విధ్వంసానికి సిద్ధం? | Sakshi
Sakshi News home page

విధ్వంసానికి సిద్ధం?

Published Mon, Dec 30 2013 1:23 AM

విధ్వంసానికి సిద్ధం? - Sakshi

=మావోయిస్టుల కద(న)ం
 =అదనపు బలగాలు మోహరించాలన్న కేంద్ర నిర్ణయంపై ఆగ్రహం
 =ఏవోబీలోకి భారీగా రానున్న బలగాలు
 =ఇప్పటికే మల్కన్‌గిరి  జిల్లాలో వంతెన పేల్చివేత
 =ఈస్ట్ డివిజన్‌లోనూ విధ్వంసాలకు పాల్పడే అవకాశం

 
 అదనపు బలగాలను పంపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మావోయిస్టులు మరింత చెలరేగిపోయేట్టు కనిపిస్తోంది. దళసభ్యుల హింసాత్మక కార్యకలాపాలకు పగ్గాలు వేయాలన్న లక్ష్యంతో ప్రభావిత ప్రాంతాల్లోకి 40 వేల మంది కేంద్ర బలగాలను పంపాలని యూపీఏ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాంతో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మల్కన్‌గిరి జిల్లాలో వంతెనను పేల్చేయడం భావి పరిణామాలకు అద్దం పడుతోంది. ఈస్ట్ డివిజన్‌లోనూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
 
కొయ్యూరు,  న్యూస్‌లైన్: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ప్రస్తుతం ఉన్న బలగాలకు అదనంగా 40 వేల మంది పోలీసులను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రంగంలోకి దించుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై భగ్గు మంటున్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు సిద్ధపడేట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండడంతో కేంద్రం సీఆర్‌పీఎఫ్ బలగాలను కూంబింగ్‌కు పంపుతోంది. దీనికి నిరసనగా మావోయిస్టులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఒడిశా మల్కన్‌గిరి జిల్లా పోతేరు నది వద్ద వంతెనను పేల్చేశారు. ఈ ప్రాంతం  విశాఖ జిల్లాకు సరిహద్దుగా ఉంది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో భాగంగా ఉన్న మల్కనగిరి, కోరాపుట్ ప్రాంతాల్లో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు.
 
ఈ పరిస్థితుల్లో మావోయిస్టులకు పట్టున్న ఏవోబీలో వారి దూకుడు ఎలా ఉంటుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది. ఏవోబీలో మావోయిస్టులకు పగ్గాలు వేయడం కష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో వారిని అదుపు చేయడానికి ప్రభుత్వం అదనపు బలగాలను పంపుతోంది. ఇప్పటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో మరింత హింస చెలరేగే అవకాశం కనిపిస్తోంది.
 
కీలకంగా మారిన ఏవోబీ
 
ఆంధ్ర, ఒడిశాలను పెనవేసుకుని నాలుగు డివిజన్లతో ఉన్న ఏవోబీ ప్రాంతం కీలకంగా ఉంది. మావోయిస్టులకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. దీంతో పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం కోరాపుట్,ఈస్టు డివిజన్, మల్కనగిరి పేరిట మావోయిస్టుల కేంద్ర ప్రాంతీయ కమాండ్ (సీఆర్‌సీ)లున్నాయి. వాటిలో ఒడిశావైపు ఉన్నవి చురుకుగా ఉన్నాయి. ఈస్టు డివిజన్‌లో రవి మిలటరీ వింగ్ కమాండర్‌గా సీఆర్‌సీకి నేతృత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది  మావోయిస్టులు ఈస్టుడివిజన్‌లో భాగంగా ఉన్న విశాఖ మన్యంలో విధ్వంసాల కన్నా ఇన్ఫార్మర్లను హతమార్చడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఏడాది మొత్తంలో ఆరుగురిని చంపేశారు. జూన్, జూలై, డిసెంబర్‌లో ఇన్ఫార్మర్లపై దృష్టి పెట్టారు. రానున్న రోజుల్లో వీరి వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.
 
ఏవోబీలో పదివేల మంది వరకు బలగాలు
 
ఏవోబీలో ప్రస్తుతం  సుమారు ఏడువేల మంది పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారికి తోడుగా కేంద్రం నుంచి వచ్చే బలగాలు మరో మూడు వేల వరకు ఉండనున్నాయి. సరిహద్దులో మల్కన్‌గిరిని ఆనుకుని ఉన్న జిల్లాలోని సీలేరు నుంచి పాడేరు వరకు కేంద్ర భద్రత బలగాలు,ఏపీఎస్‌పీ పోలీసులు, గ్రేహౌండ్స్ కలిసి ప్రస్తుతం వెయ్యి మంది వరకు ఉన్నారు. అదే విధంగా కోరాపుట్‌ను ఆనుకుని ఉన్న విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లోనూ మరో 1,200  మంది సరిహద్దు వెంబడి కూంబింగ్ చేస్తున్నారు. ఒడిశా మల్కనగిరి జిల్లాలో  33 సరిహద్దుభద్రత బలగాలు(బీఎస్‌ఎఫ్), కోరాపుట్‌లో  25 క్యాంప్‌లున్నాయి. వీరు కాకుండా ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చే బలగాలు మరో మూడు వేల మంది వరకు ఉండే అవకాశం ఉందని పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement