హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటు వార్తల్లో నిజం లేదని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న స్పష్టం చేశారు. పోలీసులకు గణపతి లొంగిపోతున్నాడని, ఆ క్రమంలోనే సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. ఈ మేరకు ‘సాక్షి’తో మాట్లాడిన జంపన్న.. ‘గణపతికి అనారోగ్యం సమస్యలుంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చూసుకుంటుంది. పోలీసుల స్టేట్‌మెంట్‌లో కూడా వాళ్లు వస్తే మేము సహకరిస్తామని మాత్రమే చెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవు. గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు.మావోయిస్ట్ పార్టీ ఎదుగుదలకు గణపతి ఎంతో కృషిచేశాడు. గణపతి లొంగుబాటు కేవలం ప్రచారం మాత్రమే. డీజీపీ ఏజన్సీ పర్యటనకు గణపతి లొంగుబాటుకు సంబంధం లేదు. తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ ఉనికి కారణంగానే డీజీపీ పర్యటన ఉండొచ్చు. గణపతికి విదేశాల్లో చికిత్స అవాస్తవం. గణపతి లొంగిపోతాడని నేను అనుకోవడం లేదు’ అని జంపన్న తెలిపారు.
గణపతి ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా మాత్రమే ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment