నెత్తురంటిన ఆ చేతులెవరివి బాబూ? | Sakshi Guest Column On Gaddar And Chandrababu | Sakshi
Sakshi News home page

నెత్తురంటిన ఆ చేతులెవరివి బాబూ?

Published Sat, Sep 9 2023 12:59 AM | Last Updated on Sat, Sep 9 2023 12:59 AM

Sakshi Guest Column On Gaddar And Chandrababu

కొన్నేళ్ల పాటు మావోయిస్టుగా గడిపిన అజ్ఞాత జీవితం, విప్లవ గాయకుడిగా, గ్రామాల్లో, నగరాల్లో బహిరంగ ప్రదర్శనలు ఇచ్చిన జీవితం, దశాబ్దాలుగా ఎదుర్కొన్న రాజ్య నిర్బంధం అనేవి గద్దర్‌ పాటను దాదాపు ప్రతి ఇంటికీ మోసుకెళ్లాయి. భారత దేశవ్యాప్తంగా విశిష్టమైన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక చిహ్నంగా ఆయన ఉండిపోయారు. ప్రభుత్వ ఏజెన్సీలు 1997లో ఆయనపై బుల్లెట్లు పేల్చాయి. దాదాపు 25 ఏళ్లపాటు వెన్నెముకలో దిగిన బుల్లెట్‌తోనే ఆయన జీవించారు. అలాంటి జీవితం మానవ చరిత్రలో కనీవినీ ఎరుగం. ఆ సమయంలో రాష్ట్రపాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతులకు నెత్తురంటింది. శ్మశానంలో ఉన్న గద్దర్‌ దేహంలోని బుల్లెట్‌ దీనికి శతాబ్దాలపాటు సాక్షీభూతంగా నిలుస్తుంది.

2023 ఆగస్ట్‌ 6న ప్రజాగాయకుడు గద్దర్‌ అనూహ్య మరణం, కడసారి చూడడానికి తరలి వచ్చిన వేలాది ప్రజల మధ్య బౌద్ధ ఆచారాలతో జరిగిన ఆయన ఖననం... భారతీయ కమ్యూనిస్టులకు కొత్త దారి చూపాయి. గద్దర్‌ కమ్యూనిస్టు విప్లవ గాయకుడిగా, పాటల రచయితగా, కళాకారుడిగా సుపరిచితుడు. కొన్నేళ్ల పాటు మావోయిస్టుగా గడిపిన అజ్ఞాత జీవితం, విప్లవ గాయకుడిగా, గ్రామాల్లో, నగరాల్లో బహిరంగ ప్రదర్శ నలు ఇచ్చిన జీవితం, దశాబ్దాలుగా ఎదుర్కొన్న రాజ్య నిర్బంధం అనేవి గద్దర్‌ పాటను దాదాపు ప్రతి ఇంటికీ మోసుకెళ్లాయి. ప్రభుత్వ ఏజెన్సీలు 1997లో ఆయనపై బుల్లెట్లు పేల్చాయి.

ఆ సమయంలో రాష్ట్రపాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతులకు నెత్తురంటింది. శ్మశానంలో ఉన్న గద్దర్‌ దేహంలోని బుల్లెట్‌ దీనికి శతాబ్దాల పాటు సాక్షీభూతంగా నిలుస్తుంది. గద్దర్‌ దేహాన్ని దహనం చేసివుంటే, అది గుర్తించలేని బూడిదగా మారిపోయేది. సజీవమైన చారిత్రక సాక్ష్యం మిగిలి ఉండేది కాదు. మావోయిస్టుగా జీవించినప్పటికీ, బౌద్ధ అంత్యక్రియల ద్వారా బౌద్ధ అంబేడ్కరిస్టుగా మరణించిన ఆయన, శాంతికి ప్రతినిధిగా, 25 సంవత్సరాల పాటు గాయపడిన దేహ బాధితుడిగా మనకు మిగిలిపోయారు.

దాదాపు 25 ఏళ్లపాటు వెన్నెముకలో దిగిన బుల్లెట్‌తో ఆయన జీవించారు. అలాంటి జీవితం మానవ చరిత్రలో కనీవినీ ఎరుగం. శరీరంలోని పలు అవయవాల్లో ఆరు బుల్లెట్లు దూరిన స్థితితో ఆయన మనగలిగారు. శరీరంలో ఆరు బుల్లెట్లు దూరినప్పటికీ బతికి,  చివరి వరకూ శరీరంలో ఒక బుల్లెట్‌తో జీవించినట్టు యుద్ధంలో పోరాడిన ఏ సైనికుడి గురించీ మనకు తెలీదు.

