వరదల దెబ్బ:అయినా ఈ వసూళ్లు సూపర్!
సాక్షి,ముంబై:వినాయక చవితి ఉత్సవాలంటే ముందుగా గుర్తొచ్చేది ముంబై వేడుకలు. అక్కడ కొలువుదీరే అదిభారీ విగ్రహాలు...హంగులూ..సంబరాలు. ముఖ్యంగా లాల్‌బాగ్చా వినాయకుడి పత్ర్యేకత ఇంతా అంతా కాదు. ఏటేటా లక్షలాది జనం లాల్‌బాగ్చా గణపతి దర్శించుకుని, విలువైన కానుకలు సమర్పించుకుంటారు. ఈ 11 రోజుల పండుగలో ఈ ఏడాది వసూళ్లు దాదాపు రూ.6కోట్లు. అయితే పెద్దనోట్ల చలామణి ముగిసి సంవత్సరం దాటినా ఇంకా ఈ హుండీలో ఇవి దర్శనమివ్వడం విశేషం.
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు డబ్బు, బంగారు , వెండి, ఇతర వస్తువులను ప్రజలు విరాళంగా ఇస్తుంటారు. ఇది రికార్డ్ స్థాయిలో ఉంటుంది. ఈ ఏడాది కూడా అంతేకాదు భారీ ఎత్తున బంగారం, వెండి వసూలైంది. ఇందులో రూ.1.1 లక్షల రద్దయిన వెయ్యి రూపాయల ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు.
లాల్‌బాగ్చారాజా సార్వజనిక్ గణేషోత్సవ్ మండలి అందించిన సమాచారం ప్రకారం భక్తుల కానుకల్లో మొత్తం రూ .5.8 కోట్ల నగదు, 5.5 కేజీల బంగారం, 70 కేజీల వెండి లెక్క తేలింది. లెక్కింపు పూర్తైన అనంతరం వీటి వేలం నిర్వహిస్తామన్నారు. తద్వారా వచ్చిన సొమ్మును సామాజిక కార్యక్రమాలకు వెచ్చించనున్నట్టు లాల్‌బాగ్చారాజా సార్వజనిక్ గణేషోత్సవ్ మండల్ అధ్యక్షుడు బాలాసాహెబ్ కుంబ్లే వెల్లడించారు.
మరోవైపు పండుగ మధ్యలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారంణంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కానుకల విలువ భారీగా తగ్గింది. గతేడాది రూ.8కోట్ల డొనేషన్లు రాగా, ఈసారి అది రూ.5.8 కోట్లకు పడిపోయినట్టు నిర్వాహకులు తెలిపారు.