విశాఖపట్నంలో సెల్ టవర్‌పై లక్ష్మి
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): తన భర్త మరణించిన తరువాత తల్లిదండ్రులు, అత్తవారిచ్చిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేసినా తననెవరూ ఆదుకోలేదని.. తనకు న్యాయం చేయకపోతే కిందకు దూకి మరణిస్తానని ఓ మహిళ సెల్ టవర్ ఎక్కిన ఘటన విశాఖలో కలెక్టరేట్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. మల్కాపురం అంబేడ్కర్ కాలనీకి చెందిన బాధితురాలు ఉల్లసి లక్ష్మికథనం ప్రకారం.. ఆమె భర్త అనారోగ్యంతో మూడేళ్ల కిందట మరణించాడు. ఇద్దరు ఆడపిల్లలతో కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది. అంబేడ్కర్ కాలనీలో ఓ స్థలాన్ని తన తల్లిదండ్రులు పెళ్లి సమయంలో కట్నంగా ఇచ్చారని, ఆ స్థలాన్ని భూషణ్ అనే రిటైర్డ్ పోలీసు అధికారి కబ్జా చేశాడని, తనపై భౌతిక దాడి చేసి హింసించాడని తెలిపింది.
అంతేకాకుండా తన అత్త వారి ఊరైన నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో తన భర్త ఆస్తి 50 సెంట్ల భూమిని గోర్స సత్యారావు అనే వ్యక్తి కబ్జా చేçసి, తన పేర రాయించుకున్నాడని, ఈ విషయాన్ని మండల అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పేర్కొంది. కాగా విషయం తెలుసుకున్న కలెక్టరేట్ సూపరింటెండెంట్ సూర్యప్రకాష్ ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ ఆర్డీవో తేజ్‌భరత్ ఆమెతో మాట్లాడుతూ అన్యాయం గురించి తెలుసుకుంటున్న సమయంలో పోలీసులు వెనక నుంచి ఎక్కి చాకచక్యంగా ఆమెను పట్టుకుని కిందకు దించారు. అనంతరం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ దగ్గరకి తీసుకుని వెళ్లారు. ఆయన విచారణ జరిపించి న్యాయం చేస్తామని బాధితురాలు ఉల్లసి లక్ష్మికి హామీ ఇచ్చారు.
ఇదీ ఆమె వేదన..
ఇరవై ఏళ్ల కిందట తన తల్లిదండ్రులు అంబేడ్కర్ కాలనీలో రూ.6 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని కట్నంగా ఇచ్చారని, ఇప్పుడు ఆ స్థలాన్ని రిటైర్డ్ పోలీసు భూషణ్ అనే వ్యక్తి కబ్జా చేసి వేరే వాళ్లకు అమ్మేందుకు చూస్తున్నారని లక్ష్మి తెలిపింది. ఇదే విషయమై మాల్కపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే భూషణ్ వచ్చి తనను భౌతికంగా కొట్టాడని వాపోయింది. అక్కడ పోలీసులు గానీ, అధికారులు గానీ ఎవరూ తన బాధను పట్టించుకోకుండా భూషణ్ దగ్గర డబ్బులు తీసుకుని తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాపోయింది. అలాగే తన భర్త ఊరిలో తన అత్త పేరుతో సర్వే నంబర్253/1లో 70 సెంట్ల స్థలం ఉందని, దీని విలువ ప్రస్తుతం రూ.30 లక్షలుంటుందని తెలిపింది. దానిని గోర్స సత్యారావు అనే అతను అక్రమించి తన భూమిని ఆయన పేరుతో పట్టాలో ఎక్కించుకున్నాడని చెప్పింది. ఇదే విషయమై లెక్కలేనన్ని సార్లు నక్కపల్లి మండల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని వాపోయింది. అలాగే నక్కపల్లిలో ఉన్న హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి వెళ్లే దారిలో తనకు, తన బావకు సర్వే నంబరు 253/2లో సుమారు కోటి రూపాయల విలువైన 2.16 ఎకరాల భూమి ఉందని..దీన్ని నూకరాజు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చామని తెలిపింది. ఒప్పందం ప్రకారం జూన్ 10, 2018 నాటికి కౌలుకాలం ముగిసినా..తమకు భూమి స్వాధీనం చేయకుండా..దిక్కున్న చోట చెప్పుకోండంటున్నాడని వాపోయింది.
టీడీపీ మహిళా నేత మోసం!
మల్కాపురంలోని అంబేడ్కర్‌నగర్‌లో ఉన్న ఇంటి స్థలానికి ప్రభుత్వ పట్టా ఇప్పిస్తానని నమ్మబలికి తెలుగుదేశం పార్టీకి చెందిన రాజీమణి అనే నాయకురాలు తన వద్ద నుంచి రూ. 3 వేల లంచం తీసుకుని మోసం చేసిందని లక్ష్మి ఆరోపించింది. భూషణ్, రాజీమణి బంధువులు కావడంతో తనకు ఇంటి పట్టా రాకుండా అడ్డుకుంటున్నారని, ఏడాదిగా ఎనిమిదిసార్లు కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా.. తనకు న్యాయం జరగలేదని చెప్పింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలని.. తన అసక్తతకు ఆవేదన చెంది..ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నానని కన్నీళ్లతో చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment