కేంద్ర నిధులకు గండి?
=ఐఏపీ నిధులు రూ. 30 కోట్లు మంజూరు కాకపోయే అవకాశం
=కేటాయించిన పనులు పూర్తి కాకుంటే సమస్యలు
=మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు
కొయ్యూరు, న్యూస్‌లైన్: జాతీయ స్థాయిలో విశాఖ మన్య ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిగణించి కేంద్రం కేటాయిస్తున్న నిధులు జిల్లాకు దక్కని ప్రమాదం పొంచి ఉంది. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (ఐఏపీ) నిధులతో నిర్మిస్తున్న పనులు సకాలంలో పూర్తి కాకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ. 30 కోట్ల నిధులు ఆగిపోయే అవకాశం ఉంది. పాడేరు ఐటీడీఏ పరిధిలో ఈ పథకం కింద చేపట్టిన నిర్మాణాలు పూర్తయ్యాయని ధ్రువీకరణ పత్రాలు అందితే తప్ప నిధుల సరఫరా సాధ్యం కాదనిపిస్తోంది.
దేశంలో 78 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కోటాలో రాష్ట్రం నుంచి ఏడు జిల్లాలు ఎంపికయ్యాయి. వాటిలో విశాఖ కూడా ఉంది. ప్రణాళిక సంఘం సూచనల మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు ఏటా రూ. 30 కోట్ల నిధులు వస్తాయి. 2011లో కేంద్రం విశాఖను మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఎంపిక చేసింది. మొదటి విడతగా రూ. 30 కోట్లు వచ్చాయి.
2012-13కు సంబంధించి మరో 30 కోట్లు కేటాయించారు. రెండేళ్లలో మంజూరైన రూ. 60 కోట్ల వ్యయంతో పనులు మార్చి నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. సకాలంలో అవి పూర్తి కాకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఇచ్చే రూ.30 కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈమేరకు అధికారులు సత్వరం పనుల పూర్తికి చర్యలు చేపడుతున్నారు. అయితే కొన్ని పనులు సకాలంలో పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు
మౌలిక వసతులకు ప్రాధాన్యం
ఐఏపీ నిధులను ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు కేటాయిస్తారు. ఇందులో విద్యార్థుల కేరీర్‌కు సంబంధించి కూడా నిధులు ఇస్తారు. వంతెనలు, తాగునీటి పథకాలు, ఆస్పత్రులు, విద్యాలయాల నిర్మాణాలను ప్రస్తుతం చేపడుతున్నారు. మండలంలో చోద్యం లాంటి కీలక వంతెనకు కూడా ఐఏపీ నిధులను మంజూరు చేశారు. ఈ వంతెన నిర్మాణం చాలా వరకు పూర్తయింది. రెండు నెలల ముందుగానే కాంట్రాక్టర్ వంతెనను పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే చాలా మండలాల్లో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.రెండు నెలల పాటు భారీగా వర్షాలు కురవడంతో పాటు ఇతర సమస్యల వల్ల పనుల్లో జాప్యం జరిగింది. పనులు పూర్తికాకుంటే కేంద్ర నిధులు రాకపోయే అవకాశం ఉందని ఐటీడీఏ ఏపీవో నాయుడు స్పష్టం చేశారు.