వ్యాపారమంతా అరచేతిలోనే!
♦ దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎం-కామర్స్
♦ భవిష్యత్తులో వ్యాపార లావాదేవీలన్నీ సెల్‌ఫోన్లలోనే..
♦ అందుకే ఈ-కామర్స్ సంస్థల సేవలు ఎం-కామర్స్‌కు బదిలీ
♦ గతంలో మింత్ర.. సెప్టెంబర్ నుంచి ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ బంద్
♦ 2018 నాటికి రూ.40 లక్షల కోట్లకు ఎం-కామర్స్ వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అయితే మాట్లాడటం. లేదంటే మెసేజ్‌లతో చాటింగ్ చేయటం. పదేళ్ల కిందటి వరకూ సెల్‌ఫోన్‌తో ఉపయోగమంటే ఇదే. కానీ అప్లికేషన్స్‌ను వినియోగించడానికి వీలయ్యే స్మార్ట్ ఫోన్లు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడైతే అరచేతిలో ఇమిడిపోయే ఈ మొబైల్ ఫోన్లు ఏకంగా వ్యాపార సామ్రాజ్యాలనే శాసిస్తున్నాయి. పెద్దపెద్ద రిటైల్ దిగ్గజాలకు సైతం చెమటలు పట్టిస్తున్నాయి. పరిస్థితి ఇపుడు ఏ స్థాయికి చేరిందంటే... ఈ-కామర్స్ అగ్రగామి సంస్థలైన మింత్ర, ఫ్లిప్‌కార్ట్ వంటివి తమ ఈ-కామర్స్ వెబ్‌సైట్లను మూసేసి.. కేవలం ఎం-కామర్స్ (మొబైల్ కామర్స్) ద్వారానే వ్యాపారం నిర్వహించాలనుకునే స్థాయికి!!. మింత్ర ఇప్పటికే ఈ పని చేయగా... ఫ్లిప్ కార్ట్ సైతం రెండు నెలల్లో మొబైల్‌కు మాత్రమే పరిమితం కాబోతోంది. 2018 నాటికి మొబైల్ కామర్స్ పరిమాణం రూ.40 లక్షల కోట్లకు (638 బిలియన్ డాలర్లు) చేరుతుందని అసోచామ్-డెలాయిట్ నివేదిక తెలిపిందంటే వృద్ధి ఏ స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం దేశంలో 23.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ఇంటర్నెట్‌ను డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ నుంచి కాక మొబైల్ ఫోన్ల ద్వారానే వినియోగిస్తున్నారు. ఎం-కామర్స్ వృద్ధి ఈ స్థాయిలో ఉండటం, కంపెనీలు కూడా దీనిపైనే దృష్టి పెడుతుండటం గురించి మై స్మార్ట్‌ప్రైస్ సంస్థ సీఈఓ సీతాకాంత రాయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘ఎం-కామర్స్ అప్లికేషన్ల ద్వారా మెట్రోలకే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు, గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాపారాన్ని సులువుగా విస్తరించవచ్చు. ఏ ఉత్పత్తిని విడుదల చేసినా ఒకే రోజు అన్ని ప్రాంతాలకూ చేరుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. తమ మొత్తం వ్యాపారంలో 35-40% వాటా మొబైల్స్ నుంచే వస్తున్నట్లు తెలిపారు. అయితే డెస్క్‌టాప్‌తో పోల్చుకుంటే సెల్‌ఫోన్ల డిస్‌ప్లే చిన్నదిగా ఉండటంతో ఆశించిన స్థాయిలో ఎం-కామర్స్ విస్తరించటం లేదని అభిప్రాయపడ్డారు.
ఎం-కామర్స్ వృద్ధికి స్మార్ట్‌ఫోన్లే బూస్ట్..
ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా ఫీచర్ ఫోన్లకు బదులు స్మార్ట్‌ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ట్యాబ్లెట్స్, డెస్క్‌టాప్‌లతో పోల్చుకుంటే స్మార్ట్‌ఫోన్ల ధరలు తక్కువగా ఉండటం. మెమొరీ ఎక్కువగా ఉండటం, బ్రౌజింగ్ సులువుగా చేసే వీలుండటం వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పుడైనా.. ఎక్కడైనా కొనుగోలు చేసే అవకాశం ఉండటమే ఎం-కామర్స్ మార్కెట్ వృద్ధికి కారణమనేది ఎవరూ కాదనలేని నిజం. దీంతో చాలా వరకు ఈ-కామర్స్, ఈ-రిటైల్ కంపెనీలు మొబైల్ యాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా తమ వ్యాపార సేవలను అందించేందుకు ఇష్టపడుతున్నాయి. అయితే ఎం-కామర్స్ సంస్థలు వినియోగదారుల విశ్వాసం పొందడం, లావాదేవీల్లో పారదర్శకత, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, భద్రతా ప్రమాణాలు పాటించటం వంటి అంశాల్లో మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందనేది నిపుణుల అభిప్రాయం.
మింత్ర, ఫ్లిప్‌కార్ట్ బాటలోనే మరిన్ని కంపెనీలు!
ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కేవలం మొబైల్ యాప్ ద్వారానే సేవలు అందించనున్నట్లు దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తన మొత్తం వ్యాపారంలో 70-75 శాతం లావాదేవీలు మొబైల్ ద్వారానే జరుగుతున్నందున మొబైల్ యాప్‌కే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునిత్ సోనీ తెలిపారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్ర.కామ్ కేవలం మొబైల్ ఫోన్ల ద్వారానే క్రయ, విక్రయాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఫ్లిప్‌కార్ట్ కూడా చేరుతోంది. సమీప భవిష్యత్తులో ఈ జాబితాలోకి అమెజాన్, క్వికర్, స్నాప్‌డీల్, మైస్మార్ట్ ప్రైజ్, జబాంగ్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు కూడా వచ్చి చేరుతాయన్నది పరిశ్రమ వర్గాల అంచనా. ఎందుకంటే ఆయా సంస్థల వ్యాపారంలో 60 శాతానికి పైగా మొబైల్ ఫోన్ల నుంచే వస్తోంది. ఇది చాలు ఈ-కామర్స్ స్థానాన్ని ఎం-కామర్స్ వెబ్‌సైట్లు, యాప్‌లు ఎలా ఆక్రమిస్తున్నాయో తెలియటానికి.
రూ.12 వేల కోట్ల నుంచిరూ.40 లక్షల కోట్లకు..
దశాబ్ద కాలం నుంచి దేశంలో మొబైల్ ఫోన్ల ద్వారా కొనుగోళ్లు జరిపే వారి సంఖ్య శరవేగంగా పెరిగినట్లు అసోచామ్-డెలాయిట్ నివేదిక తెలిపింది. 2010లో దేశంలో సెల్‌ఫోన్ల ద్వారా జరిగిన క్రయ, విక్రయాల విలువ కేవలం రూ.12,600 కోట్లు (2 బిలియన్ డాలర్లు). అయితే 2018 నాటికిది రూ.40 లక్షల కోట్లకు (638 బిలియన్ డాలర్లు) చేరుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో ఎం-కామర్స్ మార్కెట్ రూ.15 లక్షల కోట్లుగా ఉంది. వ్యాపార సంస్థల అమ్మకాలు, ఆదాయం పెరగడానికి ఈ-కామర్స్ సంస్థల మొబైల్ అప్లికేషన్లు దోహదపడుతున్నాయనేది నివేదిక సారాంశం. దీనికితోడు రోజురోజుకూ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు పెరుగుతుండటాన్ని ఆసరా చేసుకుని ఈ-కామర్స్ సంస్థలూ ఎం-కామర్స్ స్లెట్లు, యాప్‌ల వైపు దృష్టిసారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.