ఆ రకంగా మానవ చరిత్రలోనే గద్దర్‌ ఒక విశిష్ట వ్యక్తి. అలాంటి జీవితం ఆయన్ని అపార ప్రజాదరణ, ప్రేమాదరణలు కలిగిన మనిషిగా మార్చింది. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాలుగా విభజన జరగడానికి ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గద్దర్‌ పాడిన పాటలు, చేసిన ప్రదర్శనలు ఆయనకు ఎంతోమంది అభిమానులను సాధించిపెట్టాయి. ఆకలి, దోపిడీల నుంచి మానవ విముక్తి లక్ష్యం పట్ల ఆయన వహించిన నిబద్ధత... ఆయన్ని బాధామయ జీవితంలో గడిపేలా చేసింది.

అనంతరం 1996 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్రంకోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన వహించిన పాత్ర వల్ల ఆంధ్రా ప్రజలు ఆయన పట్ల అయిష్టత ప్రదర్శించి ఉండవచ్చు. అయితే, ఒక రచయితగా, కళాకారుడిగా గద్దర్‌ భారత దేశవ్యాప్తంగా విశిష్టమైన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక చిహ్నంగా ఉండిపోయారు.

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ ముందు అనేక తీవ్రమైన సైద్ధాంతిక అంశాలను లేవనెత్తి, 2012లో ఆ పార్టీ నుంచి విడి పోయారు. మార్క్స్, లెనిన్, మావోతోపాటు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మహాత్మా పూలే, అంబేడ్కర్‌లను కూడా గుర్తించడం ద్వారా మావోయిస్టు పార్టీ కులానికీ, వర్గానికీ వ్యతిరేకంగా పోరాడాల్సి ఉందని గద్దర్‌ ప్రతిపాదించారు. భారతదేశంలో కులం ప్రతికూల పాత్ర గురించి పాటలు రాయడం, వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.

దాంతో మావోయిస్టు పార్టీ గద్దర్‌ పనిని పార్టీ వ్యతిరేకమైనదిగా పరిగణించడమే కాదు... ఆయన అవగాహనను మార్క్సిజం కాదని ముద్రవేసి, ఆయన ప్రతిపాదనలను తిరస్కరించి, 2010లో షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. విప్లవ పార్టీ తనను బహిష్కరించడం ఖాయమని గ్రహించిన గద్దర్‌ 2012లో మావోయిస్టు పార్టీకి రాజీనామా చేశారు. అయితే భారతీయ కుల–వర్గ దోపిడీకి అనుగు ణంగా తన పార్టీ పంథాను మార్చడానికి గద్దర్‌ చేసిన ప్రయత్నం విస్మరణకు గురి కాకూడదు.

అంబేడ్కరైట్‌ నవయాన బౌద్ధమతం పట్ల తన ఆధ్యాత్మిక సామా జిక విధేయతను గద్దర్‌ బహిరంగంగా ప్రకటించారు. దళితుల, మహిళల అణచివేతపై అనేక పాటలు రాశారు. అతను ఒక యాంత్రిక మార్క్సిస్ట్, బౌద్ధ లేదా అంబేడ్కరైట్‌ కాదు. అత్యంత సున్నితత్వం కలిగిన మానవుడు. 

భారతదేశంలోని కమ్యూనిస్టు నాయకులు వర్గపోరాటంతోపాటు సామాజిక సంస్కరణలను అవసరమైన అంశంగా ఎన్నడూ అంగీకరించలేదన్న విషయం అందరికీ తెలిసిందే. భారతీయ సాంఘిక సంస్క రణలో ఆధ్యాత్మిక సంస్కరణతో పాటు శ్రమకు గౌరవం, పురుషులతో స్త్రీల సమానత్వం కూడా భాగమై ఉన్నాయి. దానికి అంతిమ రూపం ఏదంటే కుల అసమానతలను, మహిళల అసమానతలను నిర్మూలించడం. అయితే, భారతీయ కమ్యూనిస్టులు ఆధ్యాత్మిక పరంగా తమను తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు.

