సెల్‌టవరెక్కిన యువతి.. ఆపై తేనెటీగల దాడి
సిరిసిల్ల రూరల్ : పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు మోసం చేశాడని సిరిసిల్ల మండలం జిల్లెల్లలో ఓ యువతి సెల్‌టవర్ ఎక్కింది. గ్రామానికి చెందిన బొల్గం రేవతి అదే గ్రామానికి చెందిన సాయిలి రమేశ్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రేవతి ప్రస్తుతం గర్భిణీ. పెళ్లి మాట ఎత్తేసరికి రమేశ్ ముఖం చాటేశాడు. మూడురోజులుగా ఆమె ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో రేవతి గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టవర్‌పై ఉన్న తేనెటీగలు సైతం ఆమెపై దాడి చేశాయి.
చివరకు గ్రామస్తులు, పోలీసుల హామీతో ఆమె దిగి వచ్చింది. తనకు న్యాయం చేయాలని గ్రామపెద్దలను కోరింది. సిరిసిల్ల పోలీసులు విచారణ చేస్తున్నారు.