వాగ్గేయకారుడా.. కన్నీటి వందనం
గోసి గొంగడి పాట కాలి గజ్జెల మోత చేత ఎర్రజెండా పిక్కటిల్లే రేల గొంతుక.. గద్దర్ వసంతకాల మేఘ గర్జన కదనుతొక్కే ప్రజావాహిక జన కేతన.. నవ చేతన.. గద్దర్ పల్లవొక తూటా చరణమొక ఫిరంగి వేదిక పై వాగ్గేయకారుడు పెత్తందార్ల వెన్నులో చలి.. గద్దర్ తెలంగాణ సింగడి దండకారణ్య పచ్చనాకు బొగ్గుబావి దీపం రైతుకూలీ కొడవలి.. గద్దర్ పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం శ్రమజీవి పాదంపై చెరగని పుట్టుమచ్చ అతడు చరిత్ర.. జనగళ యుద్ధనౌక.. గద్దర్ ఈ నేల మళ్లీ కనలేని పాట గద్దర్. మన పాల్ రాబ్సన్. మన విక్టర్ జారా. మన బాబ్ మార్లీ. ఒకే ఒక్కడు గద్దర్. నోరులేని పేదలకు గొంతునిచ్చినవాడా మహా కవీ... అమర గాయకుడా.. నీకు వీడ్కోలు... రేల పూల మాల.
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: తన పాటలతో ప్రజా బాహుళ్యాన్ని ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గత నెల 20న గుండె పోటుతో అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాలు మూసుకుపోయినట్టు నిర్ధారించిన వైద్యులు ఈ నెల 3న శస్త్రచికిత్స చేసి సరిచేశారు. కానీ ముందు నుంచే మూత్ర పిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ‘ఆదివారం ఉదయం అకస్మాత్తుగా రక్తపోటు పెరిగింది. షుగర్ లెవల్స్ పడిపోయాయి. మధ్యాహ్నానికల్లా శరీరంలోని పలు అవయవాలు పనిచేయడం ఆగిపోయాయి. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు..’’అని ఆస్పత్రి అధికారులు హెల్త్ బులెటెన్‌లో వెల్లడించారు.
అభిమానుల కోసం ఎల్‌బీ స్టేడియానికి..
గద్దర్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సాయంత్రం 5 గంటల సమయంలో ఎల్‌బీ స్టేడియానికి తరలించారు. పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ప్రజా గాయకురాలు విమలక్క తదితరులు నివాళి అర్పించి గద్దర్ సతీమణిని ఓదార్చారు. జోహార్ గద్దర్, అమర్ రహే గద్దరన్న అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఎల్‌బీస్టేడియం హోరెత్తింది.
నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
గద్దర్ భౌతికకాయానికి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. తొలుత సోమవారం ఉదయం గద్దర్ భౌతికదేహాన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద కొద్దిసేపు ఉంచి నివాళులు అర్పించనున్నారు. తర్వాత నెక్లెస్‌రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ వెంకటాపూర్ భూదేవీనగర్‌లోని ఆయన స్వగహానికి తరలించనున్నారు. అక్కడ స్థానికుల సందర్శనార్థం కాసేపు ఉంచి.. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
బుర్రకథలతో చైతన్య పరుస్తూ..
ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన లక్ష్మమ్మ, శేషయ్య దళిత దంపతులకు 1949లో గద్దర్ జన్మించారు. అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. సొంత ఊరిలోనే ఏడోతరగతి వరకు చదివిన ఆయన.. తర్వాత నిజామాబాద్ జిల్లా బోధన్‌లో, వరంగల్‌లో పైచదువులు కొనసాగగా.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. గ్రామంలో ఉన్నప్పుడే ఒగ్గుకథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథలు, భాగవత రూపంలో రైతులు, కార్మిక లోకాన్ని చైతన్య పరిచారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు.
ఊరూరా తిరిగి బుర్రకథల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకుడు బి.నర్సింగరావు భగత్‌సింగ్ జయంతి రోజున గద్దర్‌తో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తర్వాత ప్రతి ఆదివారం గద్దర్ తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో నర్సింగరావు ప్రోత్సాహంతో గద్దర్ తన మొదటి పాట ’ఆపరా రిక్షా’రాశాడు.
గదర్ అంటే విప్లవం
సిక్కు కూలీలు, పనివాళ్లు పెట్టుకున్న పార్టీ పేరు గదర్.. గదర్ అంటే విప్లవం అని అర్థం. దీని నుంచి స్ఫూర్తి పొంది ఆయన రాసిన పాటల మొదటి ఆల్బంకు గదర్ అని పెట్టారు. ఇది ప్రజల్లోకి వెళ్లి ఆయన గద్దర్‌గా నిలిచిపోయారు. 1975లో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన నక్సల్ మార్గం పట్టారు.
1982లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఉద్యమ బాట పట్టారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్య మండలిలో చేరారు. ఒగ్గు కథలు, బుర్ర కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రజా సమస్యలపై పాటల రూపంలో కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
గోచీ,గొంగళి..చేతి కర్ర,ఎర్ర జెండా..
గద్దర్ పాటకు ఎంత ప్రాచుర్యం ఉందో, ఆయన ఆహార్యానికీ అంతే ప్రాముఖ్యత ఉంది. ఒంటిపై చొక్కా లేకుండా గొంగళి కప్పుకుని, ఎర్ర జెండా చుట్టిన కర్రతో, కాళ్లకు గజ్జెలు కట్టి గద్దర్ స్టేజీపై ఆడి, పాడుతుంటే లక్షలాది మంది కళ్లు, చెవులు అప్పగించేసేవారు. జీరబోయిన గొంతుతో పాటకట్టే విధానానికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. మావోయిస్టు ఉద్యమానికి దూరమైన తర్వాత గద్దర్ వేషధారణ సైతం మారింది. పలుమార్లు ప్యాంట్, షర్ట్, కోట్‌లోనూ కనిపించారు.
70 ఏళ్ల వయసులో.. ఓటర్‌గా నమోదై..
నక్సల్, మావోయిస్టు ఉద్యమ పంథాలో నడిచిన గద్దర్.. బూర్జువా పార్టీల, ఎన్నికల వ్యవస్థలో పాలుపంచుకోబోనంటూ ఓటర్‌గా కూడా నమోదు చేసుకోలేదు. మావోయిస్టుల నుంచి దూరమైన తర్వాత 2018లో తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకుని.. ఆ ఏడాది డిసెంబర్ 7న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేశారు. ‘‘పోరాటం అంటే తుపాకుల పట్టుకోవడం కాదు.. తిరుగుబాటు చేయడం అని గుర్తించి ప్రజా జీవితంలోకి వచ్చా. రాజ్యంగమే మనకు రక్ష అన్న విషయాన్ని తెలుసుకుని మొదటిసారి ఓటు హక్కును తీసుకున్నా.. 70 ఏళ్లు నిండాక తొలిసారి ఓటు వేశా. ఓట్ల యుద్ధానికి సిద్ధమయ్యే క్రమంలో గోచీ, గొంగడి, గజ్జెలు జమ్మిచెట్టు మీద పెట్టిన..’’ అని ఆ సమయంలో గద్దర్ ప్రకటించారు.
► తర్వాత ఆయన ‘గద్దర్ ప్రజాపార్టీ’ పేరిట ఒక రాజకీయ పార్టీని కూడా స్ధాపించారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా ఉద్యమాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. మావోయిస్టులు కూడా తమ వ్యూహాన్ని మార్చుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మహాబోధి విద్యాలయ ఏర్పాటు
అల్వాల్: స్థిరమైన జీవితం లేదని చాలాచోట్ల వలస కార్మికుల పిల్లలను బడిలో చేర్చుకునేవారు కాదు. దీంతో గద్దర్ అందరికీ విద్య అందించాలన్న సంకల్పంతో భూదేవినగర్‌లో మహాబోధి విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సతీమణి విమల, కూతురు వెన్నెల ఈ పాఠశాల బాధ్యతలు చూసుకుంటున్నారు.
‘బండెనక బండి కట్టి’తో వెండితెరపైకి..
గద్దర్‌కు రెండు నంది అవార్డులు
ప్రజాగాయకుడు గద్దర్ సినిమా రంగంపైనా తనదైన ముద్ర వేశారు. సాయిచంద్ హీరోగా గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘మా భూమి’(1979) సినిమాలో తొలిసారి వెండితెరపై పాట పాడటంతోపాటు నటించారాయన. ఈ సినిమాలో ‘బండెనక బండి కట్టి..’ అనే పాటలో గద్దర్ కనిపిస్తారు. ఆ తర్వాత బి.నర్సింగరావు నటించి, దర్శకత్వం వహించిన ‘రంగుల కల’(1983) చిత్రంలో ఓ ప్రధానపాత్ర పోషించారు. జగపతిబాబు హీరోగా ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’(2011) మూవీలో కీలకపాత్రలో నటించారాయన.
ఆర్.నారాయణమూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దండకారణ్యం’(2016), సుడిగాలి సుదీర్ నటించిన ‘సాఫ్ట్‌వేర్ సుదీర్’(2019), చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన ‘గాడ్ ఫాదర్’(2022) సినిమాల్లోనూ నటించారు. ఆర్.నారాయణమూర్తి హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘ఒరేయ్ రిక్షా’ సినిమాలో గద్దర్ పాటరాయగా, ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరపరిచి, గానం చేసిన ‘మల్లెతీగకు పందిరి వోలే..’ పాట అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపే పాటల్లో ఒకటిగా నిలిచింది. ‘జై బోలో తెలంగాణ’ మూవీ కోసం గద్దర్ రాసిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా..’ పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు పాటలకు నంది అవార్డులు(రచయిత, గాయకుడుగా) గద్దర్‌కు వచ్చాయి.
విప్లవ ఉద్యమంలో ఉన్నవారు అవార్డులు, రివార్డులు తీసుకోకూడదనే నిబంధన ఉండటంతో నంది అవార్డులు తీసుకోలేదని గద్దర్ ఓ సందర్భంలో చెప్పారు. ఇటీవల విడుదలైన ఆర్.నారాయణమూర్తి ‘యూనివర్సిటీ’ చిత్రంలోనూ ఆయన పాటలు రాశారు. ఇవే కాదు, ఆయన రాసిన మరికొన్ని పాటలు సినిమాల్లో ప్రేక్షకులను అలరించాయి. ‘నేను రాసిన వేల వేల పాటలకు నా భార్య విమలే స్ఫూర్తి అని గద్దర్ గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి తన పాటలంటే ఎంతో ఇష్టమని, ఆయనపై వ్యతిరేకంగా పాడినా మెచ్చుకునేవారని 2017 జూన్‌లో ‘మెజార్టీకే రాజ్యాధికారం’అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు కడప వచ్చిన సందర్భంలో గద్దర్ అన్నారు. గద్దర్ నటించిన చివరిచిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. సత్యారెడ్డి లీడ్ రోల్‌లో నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీలో గద్దర్ కీలక పాత్ర పోషించడంతో పాటు పాటలు రాశారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
కుటుంబమంటే ఎంతో మమకారం
బ్యాంకులో ఉద్యోగం చేస్తు న్న సమయంలోనే గద్దర్ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు విమల. వీరికి ముగ్గురు పిల్లలు. సూర్యకిరణ్, చంద్రకిరణ్ (2003లో అనారోగ్యంతో మరణించారు), కూతురు వెన్నెల. గద్దర్‌కు సరస్వతిబాయి, శాంతాబాయి, బాలమణిబాయి అని ముగ్గురు అక్కలు. నర్సింగ్‌రావు అనే అన్న ఉన్నారు. గద్దర్‌కు కుటుంబమంటే ఎంతో ప్రాణం. భార్య విమల సహకారాన్ని తరచూ గుర్తు చేసుకునేవారు. తాను ఉద్యమంలో ఉన్నప్పుడు కుటుంబానికి, తనకు ఆమె అండగా ఉన్న తీరును చెప్పేవారు.
ఆ పాటలు అగ్ని కణాలు..
అమ్మ కష్టం మొదలు సమాజంలో అనేక విషయాలపై పాటలు రాసిన గద్దర్.. రచయితగా తాను రాసిన అనేక పాటలకు అప్పటికప్పుడు పల్లవులు కట్టేవారు. తొలినాళ్లలో కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి సామాజిక విషయాలపై బుర్ర కథల ద్వారా అవగాహన కల్పించేవారు. తర్వాత స్వయంగా పాటలు రాశారు. 1970వ దశకంలో ఉద్యమానికి బాసటగా నిలిచిన జననాట్యమండలితో కలసి గద్దర్ సామాజికంగా దోపిడీకి గురైన వర్గాలకు గొంతుకగా మారారు.
‘పోదమురో జనసేనతో కలిసి, పోదమురో ఎర్రసేనతో కలిసి..’ అని గద్దర్ రాసి, పాడిన పాట అసంతృప్తితో మండుతున్న యువత నక్సల్ ఉద్యమంలో చేరి తుపాకులు పట్టేలా చేసింది. 1990 ఫిబ్రవరి 18న జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు ఏకంగా 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.