పైగా, ఆర్థిక నియతి వాదులుగా (ఆర్థికమే అన్నింటినీ నిర్దేశిస్తుంది అనే వాదం) వారు వర్గ ప్రశ్నలపైనే ప్రాథమికంగా దృష్టి పెట్టారు. కానీ వాస్తవానికి వారిలో ఎక్కువ మంది హిందువులుగానే మరణిస్తున్నారు. రోజువారీ జీవితంలో వారి నాస్తికత్వం ఎలాంటి సామాజిక సంస్కరణకు సంబంధించినదిగా లేదు. గద్దర్‌ తన మరణంతో వారికి ఒక పెద్ద సామాజిక, ఆధ్యాత్మిక సంస్కరణ కార్యక్రమాన్ని అందించారు.

అంబేడ్కర్‌ ఇలా అన్నారు: ‘‘నేను అంటరాని వ్యక్తిని అనే కళంకంతో జన్మించిన దురదృష్టవంతుడిని. అయితే, ఇది నా తప్పు కాదు. కానీ నేను హిందువుగా మరణించను, ఎందుకంటే ఇది నా చేతుల్లో ఉంది.’’ ఇలా ప్రకటించిన తర్వాతే ఆయన బౌద్ధుడు అయ్యారు, బౌద్ధుడిగా మరణించారు.

గద్దర్‌ అంటరాని వ్యక్తిగా జన్మించారు. అది ఆయన చేతుల్లో లేనిది. అనేక సాయుధ దళాలను కలిగి ఉన్న కమ్యూనిస్ట్‌ విప్లవ పార్టీలో పనిచేశారు. ఆయన వారి ప్రజా యుద్ధ నౌక. అయితే మరణ సమయంలో తన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించి శాంతి సందేశంతో బౌద్ధుడిగా మరణించిన అంబేడ్కర్‌ జీవన సారాంశాన్ని గద్దర్‌ గ్రహించారు. తాను జీవితాంతం సమర్థించిన తుపాకులు ఆ అంటరానితనం నుండి విముక్తి చేయలేదు. అందువల్లనే గద్దర్‌ బౌద్ధుడయ్యారు, అంటరానితనం నుండి విముక్తి పొందారు. 

ముఖ్యంగా, బూటకపు ఎన్‌కౌంటర్లలో చిత్రహింసలు పెట్టి, వంద లాది మృతదేహాలను తగులబెట్టిన ఆ రాజ్య వ్యవస్థకు వ్యతి రేకంగా పోరాడిన వ్యక్తిగా, తన శరీరాన్ని, బుల్లెట్‌ని దహనం చేసేస్తే ఆ తర్వాత తనను హింసించినట్లు ఎటువంటి ఆధారాలు మిగిలి ఉండ వని గద్దర్‌  గ్రహించారు.

ఆ మృతదేహాలను ఖననం చేసినట్లయితే, దశాబ్దాల తర్వాత కూడా వాటిని వెలికితీసి మళ్లీ పరీక్షించవచ్చు. అందువల్ల గద్దర్‌ తన శరీరంలోని బుల్లెట్‌తో పాటు ఖననం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. 1997లో చంద్రబాబు నాయుడి క్రూర పాలనకు నిదర్శనంగా ఆయన వెన్నులో బుల్లెట్‌ అలాగే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చంద్రబాబు కబ్జా చేసిన పార్టీకి ఆయన మామ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టారు. అదే సమయంలో గద్దర్‌ తెలుగు నేల అందించిన అత్యంత శక్తిమంతమైన తెలుగు రచయిత, గాయకుడు, సంభాషణకర్త.
 
గద్దర్‌ నివసించిన బస్తీలో మహాబోధి విద్యాలయం పేరుతో ఆయన స్థాపించిన ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో బుల్లెట్‌తోపాటు ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. చంద్రబాబు ఆ సమాధి వద్దకు వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేసి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1997 ఏప్రిల్‌ 6న ఏమి జరిగిందో కనీసం ఇప్పుడైనా నిజం చెప్పినట్లయితే, దేశం మొత్తం చంద్రబాబుని క్షమిస్తుంది. అలా పశ్చాత్తాపం ప్రకటించిన తర్వాత చంద్రబాబు తన జీవితాంతం కచ్చి తంగా మనిషిగా జీవించగలరు.
కంచ ఐలయ్య షెపర్డ్‌  
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement