సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్
ఇబ్రహీంపట్నం రూరల్: పింఛన్లు పెంచాలని ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వీహెచ్‌పీఎస్ నాయకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. అదే సమయంలో మంత్రి మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇబ్రహీపట్నం పర్యటన ఉండడంతో పోలీ సులు ఉరుకులు పరుగులు పెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వృద్ధాప్య, వికలాంగుల, వితంతు పింఛన్లు పెంచాలంటూ ఐదు రోజులుగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వీహెచ్‌పీఎస్ హయత్‌నగర్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. మంత్రి, ఎంపీల పర్యటన నేపథ్యంలో పోలీసులు హైరానా పడ్డారు. ఎంత నచ్చజెప్పినా దిగేందుకు గోవర్ధన్ ససేమిరా అన్నాడు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ నర్సయ్యగౌడ్ వచ్చి హామీ ఇస్తేనే దిగుతానని పట్టుబట్టాడు. దీంతో నాలుగు గంటల పాటు ఉద్రిక్తవాతావరణం నెలకొంది. చివరికి పర్యటన ముగించుకుని మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ నర్సయ్యగౌడ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు.
వీహెచ్‌పీఎస్ నాయకులు అందె రాంబాబు, కాళ్ల జంగయ్య తదితరులు వారి కాన్వాయ్‌కి అడ్డు తగిలారు. పింఛన్ల పెంపుపై స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్లపై స్పష్టత ఇచ్చారని, దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇవ్వడంతో గోవర్ధన్ టవర్ నుంచి కిందికి దిగివచ్చాడు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.