుబాటు
-
త్రుటిలో తప్పించుకున్న జంపన్న
ఒడిశా: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు జంపన్న(జింగు నర్సింహా రెడ్డి) కొద్దిలో తప్పించుకున్నాడు. ఒడిశా కలహండి జిల్లాలోని రిజర్వు ఫారెస్టులో పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా జంపన్న త్రుటిలో తప్పించుకున్నట్లు ఐజీ యశ్వంత్కుమార మెహతా తెలిపారు. నర్సింహారెడ్డితోపాటు కీలక సభ్యులు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు గత రాత్రి కూంబింగ్ ముమ్మరం చేశారు. జంపన్నపై రూ.25లక్షల రివార్డు ఉంది. -
నానమ్మకు మేమున్నాం..: జంపన్న అన్న కొడుకు నవీన్‌రెడ్డి
బూర్గంపాడు: ‘రారా నాయ నా దండం పెడతా..’ అంటూ మావోయిస్టు నేత జంపన్న తల్లి యశోదమ్మ చేసుకున్న వేడుకోలుకు ఆమె మనవడు స్పందించాడు. సోమవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని చూసి సారపాకకు చెం దిన జినుగ నవీన్‌రెడ్డి (జంపన్న అన్న వెంకటరెడ్డి కుమారుడు) స్పందించారు. సోమవారం రాత్రి తన తల్లి కళావతితో కలసి ‘సాక్షి’తో మాట్లాడాడు. ‘వృద్ధాప్యంలో ఉన్న మా నానమ్మను చూసుకునేందుకు నేనున్నా. సారపాకలోని ఐటీసీలో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్నాను. మానాన్న కొంతకాలం క్రితం చనిపోయారు.ఏడాది క్రితం మా నానమ్మ నా పెళ్లికి వచ్చింది. ఇక్కడ ఉండమని ఎంత బతిమాలినా వినలేదు. ఆ తర్వాత కనిపించలేదు. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనాన్ని చూశాక మా నానమ్మ ఆచూకీ తెలిసింది. మా నానమ్మ మంచి చెడులు చూసుకునేందుకు నేను, మా అమ్మ ఉన్నాం.’ అని అన్నాడు. -
అక్కపై అలిగి సెల్ టవర్ ఎక్కాడు....
ఖమ్మం : అవసరానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదంటూ అక్క మీద అలిగిన ఓ తమ్ముడు సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. అయితే పోలీసులు నచ్చచెప్పటంతో ఎట్టకేలకు దిగి వచ్చాడు. ఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం ఖమ్మం జిల్లా టేకులపల్లి సమీపంలోని బీ-కాలనీకి చెందిన తేజావత్ జంపన్న ముత్యాలంపాడు పంచాయతీ తావుర్య తండాలో ఉంటున్న తన సోదరి బుల్లి వద్దకు వచ్చాడు. తనకు ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించటంతో మరుసటి రోజు కూడా మరోసారి అడిగాడు. అయితే బుల్లి ససేమిరా అనటంతో అలిగిన జంపన్య ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి గట్టిగా అరవసాగాడు. పై నుంచి కిందకు దూకుతానంటూ బెదిరించాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దాంతో ఎస్ఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని, జంపన్స సోదరిని పిలిపించారు. ఆ తరువతా పోలీసులు, సోదరి నచ్చచెప్పటంతో అతగాడు కిందకు దిగి వచ్చాడు.