అజ్ఞాతంలో 135 మంది | 135 maoists in Telngana says DGP | Sakshi
Sakshi News home page

అజ్ఞాతంలో 135 మంది

Published Tue, Dec 26 2017 1:33 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM

135 maoists in Telngana says DGP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన 135 మంది, ఏపీకి చెందిన 80 మంది మావోయిస్టు పార్టీలో ఉన్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఇతర కేడర్‌లో పనిచేస్తున్న వారంతా జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. సోమవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న లొంగుబాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. జంపన్నపై దేశవ్యాప్తంగా 100కుపైగా కేసులున్నాయని, అందులో తెలంగాణలో 51 కేసులున్నాయని చెప్పారు. జంపన్న ఆధ్వర్యంలో 1991 ఫిబ్రవరి 22న వాజేడు పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి 14 ఆయుధాలు అపహరించిన ఘటనలో కొందరు పోలీస్‌ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. 1991 జూన్‌ 15న ఏటూరు నాగారం పరిధిలోని చెల్పాకాలో పోలీస్‌ జీపును పేల్చేశారని, ఆ ఘటనలో సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై కిషోర్‌కుమార్, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారని చెప్పారు. భద్రాద్రి కొత్త గూడెం పరిధిలోని కరకగూడెం పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసి 17 మంది పోలీసులను హతమార్చారని, ఆయుధాలను ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. ఇక మావోయిస్టు పార్టీలో 13 ఏళ్లుగా పనిచేస్తున్న అనిత అలియాస్‌ రజిత భర్త జంపన్నతో కలసి లొంగిపోయినట్టు డీజీపీ వెల్లడించారు. జంపన్నపై ఉన్న రూ.25 లక్షలు, రజితపై ఉన్న రూ.5 లక్షల రివార్డును ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామన్నారు.

అజ్ఞాతంలోనే వివాహం..
జంపన్న భార్య హింగె అనిత అలియాస్‌ రజిత స్వస్థలం వరంగల్‌ జిల్లా దామెర. ఆమె హన్మకొండలోని ఆదర్శ కాలేజీలో ఇంటర్, వడ్డెపల్లిలోని డిగ్రీ కాలేజీలో బీఎస్సీ, ఉస్మానియా దూరవిద్యా కేంద్రం ద్వారా ఎమ్మెస్సీ చేశారు. 2004లో చిట్యాల లోకల్‌ ఆపరేషన్‌ స్క్వాడ్‌ కమాండర్‌ రమాకాంత్‌ పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. జంపన్న నేతృత్వంలో ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీలోని ప్రెస్‌ టీమ్‌లో పనిచేశారు. 2006లో సెంట్రల్‌ రీజియన్‌ బ్యూరో ప్రెస్‌ టీమ్‌కు.. 2007లో ఏరియా కమిటీ సభ్యురాలిగా నియమి తులయ్యారు. 2009లో పార్టీ అనుమతి పొంది జంపన్న, రజిత వివాహం చేసుకున్నారు. 2012లో రజితను ఒడిశా రాష్ట్ర కమిటీకి బదిలీ చేశారు. 2014లో డివిజనల్‌ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు.

దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు..
జంపన్న అలియాస్‌ జినుగు నర్సింహారెడ్డి స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలం చర్లపాలెం. 1979–80లో హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో చదువుతుండగా పీపుల్స్‌వార్‌కు చెందిన శాఖమూరి అప్పారావు, పులి అంజయ్య అలియాస్‌ సాగర్‌ల స్ఫూర్తితో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1984లో పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా చేరి.. ఏడాదిలోనే ఏటూరు నాగారం దళానికి కమాండర్‌గా నియమితులయ్యారు. 1991లో ఉత్తర తెలంగాణ ఫారెస్ట్‌ డివిజన్‌ (ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌)లో సభ్యుడిగా నియమించారు. ఏడాది తిరిగేలోగా అదే కమిటీకి కార్యదర్శిగా ఎదిగారు. పార్టీ కేంద్ర నాయకత్వం 2000 సంవత్సరంలో జంపన్నకు ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. 2003లో ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో జరిగిన 9వ ప్లీనరీలో స్పెషల్‌ జోనల్‌ కమిటీ మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. భారీ స్థాయిలో మిలిటరీ ఆపరేషన్స్‌ నిర్వహించిన నేపథ్యంలో. జంపన్నను కేంద్ర మిలటరీ కమిషన్‌ సభ్యుడిగా నియమించారు. 2004లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం సెంట్రల్‌ రీజియన్‌ బ్యూరో సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జిగా, ఛత్తీస్‌గఢ్‌–ఆంధ్రా కమిటీ లీడ్‌ మెంబర్‌గా కొనసాగారు.

కేంద్ర కమిటీలో 18 మంది
మావోయిస్టు పార్టీలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కేంద్ర కమిటీలో ఇప్పటివరకు 19 మంది సభ్యులుండగా.. జంపన్న లొంగుబాటుతో వారి సంఖ్య 18కి తగ్గింది. వయోభారం, అనారోగ్య కారణాలు, సైద్ధాంతిక విభేదాలు, వ్యక్తిగత కారణాలతో నేతలు లొంగిపోతుండటం.. కాలక్రమేణా మావోయిస్టు పార్టీని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యులుగా ప్రశాంత్‌ బోస్, నంబాల కేశవరావు, మిసర్‌ బెస్రా, మల్లోజుల వేణుగోపాల్‌రావు, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి, దేవ్‌కుమార్‌సింగ్, అక్కిరాజు హరగోపాల్, కడారి సత్యనారాయణరెడ్డి, వివేచ్‌ చందర్‌యాదవ్, రంజిత్‌ బోస్, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాద్‌రావు, రావుల శ్రీనివాస్, ఒగ్గు బురల్‌సత్యాజీ, మిలింద్‌ తేల్ముండే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement