లక్ష్మి, రమేష్ పెళ్లినాటి ఫొటో (ఫైల్) ,చంటి బిడ్డతో తల్లి లక్ష్మి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త తనకు కావాలని బాధితురాలు భూష లక్ష్మి వాపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత మూడేళ్లపాటు కాపురం సజావుగానే సాగిందని... భర్త తల్లిదండ్రులు(భూష లక్ష్మి అత్తామామ)మా కాపురంలోకి చొరబడి మా ఇద్దరినీ విడదీయడంతోపాటు మరో అమ్మాయితో తన భర్తకు పెళ్లి చేశారని లబోదిబోమంది. మూడు నెలల చంటిబిడ్డతో తన కాపురం ఎలా సాగుతుందని అత్తా మామను నిలదీస్తే దాడికి దిగుతున్నారని, ఈ విషయమై మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించినట్టు బాధితురాలు భూష లక్ష్మి సోమవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించింది. విశాఖ జిల్లా వడ్డాది రావికమతం గ్రామానికి చెందిన బి.రమేష్‌తో 2014 అక్టోబర్ 30న రాజాం, కంచరగ్రామం శివాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నట్టు తెలిపింది.
భర్త రమేష్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా గ్రామ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నామని, పెళ్లయిన మూడేళ్లపాటు చెన్నైలోనే కాపురం చేశామని, భార్య భర్తలిద్దరం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారిమని తెలిపింది. గత అక్టోబర్ నెలలో అత్తా మామ మా ఇంటికి(చెన్నై) వచ్చి తన కూతురు వివాహం ఉందని చెప్పి, భర్తను నా నుంచి దూరం చేసేందుకు విశాఖపట్నం తీసుకొచ్చేశారని, అప్పటి నుంచి భర్త రమేష్ తనను పట్టించుకోకుండా వదిలేశాడని చెప్పింది. ఈ ఏడాది మే నెలలో అనకాపల్లికి చెందిన సత్యతో రెండో వివాహం చేసుకున్నట్టు తనకు తెలియడంతో, ఆ విషయాన్ని నా భర్త రమేష్, అత్తా మామ, పిన్నిని నిలదీయడంతో నాపై దాడికి దిగారని ఆరోపించింది. ఈ విషయంపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపింది. ప్రస్తుతం మూడు నెలల చంటి బిడ్డతో తల్లి వద్ద తలదాచుకుంటున్నానని, పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని లక్ష్మి వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment