peoples war party
-
Gaddar Demise: 'అగ్గి గళం' ఆగిపోయింది
వాగ్గేయకారుడా.. కన్నీటి వందనం గోసి గొంగడి పాట కాలి గజ్జెల మోత చేత ఎర్రజెండా పిక్కటిల్లే రేల గొంతుక.. గద్దర్ వసంతకాల మేఘ గర్జన కదనుతొక్కే ప్రజావాహిక జన కేతన.. నవ చేతన.. గద్దర్ పల్లవొక తూటా చరణమొక ఫిరంగి వేదిక పై వాగ్గేయకారుడు పెత్తందార్ల వెన్నులో చలి.. గద్దర్ తెలంగాణ సింగడి దండకారణ్య పచ్చనాకు బొగ్గుబావి దీపం రైతుకూలీ కొడవలి.. గద్దర్ పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం శ్రమజీవి పాదంపై చెరగని పుట్టుమచ్చ అతడు చరిత్ర.. జనగళ యుద్ధనౌక.. గద్దర్ ఈ నేల మళ్లీ కనలేని పాట గద్దర్. మన పాల్ రాబ్సన్. మన విక్టర్ జారా. మన బాబ్ మార్లీ. ఒకే ఒక్కడు గద్దర్. నోరులేని పేదలకు గొంతునిచ్చినవాడా మహా కవీ... అమర గాయకుడా.. నీకు వీడ్కోలు... రేల పూల మాల. సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: తన పాటలతో ప్రజా బాహుళ్యాన్ని ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గత నెల 20న గుండె పోటుతో అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాలు మూసుకుపోయినట్టు నిర్ధారించిన వైద్యులు ఈ నెల 3న శస్త్రచికిత్స చేసి సరిచేశారు. కానీ ముందు నుంచే మూత్ర పిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ‘ఆదివారం ఉదయం అకస్మాత్తుగా రక్తపోటు పెరిగింది. షుగర్ లెవల్స్ పడిపోయాయి. మధ్యాహ్నానికల్లా శరీరంలోని పలు అవయవాలు పనిచేయడం ఆగిపోయాయి. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు..’’అని ఆస్పత్రి అధికారులు హెల్త్ బులెటెన్‌లో వెల్లడించారు. అభిమానుల కోసం ఎల్బీ స్టేడియానికి.. గద్దర్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సాయంత్రం 5 గంటల సమయంలో ఎల్బీ స్టేడియానికి తరలించారు. పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ప్రజా గాయకురాలు విమలక్క తదితరులు నివాళి అర్పించి గద్దర్ సతీమణిని ఓదార్చారు. జోహార్ గద్దర్, అమర్ రహే గద్దరన్న అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఎల్బీస్టేడియం హోరెత్తింది. నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు గద్దర్ భౌతికకాయానికి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తొలుత సోమవారం ఉదయం గద్దర్ భౌతికదేహాన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద కొద్దిసేపు ఉంచి నివాళులు అర్పించనున్నారు. తర్వాత నెక్లెస్‌రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ వెంకటాపూర్ భూదేవీనగర్లోని ఆయన స్వగహానికి తరలించనున్నారు. అక్కడ స్థానికుల సందర్శనార్థం కాసేపు ఉంచి.. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుర్రకథలతో చైతన్య పరుస్తూ.. ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన లక్ష్మమ్మ, శేషయ్య దళిత దంపతులకు 1949లో గద్దర్ జన్మించారు. అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. సొంత ఊరిలోనే ఏడోతరగతి వరకు చదివిన ఆయన.. తర్వాత నిజామాబాద్ జిల్లా బోధన్‌లో, వరంగల్‌లో పైచదువులు కొనసాగగా.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. గ్రామంలో ఉన్నప్పుడే ఒగ్గుకథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథలు, భాగవత రూపంలో రైతులు, కార్మిక లోకాన్ని చైతన్య పరిచారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి బుర్రకథల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకుడు బి.నర్సింగరావు భగత్‌సింగ్ జయంతి రోజున గద్దర్‌తో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తర్వాత ప్రతి ఆదివారం గద్దర్ తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో నర్సింగరావు ప్రోత్సాహంతో గద్దర్ తన మొదటి పాట ’ఆపరా రిక్షా’రాశాడు. గదర్ అంటే విప్లవం సిక్కు కూలీలు, పనివాళ్లు పెట్టుకున్న పార్టీ పేరు గదర్.. గదర్ అంటే విప్లవం అని అర్థం. దీని నుంచి స్ఫూర్తి పొంది ఆయన రాసిన పాటల మొదటి ఆల్బంకు గదర్ అని పెట్టారు. ఇది ప్రజల్లోకి వెళ్లి ఆయన గద్దర్‌గా నిలిచిపోయారు. 1975లో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన నక్సల్ మార్గం పట్టారు. 1982లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఉద్యమ బాట పట్టారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్య మండలిలో చేరారు. ఒగ్గు కథలు, బుర్ర కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రజా సమస్యలపై పాటల రూపంలో కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. గోచీ,గొంగళి..చేతి కర్ర,ఎర్ర జెండా.. గద్దర్ పాటకు ఎంత ప్రాచుర్యం ఉందో, ఆయన ఆహార్యానికీ అంతే ప్రాముఖ్యత ఉంది. ఒంటిపై చొక్కా లేకుండా గొంగళి కప్పుకుని, ఎర్ర జెండా చుట్టిన కర్రతో, కాళ్లకు గజ్జెలు కట్టి గద్దర్ స్టేజీపై ఆడి, పాడుతుంటే లక్షలాది మంది కళ్లు, చెవులు అప్పగించేసేవారు. జీరబోయిన గొంతుతో పాటకట్టే విధానానికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. మావోయిస్టు ఉద్యమానికి దూరమైన తర్వాత గద్దర్ వేషధారణ సైతం మారింది. పలుమార్లు ప్యాంట్, షర్ట్, కోట్లోనూ కనిపించారు. 70 ఏళ్ల వయసులో.. ఓటర్‌గా నమోదై.. నక్సల్, మావోయిస్టు ఉద్యమ పంథాలో నడిచిన గద్దర్.. బూర్జువా పార్టీల, ఎన్నికల వ్యవస్థలో పాలుపంచుకోబోనంటూ ఓటర్‌గా కూడా నమోదు చేసుకోలేదు. మావోయిస్టుల నుంచి దూరమైన తర్వాత 2018లో తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకుని.. ఆ ఏడాది డిసెంబర్ 7న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేశారు. ‘‘పోరాటం అంటే తుపాకుల పట్టుకోవడం కాదు.. తిరుగుబాటు చేయడం అని గుర్తించి ప్రజా జీవితంలోకి వచ్చా. రాజ్యంగమే మనకు రక్ష అన్న విషయాన్ని తెలుసుకుని మొదటిసారి ఓటు హక్కును తీసుకున్నా.. 70 ఏళ్లు నిండాక తొలిసారి ఓటు వేశా. ఓట్ల యుద్ధానికి సిద్ధమయ్యే క్రమంలో గోచీ, గొంగడి, గజ్జెలు జమ్మిచెట్టు మీద పెట్టిన..’’ అని ఆ సమయంలో గద్దర్ ప్రకటించారు. ► తర్వాత ఆయన ‘గద్దర్ ప్రజాపార్టీ’ పేరిట ఒక రాజకీయ పార్టీని కూడా స్ధాపించారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా ఉద్యమాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. మావోయిస్టులు కూడా తమ వ్యూహాన్ని మార్చుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహాబోధి విద్యాలయ ఏర్పాటు అల్వాల్: స్థిరమైన జీవితం లేదని చాలాచోట్ల వలస కార్మికుల పిల్లలను బడిలో చేర్చుకునేవారు కాదు. దీంతో గద్దర్ అందరికీ విద్య అందించాలన్న సంకల్పంతో భూదేవినగర్‌లో మహాబోధి విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సతీమణి విమల, కూతురు వెన్నెల ఈ పాఠశాల బాధ్యతలు చూసుకుంటున్నారు. ‘బండెనక బండి కట్టి’తో వెండితెరపైకి.. గద్దర్‌కు రెండు నంది అవార్డులు ప్రజాగాయకుడు గద్దర్ సినిమా రంగంపైనా తనదైన ముద్ర వేశారు. సాయిచంద్ హీరోగా గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘మా భూమి’(1979) సినిమాలో తొలిసారి వెండితెరపై పాట పాడటంతోపాటు నటించారాయన. ఈ సినిమాలో ‘బండెనక బండి కట్టి..’ అనే పాటలో గద్దర్ కనిపిస్తారు. ఆ తర్వాత బి.నర్సింగరావు నటించి, దర్శకత్వం వహించిన ‘రంగుల కల’(1983) చిత్రంలో ఓ ప్రధానపాత్ర పోషించారు. జగపతిబాబు హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’(2011) మూవీలో కీలకపాత్రలో నటించారాయన. ఆర్.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దండకారణ్యం’(2016), సుడిగాలి సుదీర్ నటించిన ‘సాఫ్ట్వేర్ సుదీర్’(2019), చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన ‘గాడ్ ఫాదర్’(2022) సినిమాల్లోనూ నటించారు. ఆర్.నారాయణమూర్తి హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘ఒరేయ్ రిక్షా’ సినిమాలో గద్దర్ పాటరాయగా, ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరపరిచి, గానం చేసిన ‘మల్లెతీగకు పందిరి వోలే..’ పాట అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపే పాటల్లో ఒకటిగా నిలిచింది. ‘జై బోలో తెలంగాణ’ మూవీ కోసం గద్దర్ రాసిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..’ పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు పాటలకు నంది అవార్డులు(రచయిత, గాయకుడుగా) గద్దర్‌కు వచ్చాయి. విప్లవ ఉద్యమంలో ఉన్నవారు అవార్డులు, రివార్డులు తీసుకోకూడదనే నిబంధన ఉండటంతో నంది అవార్డులు తీసుకోలేదని గద్దర్ ఓ సందర్భంలో చెప్పారు. ఇటీవల విడుదలైన ఆర్.నారాయణమూర్తి ‘యూనివర్సిటీ’ చిత్రంలోనూ ఆయన పాటలు రాశారు. ఇవే కాదు, ఆయన రాసిన మరికొన్ని పాటలు సినిమాల్లో ప్రేక్షకులను అలరించాయి. ‘నేను రాసిన వేల వేల పాటలకు నా భార్య విమలే స్ఫూర్తి అని గద్దర్ గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి తన పాటలంటే ఎంతో ఇష్టమని, ఆయనపై వ్యతిరేకంగా పాడినా మెచ్చుకునేవారని 2017 జూన్‌లో ‘మెజార్టీకే రాజ్యాధికారం’అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు కడప వచ్చిన సందర్భంలో గద్దర్ అన్నారు. గద్దర్ నటించిన చివరిచిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. సత్యారెడ్డి లీడ్ రోల్లో నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీలో గద్దర్ కీలక పాత్ర పోషించడంతో పాటు పాటలు రాశారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కుటుంబమంటే ఎంతో మమకారం బ్యాంకులో ఉద్యోగం చేస్తు న్న సమయంలోనే గద్దర్ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు విమల. వీరికి ముగ్గురు పిల్లలు. సూర్యకిరణ్, చంద్రకిరణ్ (2003లో అనారోగ్యంతో మరణించారు), కూతురు వెన్నెల. గద్దర్‌కు సరస్వతిబాయి, శాంతాబాయి, బాలమణిబాయి అని ముగ్గురు అక్కలు. నర్సింగ్‌రావు అనే అన్న ఉన్నారు. గద్దర్‌కు కుటుంబమంటే ఎంతో ప్రాణం. భార్య విమల సహకారాన్ని తరచూ గుర్తు చేసుకునేవారు. తాను ఉద్యమంలో ఉన్నప్పుడు కుటుంబానికి, తనకు ఆమె అండగా ఉన్న తీరును చెప్పేవారు. ఆ పాటలు అగ్ని కణాలు.. అమ్మ కష్టం మొదలు సమాజంలో అనేక విషయాలపై పాటలు రాసిన గద్దర్.. రచయితగా తాను రాసిన అనేక పాటలకు అప్పటికప్పుడు పల్లవులు కట్టేవారు. తొలినాళ్లలో కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి సామాజిక విషయాలపై బుర్ర కథల ద్వారా అవగాహన కల్పించేవారు. తర్వాత స్వయంగా పాటలు రాశారు. 