
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముప్పై మూడేళ్ల కింద అడవి బాట పట్టిన కొడుకు జంపన్న.. ఎవరూ లేక వృద్ధాశ్రమంలో ఉన్న తల్లి యశోదమ్మ.. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నవారు తీవ్ర ఉద్వేగంలో మునిగిపోయారు. ఇన్నేళ్ల తర్వాత తన తల్లిని చూసిన జంపన్నకు మాటలు పెగలలేదు. తొంభై ఏళ్ల వయోభారంతో ఉన్న యశోదమ్మ కన్నీరుపెడుతూ ‘బాగున్నవా కొడుకా..’అంటుంటే.. ఆయన కూడా కన్నీరు ఆపుకోలేకపోయారు.
అన్నం తినిపించిన జంపన్నసోమవారం హైదరాబాద్‌లో డీజీపీ సమక్షంలో లొంగిపోయిన జంపన్న, రజిత.. రాత్రి 8.30 గంటల సమయంలో కాజీపేటలో ఉన్న సహృదయ అనాథాశ్రమానికి వచ్చి యశోదమ్మను కలిశారు. జంపన్నను చూసిన ఆమె.. ‘నా కొడుకా జంపయ్య.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ నా కొడుకా.. ఈడనే ఉంటాన్న కొడుకా..’అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆగకుండా ఏడుస్తూనే కొడుకు, కోడలు యోగక్షేమాలు అడిగింది. ఇన్నాళ్లుగా తాను అనుభవించిన పరిస్థితులను చెప్పుకొంది. తల్లిని చూసి మాటలుపెగలక నాలుగైదు నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయిన జంపన్న కూడా తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ‘అమ్మా.. నేను మంచిగనే ఉన్నా. ఇదిగో నీ కోడలు..’అంటూ భార్య రజితను చూపించారు. ఇప్పుడైనా వారసుడిని కనివ్వాలని యశోదమ్మ వారిని కోరింది. అనంతరం జంపన్న తల్లికి అన్నం కలిపి తినిపించారు.
మా అమ్మలాంటి వారు ఎందరో..: జంపన్న
తల్లి యశోదమ్మను కలసిన అనంతరం జంపన్న మీడియాతో మాట్లాడారు. ‘‘సమాజంలో అందరిలానే మా అమ్మపై నాకు ప్రేమ ఎక్కువ. మా అమ్మలాంటివారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. వారికోసమే మావోయిస్టు పార్టీలో పనిచేశాను. వేలాది మంది కామ్రేడ్లు కుటుంబాలను త్యాగం చేసి పోరాటం చేస్తున్నారు. వారి కుటుంబాలు, తల్లిదండ్రులు కనీస సౌకర్యాలు లేని దుస్థితిలో ఉండిపోతున్నారు. వారితో పోల్చితే మా అమ్మకు ఈ ఆశ్రమంలో కనీస సౌకర్యాలైనా ఉన్నాయి. నేను కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి.. మా అమ్మకు సంబంధించి విషయాలు మీడియాలో వస్తున్నాయి, నాకు తెలుస్తున్నాయి. అమ్మ ఆశ్రమంలో ఉన్న విషయం నాకు నాలుగు నెలల క్రితం తెలిసింది. ఆమె పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను. మావోయిస్టు పార్టీ, ప్రజలే నా తల్లిగా భావించి ఒక లక్ష్యం కోసం పనిచేశాను..’’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment