
సాక్షి, నిజామాబాద్ : పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ తనపై అకారణంగా చేయి చేసుకున్నాడని, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన గైని లక్ష్మణ్ (27) ఆదివారం మధ్యాహ్నం సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. రెండు గంటల పాటు ఉత్కంఠ సాగింది. తనకు న్యాయం చేయనట్టయితే కిందకు దూకుతానని సెల్‌ఫోన్ ద్వార సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న అతని స్నేహితులు, బంధువులు ఎంత నచ్చచెప్పినా దిగిరాలేదు. సీఐ దామోదర్ రెడ్డి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో లక్ష్మణ్ సెల్‌టవర్ దిగాడు. విచారణ జరిపి కానిస్టేబుల్‌పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు. లక్ష్మణ్ అతని భార్య మధ్య ఘర్షణ జరుగుతోంది. లక్ష్మణ్ భార్య ఆదివారం ఉదయం పోలీస్‌స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్ చేయకుండానే కానిస్టేబుల్ చేయిచేసుకోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్ సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు.