ఇళ్లమధ్య సెల్‌టవర్‌పై కాలనీవాసుల పోరాటం
ఇళ్ల మధ్య సెల్ టవర్ ఏర్పాటుచేస్తే తమ ఆరోగ్యాలు ఏం కావాలని హయత్‌నగర్‌లోని గాయత్రినగర్ వాసులు మండిపడ్డారు. జనవాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను వారు అడ్డుకున్నారు. కాలనీవాసుల పోరాటానికి స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి కూడా అండగా నిలిచారు. కాలనీలో సెల్‌టవర్ ఏర్పాటు కోసం గుంతలు తీస్తుండగా కాలనీకి చెందిన పురుషులు, మహిళలు దాన్ని అడ్డుకున్నారు. గుంతలు పూడ్పించి, యంత్రాలను వెనక్కి పంపేశారు.
సెల్‌టవర్ రేడియేషన్ వల్ల ఆరోగ్యసమస్యలు వస్తాయని ఒకవైపు చెబుతుంటే, మరోవైపు ఇళ్ల మధ్యనే ఎలా ఏర్పాటుచేస్తారని తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం కార్పొరేటర్‌తో కలిసి జీహెచ్ఎంసీ ఈస్ట్ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. కాలనీ వాసుల నుంచి గానీ, అసోసియేషన్ నుంచి గానీ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే టవర్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయడాన్ని నిరసించారు. దీనిపై విచారణ జరిపించి, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.