నవీపేట : భార్య పుట్టింటికి వెళ్లిందని ఆవేదనతో భర్త సెల్ టవర్ ఎక్కిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నవీపేట మండలం అభంగపట్నం గ్రామ పరిధిలోని స్టేషన్ ఏరియాకు చెందిన సుమన్.. రెండు రోజుల కిందట తన భార్య నందినితో గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన నందిని తన పది నెలలల కూతురుతో పాటు మహారాష్ట్రలోని పర్భణిలో గల తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండు రోజులుగా మద్యం సేవిస్తున్న సుమన్ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
గురువారం స్థానిక వెంకటేశ్వర్ కాలనీలోని సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. స్థానికులు గమనించి సమాచారం అందివ్వగా ఎస్సై రవీందర్‌నాయక్, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. ఎస్సై మైక్‌సెట్‌లో సుమన్‌తో మాట్లాడారు. అతని భార్యను ఒప్పించి తీసుకు వస్తానని చెప్పడంతో చివరకు కిందికి దిగాడు.