1970వ దశకంలో ఉద్యమానికి బాసటగా నిలిచిన జననాట్యమండలితో కలసి గద్దర్ సామాజికంగా దోపిడీకి గురైన వర్గాలకు గొంతుకగా మారారు. ‘పోదమురో జనసేనతో కలిసి, పోదమురో ఎర్రసేనతో కలిసి..’ అని గద్దర్ రాసి, పాడిన పాట అసంతృప్తితో మండుతున్న యువత నక్సల్ ఉద్యమంలో చేరి తుపాకులు పట్టేలా చేసింది. 1990 ఫిబ్రవరి 18న జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు ఏకంగా 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. విప్లవానికి ఊపిరినిచ్చి.. ఉద్యమానికి ఊపు తెచ్చి.. గద్దర్ పాట అంటేనే ఒక ఉప్పెన.. మొదట్లో బుర్రకథలతో ప్రజలు చైతన్యాన్ని కలిగించినా, నక్సలైట్ల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చినా.. ఆయన గొంతు సైరన్ మోగించేది. దొరలు, పాలకుల దౌర్జన్యాన్ని ఎదిరించడం నేర్పి వేలాది మంది యువత తుపాకులు చేతపట్టేలా చేసింది. శ్రీకాకుళం సీతంపేట నుండి మొదలైన తిరుగుబాటు పాట జగిత్యాల జైత్రయాత్ర, కల్లోల కరీంనగర్ వరకు సాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ పాట ప్రాణం పోసింది. ‘అమ్మ తెలంగాణమా.. ఆకలి కేకల రాజ్యామా..’అంటూ ఆయన రాసి, పాడిన పాట.. ధూంధాం కార్యక్రమాలు ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపాయి. ప్రతి పల్లె కళాకారుడు గద్దర్ స్ఫూర్తిగా గోచీ, గొంగళి కట్టి నృత్యం చేశారు. ఉద్యమాల్లో అమరులైన వారి కోసం ఏర్పడ్డ బంధుమిత్రుల కమిటీలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇదికాదంటూ.. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమాన్ని చేపడతానని ప్రకటించారు. వివిధ పార్టీల నేతలనూ కలిశారు. ఓరుగల్లు నుంచి పొలికేక సాక్షిప్రతినిధి, వరంగల్: పీపుల్స్‌వార్ పార్టీపై 1990లో ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. అప్పటివరకు అజ్ఞాతంలో ఉన్న పీపుల్స్‌వార్ నేతలు, లీగల్ కార్యకర్తలు, జననాట్యమండలి, అనుబంధ సంఘాల నాయకులు జనజీవనంలోకి అడుగుపెట్టారు. ఇదే సమయంలో 1990 మే 5, 6 తేదీల్లో వరంగల్ వేదికగా రాష్ట్ర రైతుకూలీ సంఘం మహాసభలు నిర్వహించారు. జననాట్యమండలి నాయకుడు గద్దర్, ఆయన బృందం ప్రకాష్ రెడ్డిపేట ఏరియాలో ఏర్పాటు చేసిన సభావేదికపైన ప్రత్యక్షమైంది. పదిలక్షలకుపైగా జనం హాజరైన ఈ సభలో గద్దర్ బృందం ఆటాపాటా ఉర్రూతలూగించాయి. ‘ధీరులారా శూరులారా.. రాడికల్ శూరులారా.. మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు..’, ‘జై బోలోరే జై బోలో.. అమర వీరులకు జై బోలో.. వీరులకేమో జై బోలో.. ఆహా శూరులకేమో జై బోలో..’అంటూ పాడిన పాటలు ఇప్పటికీ అందరి నోట్లో వినిపిస్తాయి. గద్దర్ ప్రస్థానంలో ఓరుగల్లు మహాసభ చిరస్థాయిగా నిలిచింది. ఎన్కౌంటర్ నుంచి తప్పించిన కానిస్టేబుల్ నక్సల్స్‌పై తీవ్ర అణచివేత కొనసాగుతున్న 1988–90 మధ్య కాలంలో గద్దర్ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఓసారి గద్దర్, ఇతర మావోయిస్టులు ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు సమాచారం అందింది. పెద్ద సంఖ్యలో పోలీసులు దాడి చేసి గాలించారు. ఆ సమయంలో గద్దర్ ఓ ఇంటి అటకపై దాక్కున్నారు. ఒక కానిస్టేబుల్ అటకపై గద్దర్‌ను చూసినా.. ఎవరూ లేరని అబద్ధం చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. లేకుంటే గద్దర్ ఆరోజే ఎన్కౌంటర్ అయ్యేవారు, ఆనాడు కాపాడిన కానిస్టేబుల్ దళితుడని తర్వాత గద్దర్ వెల్లడించారు. బతికుంటే.. మళ్లీ వస్తా సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రజాయుద్ధనౌక గద్దర్‌కు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చివరిసారిగా ఏప్రిల్ 30న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాల ముగింపు సభలో పాల్గొన్నారు. ఈ సభలో గద్దర్ పాట పాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘అచ్చంపేటలో నాలుగు ప్రాణాలు పోయినప్పుడు ఇక్కడికి వచ్చాను. మొదటి తుపాకీ తూట నా గుండెను తాకినప్పుడు.. నెత్తురు కోసం రూ.100 కావాలని నా భార్య పైసలు అడుక్కుంది. మళ్లీ బతికి ఈ ఊరికి వచ్చిన. చివరి ఊపిరి వరకు మీ కోసం పాటుపడతా. పాలమూరుకు పేరు తేవాలి. ఈ నేల కోసం పోరాటం చేయాలి. బతికుంటే మళ్లీ వస్తాను.. మీ పాదాలకు వందనాలు’అంటూ పాట రూపంలో చెప్పారు. ఓయూ స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో 1975లో ట్రిపుల్ ఈ పూర్తి చేశారు. నగరంలోని మొజంజాహీ ఎస్సీ హాస్టల్లో ఉంటూ కాలేజీకి చెప్పులు లేకుండా వచ్చేవారని ప్రిన్సిపల్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. ఓ హోటల్లో 26 పైసలకు పార్ట్టైంపనిచేస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేశారన్నారు. జార్జిరెడ్డి హయాంలో అనేక ఉద్యమాలకు ఓయూ కేంద్రబిందువు అయ్యింది. వామపక్ష ఉద్యమభావజాల వ్యాప్తి కోసం ఇక్కడ జరిగిన అనేక సభలు, సమావేశాలలో జననాట్యమండలి తరపున గద్దర్ పాల్గొన్నారు. మలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో జరిగిన ప్రతి సభలో పాల్గొని తన ఆటపాటతో విద్యార్థులను ఉత్తేజపరిచేవారు. గద్దర్ జీవితంలో కీలక ఘట్టాలివీ... ► 1972లో బ్యాంకు ఉద్యోగం సాధించారు. ∙1975లో సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని కెనరా బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. ► 1975, అక్టోబర్ 9న విమలతో గద్దర్ వివాహం చేసుకున్నారు. ► 1973 నుంచి గద్దర్ పాటలు రాయడం ప్రారంభించారు. ► 1977లో బి. నరసింగరావు ‘మా భూమి’సినిమాలో గద్దర్ ‘బండెనక బండి గట్టి’అనే పాటను పాడారు. 1978లో గద్దర్ మొదటిసారిగా జననాట్యమండలి శిక్షణా తరగతులు నిర్వహించారు. 1980లలో గద్దర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి జననాట్యమండలి సభ్యునిగా పనిచేశారు. ► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు. ► 1995లో పీపుల్స్‌వార్ పార్టీ గద్దర్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. పీపుల్స్‌వార్‌పార్టీ బహిష్కరణ తర్వాత గద్దర్ కన్నీటి పర్యంతం అయ్యారు. తర్వాత పార్టీ తిరిగి ఆయనను ఆహ్వానించింది. ► 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ► 1998లో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా గద్దర్ ఎన్నుకోబడ్డారు. ► 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవరరావు లను తమ దూతలుగా పంపారు. ► 2010, అక్టోబర్ 9న తెలంగాణ ప్రజాఫ్రంట్ ఛైర్మన్‌గా గద్దర్ నియమితులయ్యారు. ► 2017లో గద్దర్ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. చేతిలో ఎర్రజెండా వదిలి..బుద్దుడి జెండా కట్టిన కర్రను చేతిలోకి తీసుకున్నట్టు ఆయన ఆ సందర్భంగా ప్రకటించారు. బతుకుదెరువు నిమిత్తం పాలమూరు నుంచి నగరానికి వలస వచ్చిన నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ భూదేవినగర్ రైల్వే ట్రాక్ పక్కన వారికి ఆశ్రయం కల్పించి గద్దర్ అండగా నిలిచారు. వందలాది కుటుంబాలు ఆయన నీడలో జీవనం సాగిస్తున్నాయి. గద్దర్ మరణంతో మాకు దిక్కెవరంటూ భూదేవినగర్వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు. – అల్వాల్ -
మావోయిస్టు పార్టీకి 15 ఏళ్లు
పెద్దపల్లి: పీపుల్స్‌వార్ పార్టీ, బిహార్‌కు చెందిన కమ్యూనిస్టు సెంటర్ మావోయిస్టు (ఎంసీసీ) పార్టీలు విలీనమై సెప్టెంబర్ 21కి 15 ఏళ్లు నిండనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్ పార్టీగా కొండపల్లి సీతరామయ్య నాయకత్వంలో అవతరించిన ఆ పార్టీ 2004, సెప్టెంబర్ 21న బిహార్ ఎంసీసీని తనలో విలీనం చేసుకొని మావోయిస్టు పార్టీగా అవతరించింది. 1979లో జగిత్యాల జైత్రయాత్ర అనంతరం మావోయిస్టు పార్టీని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, చత్తీశ్గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరిస్తూ వివిధ రాష్ట్రాలకు పాకింది. అప్పటికే బీహర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పీపుల్స్‌వార్ పేరిట నక్సలైట్ల కార్యకలపాలు కొనసాగుతుండగా కిషన్‌దా నాయకత్వంలోని ఎంసీసీ ఆ రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఎంసీసీ, పీపుల్స్‌వార్ పార్టీల మధ్య చర్చలు ముగిసి ఏకాభిప్రాయానికి రావడంపై ఎంసీసీని పీపుల్స్‌వార్‌లో కలుపుకుని మావోయిస్టు పార్టీగా ప్రకటించారు. సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2004లో శాంతి చర్చలను జరుపుకున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న సమయంలోనే నక్సల్స్ అగ్రనేతలు రామకృష్ణ, సుధాకర్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ పార్టీ ఇకపై మావోయిస్టు పార్టీగా కొనసాగుతుందని ప్రకటించారు. ఎంసీసీ కంటే ముందు బీహర్, బెంగాల్, శ్రీకాకుళంలలో పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సీపీఐఎంఎల్ పార్టీ యూనిటీ సైతం మావోయిస్టుపార్టీలో అప్పటికే విలీనమైనట్లు చర్చల సందర్భంగా రామకృష్ణ వెల్లడించారు. మొదటి దఫా శాంతి చర్చలు ముగిసిన అనంతరం మావోయిస్టులు తిరిగి అజ్ఞాతవాసం వెళ్లారు. శాంతిచర్చలకు సైతం 15ఏళ్లు నిండినట్లు చెప్పుకోవచ్చు. మావోయిస్టులపై సర్కార్ ముప్పేట దాడి.. పీపుల్స్‌వార్‌పార్టీగా కార్యకలాపాలు కొనసాగించిన సమయంలో కంటే మావోయిస్టు పార్టీగా ఏర్పాటైన తర్వాత ఏకంగా అన్ని రాష్ట్రాల నుంచి నిఘా వర్గాలు మావోయిస్టు పార్టీపై ఒత్తిడి పెంచాయి. జాతీయస్థాయిలో మావోయిస్టుల బలం పెరుగుతుందనే సాంకేతం బయటకు రావడంతో మావోయిస్టుల కట్టడికి అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రం సైతం బలగాలను రాష్ట్రాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగానే అప్పటివరకు తెలంగాణలో బలంగా ఉన్న పీపుల్స్‌వార్ పార్టీ (మావోయిస్టులు) కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ లాంటి జిల్లాలతోపాటు నల్లమలను సైతం మావోయిస్టులు కొల్పోయారు. అప్పటి నుంచే క్రమంగా పోలీసులు మావోయిస్టు పార్టీ అగ్రనేతల పై గురిపెట్టి ఒక్కొక్కరినీ ఎన్కౌంటర్లతో మట్టుబెట్టారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. మావోయిస్టు పార్టీ కార్యదర్శి రామకృష్ణ బదిలీ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన బుర్ర చిన్నన్న, శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి, నల్లమల్ల సాగర్, దేవేందర్ ఇలా వరుసగా రాష్ట్ర పార్టీ కార్యదర్శులంతా ఎన్కౌంటర్లలో హతమయ్యారు. క్రమంగా తెలంగాణ మైదాన ప్రాంతం నుంచి మావోయిస్టు పార్టీ ఉనికి దెబ్బతీశామని పోలీసు యంత్రాంగం భావిస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తలపెట్టిన ఆవిర్భావ వారోత్సవాలు తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో ప్రభావం ఉండదని, అటవీ ప్రాంతాల్లో మాత్రమే అంతంత మాత్రమే వారోత్సవాల నేపథ్యంలో కదలికలు ఉంటాయన్న అభిప్రాయంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. -
దళపతి కేశవరావు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నూతన ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న, 1992 నుంచి 25 ఏళ్లపాటు పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు నడిపించిన సీనియర్ మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అనారోగ్యం, వయోభారం దృష్ట్యా కేంద్ర కమిటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. పీపుల్స్‌వార్ గ్రూపులో ఉన్న అనేక పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి 2004 సెప్టెంబర్ 21న మావోయిస్టు పార్టీగా ఏర్పడగా నూతన పార్టీకి గణపతే నాయకత్వం వహించాలని అప్పటి పార్టీలన్నీ ప్రతిపాదించాయి. దీంతో గణపతి అప్పుడు కార్యదర్శిగా నియమితులయ్యారు. పీపుల్స్‌వార్ గ్రూప్ ద్వారా 14 రాష్ట్రాలను ప్రభావితం చేసిన మావోయిస్టు పార్టీకినాయకత్వ బాధ్యతలు వహించిన గణపతి.. ఉద్యమం నడపడంలో నిష్ణాతుడిగా పేరు సంపాదించారు. అన్ని రాష్ట్రాల కమిటీలను వ్యూహాత్మకంగా ముందుకు నడిపించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ 8 రాష్ట్రాల్లోనే కార్యకలాపాలు సాగిస్తుండటం, కార్యకలాపాలు సైతం ఆశించినట్లుగా లేకపోవడంతో పార్టీ కుదేలైనట్లు పోలీసు వర్గాలు ప్రకటిస్తూ వచ్చాయి. మరోవైపు గణపతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం పార్టీని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతూ వచ్చింది. దీంతో స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని ఇటీవల జరిగిన కేంద్ర కమిటీ ఐదో సమావేశంలో గణపతి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో కేశవరావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ బాధ్యతలను కేశవరావు పర్యవేక్షించనున్నారు. మావోయిస్టు పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను కేశవరావు పరిష్కరిస్తారని కమిటీ ఆశిస్తోంది. అదే సమయంలో పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా కొత్త నియామకాలపై ఆయన దృష్టి పెడతారా అనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరీ కేశవరావు? గాగన్న అలియాస్ ప్రకాష్, అలియాస్ క్రిష్ణ, అలియాస్ విజయ్, అలియాస్ కేశవ్, అలియాస్ బస్వరాజు, అలియాస్ బీఆర్, అలియాస్ దారపు నరసింహారెడ్డి, అలియాస్ నరసింహ. మావోయుస్టు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావుకు ఉన్న వివిధ పేర్లు ఇవి.æ కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆయన అతిదగ్గర నుంచి చూశారు. విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగారు. సూరపనేని జనార్దన్ తర్వాతి తరంవాడైన కేశవరావు... వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కాలేజీలో 1974లో ఇంజనీరింగ్ చదివారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. కేశవరావుది మిలిటరీ వ్యూహరచనలో అందెవేసిన చేయి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలుళ్లకు సంబంధించిన అ«ధునాతన ప్రక్రియల ఆచరణలోనూ కేశవరావు నిపుణుడు. గెరిల్లా పోరాట వ్యూహకర్తగా, ఆయు«ధ శిక్షణలోనూ ఆయన సిద్ధహస్తుడు. మావోయుస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయుస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. అంతేకాకుండా జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోని మిలిటరీ సబ్కమిటీల బాధ్యత కూడా కేశవరావుదేనని పోలీసుల అంచనా. మావోయుస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆరు నెలల క్రితం నుంచే కేశవరావు మావోయిస్టు పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నప్పటికీ తాజాగా అధికారికంగా ఈ నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో, కేడర్ రిక్రూట్మెంట్లో కేశవరావు బాధ్యత కీలకమని తెలుస్తోంది. 1980లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒకే ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్టయ్యారు. ఆయన తండ్రి వాసుదేవరావు అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. మావోయుస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావేనని అంచనా. కేశవరావుపై కేంద్రం రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు పార్టీలో వ్యవస్థ ఇలా... 1. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి ప్రధాన కార్యదర్శి కేశవరావు బాధ్యుడిగా ఉంటారు. సెంట్రల్ కమిటీలో ప్రస్తుతం 19 మంది సభ్యులుంటే అందులో 13 మంది ఏపీ, తెలంగాణలకు చెందినవారే ఉన్నారు. 2. సెంట్రల్ కమిటీ కింద సెంట్రల్ మిలిటరీ కమిషన్, పోలిట్‌బ్యూరో ఉంటాయి. 3. మిలిటరీ కమిషన్‌కు ఇప్పటివరకు కేశవరావు బాధ్యత వహించారు. పోలిట్‌బ్యూరోకు సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి, మిలిటరీ కమిషన్‌కు సారథ్యం వహిస్తున్నవారు ఇద్దరూ కలసి బాధ్యత వహిస్తారు. (పోలిట్‌బ్యూరోలో మొత్తం 9 మంది సభ్యులుంటారు.) 4. ఈ మూడు విభాగాల కింద తూర్పు, మధ్య, ఉత్తర, దక్షిణ ప్రాంతాల పార్టీ రీజనల్ విభాగాలు, స్పెషల్ జోనల్ కమిటీలు, రీజనల్ కమిటీలు, డివిజనల్ కమిటీలు, ఏరియా కమిటీలు, స్థానిక గెరిల్లా దళాలతో కూడిన అంచెలంచెల వ్యవస్థ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. -
33 ఏళ్ల తర్వాత అమ్మ చెంతకు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముప్పై మూడేళ్ల కింద అడవి బాట పట్టిన కొడుకు జంపన్న.. ఎవరూ లేక వృద్ధాశ్రమంలో ఉన్న తల్లి యశోదమ్మ.. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నవారు తీవ్ర ఉద్వేగంలో మునిగిపోయారు. ఇన్నేళ్ల తర్వాత తన తల్లిని చూసిన జంపన్నకు మాటలు పెగలలేదు. తొంభై ఏళ్ల వయోభారంతో ఉన్న యశోదమ్మ కన్నీరుపెడుతూ ‘బాగున్నవా కొడుకా..’అంటుంటే.. ఆయన కూడా కన్నీరు ఆపుకోలేకపోయారు. అన్నం తినిపించిన జంపన్నసోమవారం హైదరాబాద్‌లో డీజీపీ సమక్షంలో లొంగిపోయిన జంపన్న, రజిత.. రాత్రి 8.30 గంటల సమయంలో కాజీపేటలో ఉన్న సహృదయ అనాథాశ్రమానికి వచ్చి యశోదమ్మను కలిశారు. జంపన్నను చూసిన ఆమె.. ‘నా కొడుకా జంపయ్య.. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ నా కొడుకా.. ఈడనే ఉంటాన్న కొడుకా..’అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆగకుండా ఏడుస్తూనే కొడుకు, కోడలు యోగక్షేమాలు అడిగింది. ఇన్నాళ్లుగా తాను అనుభవించిన పరిస్థితులను చెప్పుకొంది. తల్లిని చూసి మాటలుపెగలక నాలుగైదు నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయిన జంపన్న కూడా తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ‘అమ్మా.. నేను మంచిగనే ఉన్నా. ఇదిగో నీ కోడలు..’అంటూ భార్య రజితను చూపించారు. ఇప్పుడైనా వారసుడిని కనివ్వాలని యశోదమ్మ వారిని కోరింది. అనంతరం జంపన్న తల్లికి అన్నం కలిపి తినిపించారు. మా అమ్మలాంటి వారు ఎందరో..: జంపన్న తల్లి యశోదమ్మను కలసిన అనంతరం జంపన్న మీడియాతో మాట్లాడారు. ‘‘సమాజంలో అందరిలానే మా అమ్మపై నాకు ప్రేమ ఎక్కువ. మా అమ్మలాంటివారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. వారికోసమే మావోయిస్టు పార్టీలో పనిచేశాను. వేలాది మంది కామ్రేడ్లు కుటుంబాలను త్యాగం చేసి పోరాటం చేస్తున్నారు. వారి కుటుంబాలు, తల్లిదండ్రులు కనీస సౌకర్యాలు లేని దుస్థితిలో ఉండిపోతున్నారు. వారితో పోల్చితే మా అమ్మకు ఈ ఆశ్రమంలో కనీస సౌకర్యాలైనా ఉన్నాయి. నేను కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి.. మా అమ్మకు సంబంధించి విషయాలు మీడియాలో వస్తున్నాయి, నాకు తెలుస్తున్నాయి. అమ్మ ఆశ్రమంలో ఉన్న విషయం నాకు నాలుగు నెలల క్రితం తెలిసింది. ఆమె పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను. మావోయిస్టు పార్టీ, ప్రజలే నా తల్లిగా భావించి ఒక లక్ష్యం కోసం పనిచేశాను..’’అని చెప్పారు. -
అజ్ఞాతంలో 135 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన 135 మంది, ఏపీకి చెందిన 80 మంది మావోయిస్టు పార్టీలో ఉన్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఇతర కేడర్‌లో పనిచేస్తున్న వారంతా జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. సోమవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న లొంగుబాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. జంపన్నపై దేశవ్యాప్తంగా 100కుపైగా కేసులున్నాయని, అందులో తెలంగాణలో 51 కేసులున్నాయని చెప్పారు. జంపన్న ఆధ్వర్యంలో 1991 ఫిబ్రవరి 22న వాజేడు పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి 14 ఆయుధాలు అపహరించిన ఘటనలో కొందరు పోలీస్ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. 1991 జూన్ 15న ఏటూరు నాగారం పరిధిలోని చెల్పాకాలో పోలీస్ జీపును పేల్చేశారని, ఆ ఘటనలో సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై కిషోర్‌కుమార్, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారని చెప్పారు. భద్రాద్రి కొత్త గూడెం పరిధిలోని కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 17 మంది పోలీసులను హతమార్చారని, ఆయుధాలను ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. ఇక మావోయిస్టు పార్టీలో 13 ఏళ్లుగా పనిచేస్తున్న అనిత అలియాస్ రజిత భర్త జంపన్నతో కలసి లొంగిపోయినట్టు డీజీపీ వెల్లడించారు. జంపన్నపై ఉన్న రూ.25 లక్షలు, రజితపై ఉన్న రూ.5 లక్షల రివార్డును ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామన్నారు. అజ్ఞాతంలోనే వివాహం.. జంపన్న భార్య హింగె అనిత అలియాస్ రజిత స్వస్థలం వరంగల్ జిల్లా దామెర. ఆమె హన్మకొండలోని ఆదర్శ కాలేజీలో ఇంటర్, వడ్డెపల్లిలోని డిగ్రీ కాలేజీలో బీఎస్సీ, ఉస్మానియా దూరవిద్యా కేంద్రం ద్వారా ఎమ్మెస్సీ చేశారు. 2004లో చిట్యాల లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ కమాండర్ రమాకాంత్ పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. జంపన్న నేతృత్వంలో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలోని ప్రెస్ టీమ్‌లో పనిచేశారు. 2006లో సెంట్రల్ రీజియన్ బ్యూరో ప్రెస్ టీమ్‌కు.. 2007లో ఏరియా కమిటీ సభ్యురాలిగా నియమి తులయ్యారు. 2009లో పార్టీ అనుమతి పొంది జంపన్న, రజిత వివాహం చేసుకున్నారు. 2012లో రజితను ఒడిశా రాష్ట్ర కమిటీకి బదిలీ చేశారు. 2014లో డివిజనల్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు.. జంపన్న అలియాస్ జినుగు నర్సింహారెడ్డి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం. 1979–80లో హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో చదువుతుండగా పీపుల్స్‌వార్‌కు చెందిన శాఖమూరి అప్పారావు, పులి అంజయ్య అలియాస్ సాగర్ల స్ఫూర్తితో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1984లో పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా చేరి.. ఏడాదిలోనే ఏటూరు నాగారం దళానికి కమాండర్‌గా నియమితులయ్యారు. 1991లో ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజన్ (ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్)లో సభ్యుడిగా నియమించారు. ఏడాది తిరిగేలోగా అదే కమిటీకి కార్యదర్శిగా ఎదిగారు. పార్టీ కేంద్ర నాయకత్వం 2000 సంవత్సరంలో జంపన్నకు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. 2003లో ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో జరిగిన 9వ ప్లీనరీలో స్పెషల్ జోనల్ కమిటీ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. భారీ స్థాయిలో మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించిన నేపథ్యంలో. జంపన్నను కేంద్ర మిలటరీ కమిషన్ సభ్యుడిగా నియమించారు. 2004లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం సెంట్రల్ రీజియన్ బ్యూరో సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్చార్జిగా, ఛత్తీస్‌గఢ్–ఆంధ్రా కమిటీ లీడ్ మెంబర్‌గా కొనసాగారు. కేంద్ర కమిటీలో 18 మంది మావోయిస్టు పార్టీలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కేంద్ర కమిటీలో ఇప్పటివరకు 19 మంది సభ్యులుండగా.. జంపన్న లొంగుబాటుతో వారి సంఖ్య 18కి తగ్గింది. వయోభారం, అనారోగ్య కారణాలు, సైద్ధాంతిక విభేదాలు, వ్యక్తిగత కారణాలతో నేతలు లొంగిపోతుండటం.. కాలక్రమేణా మావోయిస్టు పార్టీని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యులుగా ప్రశాంత్ బోస్, నంబాల కేశవరావు, మిసర్ బెస్రా, మల్లోజుల వేణుగోపాల్‌రావు, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, దేవ్‌కుమార్‌సింగ్, అక్కిరాజు హరగోపాల్, కడారి సత్యనారాయణరెడ్డి, వివేచ్ చందర్‌యాదవ్, రంజిత్ బోస్, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాద్‌రావు, రావుల శ్రీనివాస్, ఒగ్గు బురల్సత్యాజీ, మిలింద్ తేల్ముండే ఉన్నారు. -
సైద్ధాంతిక విభేదాలతోనే బయటకొచ్చా
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీతో సైద్ధాంతికపరమైన విభేదాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత జంపన్న అలియాస్ జినుగు నర్సింహారెడ్డి తెలిపారు. 33 ఏళ్లుగా పార్టీలో నిబద్ధత, నిజాయితీతో పనిచేసిన తాను భార్య అనిత అలియాస్ రజితతో సహా స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సోమవారం డీజీపీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. చర్చించే అవకాశం లేదు.. దేశంలో గత పదిహేనేళ్లలో విపరీతమైన మార్పులు వచ్చాయని, గతంలో ఉన్న ట్లుగా భూస్వామ్య వ్యవస్థ ఇప్పుడు లేదని జంపన్న అభిప్రాయపడ్డారు. కానీ కార్మిక, ఉద్యోగ, యువత, ప్రజల సమస్యలపై మావోయిస్టు పార్టీ పోరాట పం థాలో మార్పు రాలేదని, దీనిపై తాను కేంద్ర కమిటీ సభ్యుడిగా చర్చించే అవ కాశం లేకుండాపోయిందని జంపన్న తెలిపారు. అయితే ఈ అంశంపై తనను పార్టీలోనే ఉండి పార్టీ పనితీరు, పద్ధతిలో మార్పు తెచ్చేలాగా పోరాడాలని సహ చరులు చెప్పినా తాను వినలేదని, తన వల్ల ఆ మార్పు సాధ్యం కాదన్న అభి ప్రాయంతో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని బయటకు వచ్చానని వెల్లడించారు. పార్టీకి ద్రోహం చేసినట్లు కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం బయటకు వచ్చానని చెబుతూనే మావోయిస్టు పార్టీపై ఆరోపణలు చేయడంపై ప్రశ్నించగా తాను పార్టీని దూషించడంలేదని జంపన్న పేర్కొన్నారు. ఎప్పుడో ఏళ్ల కింద ఉన్న సిద్ధాంతాలు, పనితీరు ప్రక్రియే నేటికీ కొనసాగుతోందని, అది పార్టీ పునర్నిర్మాణానికి ఉపయోగపడదని తాను చెప్పానన్నారు. దీంతో పార్టీ సభ్యులు తనకు మధ్య విభేదాలు ఏర్పడినట్లుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. అంతే కానీ తాను పార్టీకి ద్రోహం చేసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీలో మార్పులు జరిగితే మళ్లీ వెళ్తారా అనే ప్రశ్నపై జంపన్న స్పందిస్తూ తనకు ఇక అంత ఓపిక లేదన్నారు. ఇప్పుడే చెప్పలేను... పోలీసులకు లొంగిపోయే వ్యవహారంలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సాయం చేసినట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా అలాంటిదేమి లేదని, తానే స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు వచ్చానని జంపన్న తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తారా అని అడగ్గా ప్రస్తుతం అలాంటిదేమీ లేదని, ఆ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జంపన్న వెల్లడించారు. -
జంపన్న లొంగుబాటు!
తొర్రూరు/మహదేవపూర్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామానికి చెందిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. చెర్లపాలెంకు చెందిన జినుగు యశోదమ్మ, మల్లారెడ్డిల కుమారుడైన నర్సింహారెడ్డి 1977–78 వరకు చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్‌లోని మల్లెపల్లి వద్దనున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 1978–79లో టర్నర్ కోర్సు పూర్తి చేసి రెండేళ్లపాటు ప్రైవేటు కంపెనీలో అప్రెంటీస్ చేశాడు. 1984లో తన నాన్నమ్మ, స్నేహితుడు గోపాల్‌రెడ్డి మరణించినçప్పుడు పరామర్శ కోసం గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లిన నర్సింçహారెడ్డి 1985లో అప్పటి సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌లో చేరాడు. పార్టీలో జంపన్నగా దళసభ్యుడి స్థాయి నుంచి ఏరియా కమిటీ, జిల్లా, రాష్ట్ర కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతికి ముఖ్యఅనుచరుడిగా పేరున్న జంపన్న ఛత్తీస్‌గఢ్–ఒడిశా బార్డర్ కమిటీ కార్యదర్శిగా చాలా కాలం పనిచేశారు. అనేక ఎన్కౌంటర్లలో ప్రత్యక్షంగా పాల్గొని మృ త్యుంజయుడిగా బయటపడ్డాడు. 1999లో మహదేవపూర్ మండలంలోని అన్నారం అడవుల్లో మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యలో కీలకపాత్ర పోషించాడు. ఎంసీసీ– పీపుల్స్‌వార్ విలీనం సందర్భంగా జరిగిన చర్చల్లో కీలకపాత్ర పోషించిన జంపన్న.. ఆధిపత్య పోరులో అలసిపోయి వరంగల్ జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ నాయకుడి ద్వారా జంపన్న దంపతులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. జంపన్న తలపై రూ.24 లక్షల రివార్డు ఉండగా, వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన ఆయన భార్య హింగే రజితపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కొడుకును చూసి మరణించాలనే.. ఉద్వేగానికిలోనైన జంపన్న తల్లి యశోదమ్మ కాజీపేట: ఎన్నో ఏళ్లుగా కొడుకును చూసి మరణించాలనే తన ఆకాంక్షను భగవంతుడు ఇన్నాళ్లకు కరుణించడం ఆనందంగా ఉందంటూ మావోయిస్టు అగ్రనేత జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న తల్లి యశోదమ్మ ఉద్వేగానికి గురయ్యారు. ఆయన హైదరాబాద్‌లో పోలీసులకు లొంగిపోయినట్లు తెలియడంతో వరంగల్ నగరం కాజీపేటలోని సహృదయ వృద్ధాశ్రమంలో కొన్నేళ్లుగా ఆశ్రయం పొందుతున్న జంపన్న తల్లి యశోదమ్మను శనివారం ‘సాక్షి’పలకరించింది. జంపన్న లొంగుబాటు విషయాన్ని ప్రస్తావించడంతో ఆనందభాష్పాలు రాల్చారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి వస్తాడని ఆశిస్తే ఉద్యమబాట పట్టిన నర్సన్నను చూడాలని ఎంతోకాలంగా కంటిపై రెప్ప వేయకుండా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇంత కాలానికి అడవితల్లి కరుణించి నా కొడుకును చూసే భాగ్యం కల్పించిందంటూ కనిపించిన వారికందరికీ దండాలు పెడుతున్నారు. మావోయిస్ట్ అగ్రనేత జంపన్న లొంగుబాటు -
మావోయిస్ట్ అగ్రనేత జంపన్న లొంగుబాటు
-
మావోయిస్టు పార్టీకి తొమ్మిదేళ్లు
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేసుకున్న పీపుల్స్‌వార్ పార్టీ.. మావోయిస్టు పార్టీగా అవతరించి శనివారంతో తొమ్మిదేళ్లు నిండుతున్నాయి. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, పీపుల్స్‌వార్ పార్టీ విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడిందని 2004 సెప్టెంబర్ 21న అప్పటి రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అంతకుముందు ఎంసీసీ, పీపుల్స్‌వార్ పార్టీ విలీనంపై 2004 జూన్ నుంచి సుమారు రెండు నెలలపాటు అబూజ్మడ్ కేంద్రంగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. రెండు పార్టీలకు చెందిన కిషన్‌దా, విజయ్‌దా, గణపతి, కిషన్‌జీ, ఆజాద్ తదితర కీలక నేతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రెండు పార్టీల మధ్య అభిప్రాయభేదాలను చర్చించిన అనంతరం సెప్టెంబర్ మొదటి వారంలో పీపుల్స్‌వార్‌లో ఎంసీసీ విలీనానికి సిద్ధమైంది. రాష్ట్రంలో శాంతిచర్చల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన నక్సలైట్లు రాజధాని వేదికగా పార్టీ కొత్త పేరును వెల్లడించారు. మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర బలగాలతో ముప్పేట దాడికి గురైంది. దేశంలో వివిధ రాష్ట్రాలకు, ప్రాంతాలకు విస్తరించిన మావోయిస్టు పార్టీ రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగైంది. 2010 నాటికి నల్లమల, ఉత్తర, దక్షిణ తెలంగాణలో దళాల కదలిక పూర్తిగా దెబ్బతిన్నది. మావోయిస్టు పార్టీని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో ఆ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా చూపింది. తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో నష్టపోయిన పార్టీ ఉత్తరాంధ్రలో ఏవోబీ, దండకారణ్య ప్రాంతాల్లోనే అడపాదడపా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న మావోయిస్టు పార్టీ ఈ నెల 21 నుంచి 28 వరకు ఆవిర్భావ వారోత్సవాలు జరుపడానికి సన్నద్ధమైంది. కుప్పకూలుతున్న కేంద్ర కమిటీ మావోయిస్టు పార్టీ హిమాచల్‌ప్రదేశ్, హర్యాన, ఉత్తరాంచల్, కర్నాటక లాంటి కొత్త ప్రాంతాలకు విస్తరించినప్పటికీ పార్టీ పురుడు పోసుకున్న ఆంధ్రప్రదే శ్లో మాత్రం కోలుకోలేని రీతిలో దెబ్బతింటోంది. రాష్ట్రం నుంచి కేంద్ర కమిటీలో ఉన్న 26 మందిలో 14మందిని కోల్పోయింది. ఇందులో ఆరుగురు ఎన్కౌంటర్లో మరణించగా, ఎనిమిది మంది విచారణ ఖై దీలుగా జైలు జీవితం గడుపుతున్నారు. కేంద్ర కమిటీలో ఉన్న 42మందిలో 18మంది నాయకులను పార్టీ నాయకత్వం నష్టపోయింది. కిషన్‌జీ, ఆజాద్ ఎన్కౌంటర్లతో పార్టీ జవసత్వాలపై పోలీసులు గట్టి దెబ్బతీశారు. దాదాపు ఈ ఇద్దరి స్థానాలు భర్తీ చేయడం అసాధ్యంగా భావిస్తున్నారు. తీవ్ర మైన నష్టాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ 2010 ఏప్రిల్ 6న దంతెవాడలో 76మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని హతమార్చగా, కోరాపూట్‌లో 11మందిని, మిద్నాపూర్‌లో 24మందిని, అహెరీలో 17మందిని, బీహార్‌లో 11మందిని హమార్చింది. సుకుమ జిల్లాలో కేంద్ర మాజీ మంత్రులను టార్గెట్ చేసి పై చేయి సాధించింది. ఇందులో ఇరువురు కేంద్ర మాజీ మంత్రులతో సహా 28మందిని హతమార్చిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైదాన ప్రాంతాల్లో పట్టుసాధించడం వల్ల మావోయిస్టు పార్టీ ముందుగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్‌లోనే. ఆ పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న గణపతి సహా మరికొంతమంది ముఖ్యులు తమ సొంతగడ్డ ఏపీని వదులుకోవద్దని పలుమార్లు పార్టీ సమావేశాల్లో తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. ఈనేపథ్యంలో మావోయిస్టు పార్టీ అవతరణ దినోత్సవాలు జరిపేందుకు పార్టీ సన్నద్ధంకావడంతో అక్కడక్కడ తిరిగి దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.