సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నూతన ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న, 1992 నుంచి 25 ఏళ్లపాటు పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు నడిపించిన సీనియర్ మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అనారోగ్యం, వయోభారం దృష్ట్యా కేంద్ర కమిటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
పీపుల్స్‌వార్ గ్రూపులో ఉన్న అనేక పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి 2004 సెప్టెంబర్ 21న మావోయిస్టు పార్టీగా ఏర్పడగా నూతన పార్టీకి గణపతే నాయకత్వం వహించాలని అప్పటి పార్టీలన్నీ ప్రతిపాదించాయి. దీంతో గణపతి అప్పుడు కార్యదర్శిగా నియమితులయ్యారు. పీపుల్స్‌వార్ గ్రూప్ ద్వారా 14 రాష్ట్రాలను ప్రభావితం చేసిన మావోయిస్టు పార్టీకినాయకత్వ బాధ్యతలు వహించిన గణపతి.. ఉద్యమం నడపడంలో నిష్ణాతుడిగా పేరు సంపాదించారు. అన్ని రాష్ట్రాల కమిటీలను వ్యూహాత్మకంగా ముందుకు నడిపించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ 8 రాష్ట్రాల్లోనే కార్యకలాపాలు సాగిస్తుండటం, కార్యకలాపాలు సైతం ఆశించినట్లుగా లేకపోవడంతో పార్టీ కుదేలైనట్లు పోలీసు వర్గాలు ప్రకటిస్తూ వచ్చాయి.
మరోవైపు గణపతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం పార్టీని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతూ వచ్చింది. దీంతో స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని ఇటీవల జరిగిన కేంద్ర కమిటీ ఐదో సమావేశంలో గణపతి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో కేశవరావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ బాధ్యతలను కేశవరావు పర్యవేక్షించనున్నారు. మావోయిస్టు పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను కేశవరావు పరిష్కరిస్తారని కమిటీ ఆశిస్తోంది. అదే సమయంలో పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా కొత్త నియామకాలపై ఆయన దృష్టి పెడతారా అనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎవరీ కేశవరావు?
గాగన్న అలియాస్ ప్రకాష్, అలియాస్ క్రిష్ణ, అలియాస్ విజయ్, అలియాస్ కేశవ్, అలియాస్ బస్వరాజు, అలియాస్ బీఆర్, అలియాస్ దారపు నరసింహారెడ్డి, అలియాస్ నరసింహ. మావోయుస్టు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావుకు ఉన్న వివిధ పేర్లు ఇవి.æ కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆయన అతిదగ్గర నుంచి చూశారు. విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగారు. సూరపనేని జనార్దన్ తర్వాతి తరంవాడైన కేశవరావు... వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కాలేజీలో 1974లో ఇంజనీరింగ్ చదివారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు.
కేశవరావుది మిలిటరీ వ్యూహరచనలో అందెవేసిన చేయి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలుళ్లకు సంబంధించిన అ«ధునాతన ప్రక్రియల ఆచరణలోనూ కేశవరావు నిపుణుడు. గెరిల్లా పోరాట వ్యూహకర్తగా, ఆయు«ధ శిక్షణలోనూ ఆయన సిద్ధహస్తుడు. మావోయుస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయుస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. అంతేకాకుండా జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోని మిలిటరీ సబ్‌కమిటీల బాధ్యత కూడా కేశవరావుదేనని పోలీసుల అంచనా. మావోయుస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది.
ఆరు నెలల క్రితం నుంచే కేశవరావు మావోయిస్టు పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నప్పటికీ తాజాగా అధికారికంగా ఈ నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో, కేడర్ రిక్రూట్‌మెంట్‌లో కేశవరావు బాధ్యత కీలకమని తెలుస్తోంది. 1980లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్‌ఎస్‌యూ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒకే ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్టయ్యారు. ఆయన తండ్రి వాసుదేవరావు అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. మావోయుస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావేనని అంచనా. కేశవరావుపై కేంద్రం రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది.
మావోయిస్టు పార్టీలో వ్యవస్థ ఇలా...
1. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి ప్రధాన కార్యదర్శి కేశవరావు బాధ్యుడిగా ఉంటారు. సెంట్రల్ కమిటీలో ప్రస్తుతం 19 మంది సభ్యులుంటే అందులో 13 మంది ఏపీ, తెలంగాణలకు చెందినవారే ఉన్నారు.
2. సెంట్రల్ కమిటీ కింద సెంట్రల్ మిలిటరీ కమిషన్, పోలిట్‌బ్యూరో ఉంటాయి.
3. మిలిటరీ కమిషన్‌కు ఇప్పటివరకు కేశవరావు బాధ్యత వహించారు. పోలిట్‌బ్యూరోకు సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి, మిలిటరీ కమిషన్‌కు సారథ్యం వహిస్తున్నవారు ఇద్దరూ కలసి బాధ్యత వహిస్తారు. (పోలిట్‌బ్యూరోలో మొత్తం 9 మంది సభ్యులుంటారు.)
4. ఈ మూడు విభాగాల కింద తూర్పు, మధ్య, ఉత్తర, దక్షిణ ప్రాంతాల పార్టీ రీజనల్ విభాగాలు, స్పెషల్ జోనల్ కమిటీలు, రీజనల్ కమిటీలు, డివిజనల్ కమిటీలు, ఏరియా కమిటీలు, స్థానిక గెరిల్లా దళాలతో కూడిన అంచెలంచెల వ్యవస్థ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment