
ఇటీవలి కాలంలో ఫ్యాషన్ పేరుతో రకరకాల దుస్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వీటిని యువత ధరిస్తున్నారు. అయితే సంప్రదాయవాదులు ఇటువంటి దుస్తులను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఆలయాల్లోకి ఇటువంటి దుస్తులు ధరించి రావడం తగినది కాదని వారంటున్నారు. ఈ నేపధ్యంలో ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో డ్రెస్ కోడ్‌ను అమలు చేయబోతున్నది.
ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో వచ్చే వారం నుండి డ్రెస్ కోడ్ అమలుకానుంది. పొట్టి స్కర్టులు లేదా శరీరాన్ని బహిర్గతం చేసే దుస్తులు ధరించి, ఆలయానికి ఎవరైనా రావడాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయ ట్రస్ట్ (ఎస్‌ఎస్‌జీటీటీ) ఆలయానికి వచ్చేవారి కోసం డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. భక్తులు తప్పనిసరిగా శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించాలని ఎస్‌ఎస్‌జీటీటీ తెలిపింది. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించాలని పేర్కొంది.
ఇకపై చిరిగినట్లు కనిపించే ప్యాంట్లు, పొట్టి స్కర్టులు లేదా శరీర భాగాలు కనిపించే దుస్తులు ధరించిన భక్తులను ఆలయంలోనికి అనుమతించబోమని ట్రస్ట్ పేర్కొంది. ఆలయంలో పూజల సమయంలో క్రమశిక్షణ లేకపోవడం, కొందరు అభ్యంతరకరమైన దుస్తులు ధరించి రావడంపై పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారని ట్రస్ట్ పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడటానికే డ్రెస్ కోడ్‌ను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే