రాంగోపాల్ వర్మపై పలు కేసులు నమోదు
పుణే: వినాయకుడిపై ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై పలు కేసులు నమోదయ్యాయి. వినాయక చవితి సందర్భంగా శుక్రవారం వర్మ ట్విట్టర్‌లో గణనాథునిపై అనేక వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ముంబై శాఖ చీఫ్ సుమిత్ ఖంబేకర్, సామాజిక కార్యకర్త షాజాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని హిందువులకే కాక ముస్లింలకూ తీవ్ర ఆగ్రహం కలిగించాయన్నారు.
ఈ ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వహిందూ పరిషత్ కూడా వర్మ వ్యాఖ్యలను ఖండించింది. వర్మ వెంటనే తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, ఆయనపై పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. వర్మ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ హిందూ జనజాగృతి సమితి కూడా ఫిర్యాదు చేసింది. వర్మ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చేయాలని హిందూ జనజాగృతి సమితి కార్యకర్త సూర్జిత్ కుమార్ డిమాండ్ చేశారు.