విప్లవానికి ఊపిరినిచ్చి.. ఉద్యమానికి ఊపు తెచ్చి..
గద్దర్ పాట అంటేనే ఒక ఉప్పెన.. మొదట్లో బుర్రకథలతో ప్రజలు చైతన్యాన్ని కలిగించినా, నక్సలైట్ల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చినా.. ఆయన గొంతు సైరన్ మోగించేది. దొరలు, పాలకుల దౌర్జన్యాన్ని ఎదిరించడం నేర్పి వేలాది మంది యువత తుపాకులు చేతపట్టేలా చేసింది. శ్రీకాకుళం సీతంపేట నుండి మొదలైన తిరుగుబాటు పాట జగిత్యాల జైత్రయాత్ర, కల్లోల కరీంనగర్ వరకు సాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ పాట ప్రాణం పోసింది.
‘అమ్మ తెలంగాణమా.. ఆకలి కేకల రాజ్యామా..’అంటూ ఆయన రాసి, పాడిన పాట.. ధూంధాం కార్యక్రమాలు ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపాయి. ప్రతి పల్లె కళాకారుడు గద్దర్ స్ఫూర్తిగా గోచీ, గొంగళి కట్టి నృత్యం చేశారు. ఉద్యమాల్లో అమరులైన వారి కోసం ఏర్పడ్డ బంధుమిత్రుల కమిటీలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇదికాదంటూ.. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమాన్ని చేపడతానని ప్రకటించారు. వివిధ పార్టీల నేతలనూ కలిశారు.
ఓరుగల్లు నుంచి పొలికేక
సాక్షిప్రతినిధి, వరంగల్: పీపుల్స్‌వార్ పార్టీపై 1990లో ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. అప్పటివరకు అజ్ఞాతంలో ఉన్న పీపుల్స్‌వార్ నేతలు, లీగల్ కార్యకర్తలు, జననాట్యమండలి, అనుబంధ సంఘాల నాయకులు జనజీవనంలోకి అడుగుపెట్టారు. ఇదే సమయంలో 1990 మే 5, 6 తేదీల్లో వరంగల్ వేదికగా రాష్ట్ర రైతుకూలీ సంఘం మహాసభలు నిర్వహించారు. జననాట్యమండలి నాయకుడు గద్దర్, ఆయన బృందం ప్రకాష్ రెడ్డిపేట ఏరియాలో ఏర్పాటు చేసిన సభావేదికపైన ప్రత్యక్షమైంది.
పదిలక్షలకుపైగా జనం హాజరైన ఈ సభలో గద్దర్ బృందం ఆటాపాటా ఉర్రూతలూగించాయి. ‘ధీరులారా శూరులారా.. రాడికల్ శూరులారా.. మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు..’, ‘జై బోలోరే జై బోలో.. అమర వీరులకు జై బోలో.. వీరులకేమో జై బోలో.. ఆహా శూరులకేమో జై బోలో..’అంటూ పాడిన పాటలు ఇప్పటికీ అందరి నోట్లో వినిపిస్తాయి. గద్దర్ ప్రస్థానంలో ఓరుగల్లు మహాసభ చిరస్థాయిగా నిలిచింది.
ఎన్‌కౌంటర్ నుంచి తప్పించిన కానిస్టేబుల్
నక్సల్స్‌పై తీవ్ర అణచివేత కొనసాగుతున్న 1988–90 మధ్య కాలంలో గద్దర్ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఓసారి గద్దర్, ఇతర మావోయిస్టులు ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు సమాచారం అందింది. పెద్ద సంఖ్యలో పోలీసులు దాడి చేసి గాలించారు. ఆ సమయంలో గద్దర్ ఓ ఇంటి అటకపై దాక్కున్నారు. ఒక కానిస్టేబుల్ అటకపై గద్దర్‌ను చూసినా.. ఎవరూ లేరని అబద్ధం చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. లేకుంటే గద్దర్ ఆరోజే ఎన్‌కౌంటర్ అయ్యేవారు, ఆనాడు కాపాడిన కానిస్టేబుల్ దళితుడని తర్వాత గద్దర్ వెల్లడించారు.
