ముంబై: సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. వినాయకుని జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో గణపతి భారీ విగ్రహాలను వీధుల్లోని అద్భుత వేదికలలో ప్రతిష్టిస్తారు. ముంబైలో ఏర్పాటు చేసే ఐదు గణపతి విగ్రహాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వాటిని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.
లాల్‌బాగ్చా రాజా
సెంట్రల్ ముంబైలోని లాల్‌బాగ్ మార్కెట్‌లోని లాల్‌బాగ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని 'లాల్‌బాగ్చా రాజా' అత్యంత ప్రసిద్ది చెందిన వినాయక మండపంగా పేరొందింది. లాల్‌బాగ్‌లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని నవసాచ గణపతి అంటారు. ఈ రూపంలోని గణేశుడు అన్ని కోరికలను తీరుస్తుంటాడని చెబుతారు. 10 రోజుల పాటు ఇక్కడ జరిగే గణేష్ ఉత్సవాల్లో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం క్యూ కడతారు.
అంధేరీచా రాజా
ముంబయిలో గణేశోత్సవాలను చూసేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా అంధేరీచా రాజాను సందర్శిస్తుంటారు. అంధేరీచా రాజాను 'నవసాల పవనార గణపతి' లేదా 'కోరికలను నెరవేర్చే గణేశుడు' అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం అంధేరీచా మండపం థీమ్ విభిన్నంగా ఉంటుంది. ఇది భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది.
ముంబైచా రాజా
ముంబైలోని అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్‌బాగ్చా రాజా గణేష్ మండపానికి కొద్ది దూరంలో మరొక ప్రసిద్ధ గణపతి మండపం ఉంది. గణేష్ గల్లీలో ఉన్న ఈ మండపంలో కొలువైన గణపతిని ముంబైచా రాజా అని పిలుస్తారు. ముంబైలోని పురాతన గణేష్ మండపాలలో ఒకటైన ముంబైచా రాజా 1928 నుండి పూజలందుకుంటున్నాడు. ఈ గణేష్ మండపం థీమ్ ప్రతి సంవత్సరం ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబై చా రాజాను సందర్శించి, ఆశీస్సులు పొందుతారు.
జీఎస్‌బీ సేవా మండల్
ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో ఉన్న జీఎస్‌బీ సేవా మండల్‌లోని గణపతి విగ్రహం దేశంలోనే అత్యంత సంపన్నమైనదిగా చెబుతారు. ఈ ఆకర్షణీయమైన విగ్రహాన్ని బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. పంచధాతు (బంగారం, వెండి, రాగి, జింక్,తగరం) మిశ్రమంతో ఈ విగ్రహాన్ని రూపొందిస్తారు.
ఖేత్వాడిచా గణరాజ్
ప్రకాశవంతమైన లైట్లు, పూలతో అలంకరించిన ఖేత్వాడిచా గణరాజ్ మండపం దక్షిణ ముంబైలోని ఖేత్వాడి ప్రాంతంలో ఉంది. ఇది 40 అడుగులకుపైగా ఎత్తు కలిగివుంటుంది. 1959లో తొలిసారి ఇక్కడ గణపతిని నెలకొల్పారు. ఈ పూజా వేదిక ముంబైలోని ప్రముఖ గణపతి మండపాలలో ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment