పెద్దపల్లి, న్యూస్‌లైన్ : మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేసుకున్న పీపుల్స్‌వార్ పార్టీ.. మావోయిస్టు పార్టీగా అవతరించి శనివారంతో తొమ్మిదేళ్లు నిండుతున్నాయి. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, పీపుల్స్‌వార్ పార్టీ విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడిందని 2004 సెప్టెంబర్ 21న అప్పటి రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
అంతకుముందు ఎంసీసీ, పీపుల్స్‌వార్ పార్టీ విలీనంపై 2004 జూన్ నుంచి సుమారు రెండు నెలలపాటు అబూజ్‌మడ్ కేంద్రంగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. రెండు పార్టీలకు చెందిన కిషన్‌దా, విజయ్‌దా, గణపతి, కిషన్‌జీ, ఆజాద్ తదితర కీలక నేతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రెండు పార్టీల మధ్య అభిప్రాయభేదాలను చర్చించిన అనంతరం సెప్టెంబర్ మొదటి వారంలో పీపుల్స్‌వార్‌లో ఎంసీసీ విలీనానికి సిద్ధమైంది. రాష్ట్రంలో శాంతిచర్చల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన నక్సలైట్లు రాజధాని వేదికగా పార్టీ కొత్త పేరును వెల్లడించారు. మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర బలగాలతో ముప్పేట దాడికి గురైంది. దేశంలో వివిధ రాష్ట్రాలకు, ప్రాంతాలకు విస్తరించిన మావోయిస్టు పార్టీ రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగైంది. 2010 నాటికి నల్లమల, ఉత్తర, దక్షిణ తెలంగాణలో దళాల కదలిక పూర్తిగా దెబ్బతిన్నది. మావోయిస్టు పార్టీని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో ఆ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా చూపింది. తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో నష్టపోయిన పార్టీ ఉత్తరాంధ్రలో ఏవోబీ, దండకారణ్య ప్రాంతాల్లోనే అడపాదడపా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న మావోయిస్టు పార్టీ ఈ నెల 21 నుంచి 28 వరకు ఆవిర్భావ వారోత్సవాలు జరుపడానికి సన్నద్ధమైంది.
కుప్పకూలుతున్న కేంద్ర కమిటీ
మావోయిస్టు పార్టీ హిమాచల్‌ప్రదేశ్, హర్యాన, ఉత్తరాంచల్, కర్నాటక లాంటి కొత్త ప్రాంతాలకు విస్తరించినప్పటికీ పార్టీ పురుడు పోసుకున్న ఆంధ్రప్రదే శ్‌లో మాత్రం కోలుకోలేని రీతిలో దెబ్బతింటోంది. రాష్ట్రం నుంచి కేంద్ర కమిటీలో ఉన్న 26 మందిలో 14మందిని కోల్పోయింది. ఇందులో ఆరుగురు ఎన్‌కౌంటర్‌లో మరణించగా, ఎనిమిది మంది విచారణ ఖై దీలుగా జైలు జీవితం గడుపుతున్నారు. కేంద్ర కమిటీలో ఉన్న 42మందిలో 18మంది నాయకులను పార్టీ నాయకత్వం నష్టపోయింది.
కిషన్‌జీ, ఆజాద్ ఎన్‌కౌంటర్‌లతో పార్టీ జవసత్వాలపై పోలీసులు గట్టి దెబ్బతీశారు. దాదాపు ఈ ఇద్దరి స్థానాలు భర్తీ చేయడం అసాధ్యంగా భావిస్తున్నారు. తీవ్ర మైన నష్టాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ 2010 ఏప్రిల్ 6న దంతెవాడలో 76మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని హతమార్చగా, కోరాపూట్‌లో 11మందిని, మిద్నాపూర్‌లో 24మందిని, అహెరీలో 17మందిని, బీహార్‌లో 11మందిని హమార్చింది. సుకుమ జిల్లాలో కేంద్ర మాజీ మంత్రులను టార్గెట్ చేసి పై చేయి సాధించింది.
ఇందులో ఇరువురు కేంద్ర మాజీ మంత్రులతో సహా 28మందిని హతమార్చిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైదాన ప్రాంతాల్లో పట్టుసాధించడం వల్ల మావోయిస్టు పార్టీ ముందుగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్‌లోనే. ఆ పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న గణపతి సహా మరికొంతమంది ముఖ్యులు తమ సొంతగడ్డ ఏపీని వదులుకోవద్దని పలుమార్లు పార్టీ సమావేశాల్లో తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. ఈనేపథ్యంలో మావోయిస్టు పార్టీ అవతరణ దినోత్సవాలు జరిపేందుకు పార్టీ సన్నద్ధంకావడంతో అక్కడక్కడ తిరిగి దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మావోయిస్టు పార్టీకి తొమ్మిదేళ్లు
Published Sat, Sep 21 2013 2:12 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
Advertisement