బతికుంటే.. మళ్లీ వస్తా
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రజాయుద్ధనౌక గద్దర్‌కు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చివరిసారిగా ఏప్రిల్ 30న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాల ముగింపు సభలో పాల్గొన్నారు. ఈ సభలో గద్దర్ పాట పాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘అచ్చంపేటలో నాలుగు ప్రాణాలు పోయినప్పుడు ఇక్కడికి వచ్చాను.
మొదటి తుపాకీ తూట నా గుండెను తాకినప్పుడు.. నెత్తురు కోసం రూ.100 కావాలని నా భార్య పైసలు అడుక్కుంది. మళ్లీ బతికి ఈ ఊరికి వచ్చిన. చివరి ఊపిరి వరకు మీ కోసం పాటుపడతా. పాలమూరుకు పేరు తేవాలి. ఈ నేల కోసం పోరాటం చేయాలి. బతికుంటే మళ్లీ వస్తాను.. మీ పాదాలకు వందనాలు’అంటూ పాట రూపంలో చెప్పారు.
ఓయూ స్టూడెంట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో 1975లో ట్రిపుల్ ఈ పూర్తి చేశారు. నగరంలోని మొజంజాహీ ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ కాలేజీకి చెప్పులు లేకుండా వచ్చేవారని ప్రిన్సిపల్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. ఓ హోటల్‌లో 26 పైసలకు పార్ట్‌టైంపనిచేస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేశారన్నారు.
జార్జిరెడ్డి హయాంలో అనేక ఉద్యమాలకు ఓయూ కేంద్రబిందువు అయ్యింది. వామపక్ష ఉద్యమభావజాల వ్యాప్తి కోసం ఇక్కడ జరిగిన అనేక సభలు, సమావేశాలలో జననాట్యమండలి తరపున గద్దర్ పాల్గొన్నారు. మలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో జరిగిన ప్రతి సభలో పాల్గొని తన ఆటపాటతో విద్యార్థులను ఉత్తేజపరిచేవారు.
గద్దర్ జీవితంలో కీలక ఘట్టాలివీ...
► 1972లో బ్యాంకు ఉద్యోగం సాధించారు. ∙1975లో సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని కెనరా బ్యాంకులో ఉద్యోగంలో చేరారు.
► 1975, అక్టోబర్ 9న విమలతో గద్దర్ వివాహం చేసుకున్నారు.
► 1973 నుంచి గద్దర్ పాటలు రాయడం ప్రారంభించారు.
► 1977లో బి. నరసింగరావు ‘మా భూమి’సినిమాలో గద్దర్ ‘బండెనక బండి గట్టి’అనే పాటను పాడారు. 1978లో గద్దర్ మొదటిసారిగా జననాట్యమండలి శిక్షణా తరగతులు నిర్వహించారు. 1980లలో గద్దర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి జననాట్యమండలి సభ్యునిగా పనిచేశారు.
► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు.
► 1995లో పీపుల్స్‌వార్ పార్టీ గద్దర్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. పీపుల్స్‌వార్‌పార్టీ బహిష్కరణ తర్వాత గద్దర్ కన్నీటి పర్యంతం అయ్యారు. తర్వాత పార్టీ తిరిగి ఆయనను ఆహ్వానించింది.
► 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై ఆగంతకులు కాల్పులు జరిపారు.
► 1998లో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా గద్దర్ ఎన్నుకోబడ్డారు.
► 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్,
వరవరరావు లను తమ దూతలుగా పంపారు.
► 2010, అక్టోబర్ 9న తెలంగాణ ప్రజాఫ్రంట్ ఛైర్మన్‌గా గద్దర్ నియమితులయ్యారు.
► 2017లో గద్దర్ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. చేతిలో ఎర్రజెండా వదిలి..బుద్దుడి జెండా కట్టిన కర్రను చేతిలోకి తీసుకున్నట్టు ఆయన ఆ సందర్భంగా ప్రకటించారు.
బతుకుదెరువు నిమిత్తం పాలమూరు నుంచి నగరానికి వలస వచ్చిన నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ భూదేవినగర్ రైల్వే ట్రాక్ పక్కన వారికి ఆశ్రయం కల్పించి గద్దర్ అండగా నిలిచారు. వందలాది కుటుంబాలు ఆయన నీడలో జీవనం సాగిస్తున్నాయి. గద్దర్ మరణంతో మాకు దిక్కెవరంటూ భూదేవినగర్‌వాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
– అల్వాల్
Comments
Please login to add a commentAdd a comment