వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి మౌనిక
సాక్షి, ఖమ్మం: ‘మూడేళ్ల పాటు ప్రేమించిన యువకుడు రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నా.. ఆ తర్వాత ముఖం చాటేశాడు... నాకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు’ అని చెబుతూ ఓయువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రఘునాథపాలెంకు చెందిన మౌనిక, అదే మండలానికి చెందిన వీరబాబు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో జనవరి 8న వీరికి పోలీసుల సమక్షాన వివాహం జరిగింది. ఆ మరుసటి రోజూ మౌనికను ఆమె ఇంటి వద్ద వదిలేసిన వీరబాబు ఫోన్ ఎత్తకపోవడమే కాక, స్వయంగా వెళ్లినా ఏం సంబంధం లేదని దుర్బాషలాడుతూ వెళ్లగొట్టాడు.
ట్యాంక్ కింద వలతో ఫైర్ సిబ్బంది
దీంతో రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోలేదని, స్టేషన్ వద్ద బైఠాయించగా ఇరు కుటుంబాలు మాట్లాడుకోవాలని సూచిస్తూ పంపించారని మౌనిక ఆరోపించింది. ఈమేరకు శుక్రవారం ఖమ్మంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కిన ఆమె ఆత్మహత్యకు సిద్ధంకాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో టూటౌన్ ఎస్‌ఐ రాము, సిబ్బందిచేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ అధికారి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్ చేరుకుని మౌనిక దూకినా ఏమీ జరగకుండా ట్యాంక్ క్రింద వలలు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా మౌనిక వినకపోవడంతో చివరకు ఓ మహిళా కానిస్టేబుల్‌తో సెల్‌ఫోన్ పంపించారు.
అయితే, సెల్‌ఫోన్ తీసుకున్నాక వెంటనే దిగకపోతే దూకుతానని అనడంతో కానిస్టేబుల్ వచ్చేసింది. ఈమేరకు ఎస్‌ఐ రాము ఫోన్‌లో మౌనికతో మాట్లాడి న్యాయం చేస్తామని, వీరబాబు, ఆయన కుటుంబసభ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చచెబుతూ మళ్లీ మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను పంపించి మౌనికను కిందకు తీసుకొచ్చారు. మొత్తంగా గంటన్నర సేపు ఉత్కంఠ సాగగా ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మౌనికపై కేసు నమోదు చేయడమే కాక ఆమె వద్ద ‘తన చావుకి పురం వీరబాబు, ఆయన కుటుంబ సభ్యులే కారణం’ అని రాసి ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నామని, మౌనిక ఫిర్యాదు మేరకు వీరబాబు, కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment